రామ్ పోతినేని – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా స్కంద. బాలయ్యతో అఖండ లాంటి అరివీర భయంకరమైన మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమా స్కంద. ఇప్పటికే టీజర్లు, రెండు ట్రైలర్లు చూస్తుంటేనే సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో క్లారిటీ వచ్చేసింది. సినిమా ఫక్తు బోయపాటి మార్క్ యాక్షన్ డ్రామాగా ఉండనుందని తెలిసిపోయింది. ఇక శ్రీలీల అందాలు కూడా సినిమాకు యాడ్ కానున్నాయి. కంప్లీట్ బోయపాటి స్టైల్లో ఉంటుందన్న అంచనాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కంద ఏ రేంజ్లో ఉందో చూద్దాం పదండి…
కథ: పెళ్లి పీఠలపై కూర్చున్న ఆంధ్రా సీఎం కూతురిని తెలంగాణ సీఎం కొడుకు వచ్చి లేపుకుపోతాడు. అక్కడ నుంచి ఇద్దరి మధ్య వైరం మొదలవుతుంది. ఆంధ్రా సీఎం పగతో తెలంగాణ సీఎంతో పాటు అతడి కొడుకును చంపేందుకు ఓ యువకుడు ( రామ్) ను పంపుతాడు. అతడు తెలంగాణ సీఎం కూతురు కాలేజ్‌లోకి ఎంటర్ అయ్యి ఆమెకు దగ్గరై ఆమె ద్వారా ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ జరుగుతున్న తెలంగాణ సీఎం కొడుకు, ఏపీ సీఎం కూతురు ఎంగేజ్మెంట్ ఆపేసి ఇద్దరు సీఎంల కూతుళ్లను తీసుకుని తన ఊరుకు వెళ్లిపోతాడు. ఈ కిడ్నాప్‌లకు తూర్పు గోదావరి జిల్లాలోని రుద్రరాజుపురంకు ఉన్న లింక్ ఏంటి ? ఈ మధ్యలో క్రౌన్ గ్రూప్ కంపెనీస్ అధినేత రామకృష్ణం రాజు ( శ్రీకాంత్) కు ఉన్న లింక్ ఏంటి ? కిడ్నాప్ అయిన సీఎంల కూతుళ్లు ఏమయ్యారు ? మధ్యలో మరో హీరోయిన్ సయి మంజ్రేకర్ పాత్ర ఏంటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: మాస్ సినిమాలు అంటే టాలీవుడ్లో ముందుగా గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. తనకంటూ సపరేట్ ఇమేజ్ బోయపాటి క్రియేట్ చేసుకున్నాడు. బోయపాటి సినిమాల్లో కథలకు లాజిక్‌లు ఉండవు. ఆయన హీరోలు సూపర్ హీరోల్లా, అతీతశక్తులతో విలన్లను ఊచకోత కోస్తూ విరుచుకు పడుతూ ఉంటారు. అసలు ఆయన సినిమాల్లో మాస్ యాక్షన్ అనేది లార్జర్ దెన్ లైఫ్ రేంజ్లో ఉంటుంది. ఈ సినిమా కూడా అందకు మినహాయింపు కాదు. అయితే కొన్ని చోట్ల ఆయన మాస్ మరి మితిమీరిపోయినట్లుంది. ఫస్టాఫ్‌లో ఇద్దరు సీఎంల వైరంతో పాటు రామ్ – శ్రీలీల మధ్య వచ్చే కాలేజ్ సీన్లు, అదిరిపోయే ఇంటర్వెల్‌తో సినిమా నడిపించిన బోయపాటి సెకండాఫ్‌లో ఫ్యామిలీ, పల్లెటూరి వాతావరణం… బంధువులు, మిత్రుల బావోద్వేగాలను చక్కగా చూపించారు. సినిమా స్టార్టింగ్‌తోనే బోయపాటి డైరెక్టుగా కథలోకి వెళ్లిపోయాడు. ఏపీ సీఎం కూతురు పెళ్లి జరుగుతుంటే తెలంగాణ సీఎం కొడుకు వచ్చి లేపుకుపోవడం… వెంటనే ఏపీ సీఎం తెలంగాణ సీఎంతో పాటు అతడి కొడుకును చంపాలని ప్లాన్ చేయడం… దానిని దున్నపోతు ఫైటింగ్‌తో హీరో రామ్ అడ్డుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. సెకండాఫ్‌లో ఫ్యామిలీ బంధాలు ఎలా ఉండాలో ? ప్రధాన పాత్రలతో చెప్పించిన డైలాగులు బాగున్నాయి.
స్నేహితుల అనుబంధం కూడా చక్కగా ప్రజెంట్ చేశాడు. ప్రస్తుత ఏపీరాజకీయాల్లో పరిస్థితులతో పాటు ఉచిత పథకాలపై దర్శకుడు పేల్చిన సెటైర్లు బాగా పేలాయి. ఇక క్లైమాక్స్ మరో రేంజ్లో ఉంది. అక్కడ రెండో రామ్ ఎంట్రీ ట్విస్ట్ బాగుంది. చివర్లో స్కంద సినిమాకు సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు.
ఈ సినిమాలో రామ్ పాత్ర రెండు కోణాల్లో సాగుతూ చాలా షాకింగ్‌గా ఉంటుంది. ఇటు సీమ యాసలోనూ, అటు తెలంగాణ స్లాగ్లోనూ డైలాగులు చెపుతాడు. రామ్ బోయపాటికి కావాల్సినట్టుగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి పడేశాడు. రామ్ యాక్షన్, డ్యాన్సులు, ఫైట్లలో రామ్ అదరగొట్టేశాడు. మనం సరికొత్త రామ్‌ను చూస్తాము. చిట్టి చిట్టి సాంగ్‌లో రామ్ ఎనర్జిటిక్‌గా స్టెప్పులు వేశాడు. రామ్‌తో పోటీపడుతూ శ్రీలీల కురచ దుస్తులతో స్టెప్పులు అదరగొట్టేసింది. ఈ సినిమాలో సరికొత్త రామ్‌ను చూస్తాం. రామ్ డైలాగ్ డెలివరీతో పాటు యాక్టింగ్ కొత్తగా ఉంటుంది. బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ పల్లెటూరి సాంగ్‌తో పాటు తన పాత్రకు న్యాయం చేసింది. ఇక రామకృష్ణం రాజుగా శ్రీకాంత్, రామ్ తండ్రిగా దగ్గుబాటి రాజా పాత్రలకు న్యాయం చేశారు. ఇక సీనియర్ నటీమణులు గౌతమి, ఇంద్రజతో పాటు సెకండాఫ్‌లో తెరనిండా కావాల్సినంత నటీనటులున్నారు. ఇక సీఎంలుగా అజయ్ పూర్కర్, శరత్ లోహితాశ్వ పవర్ ఫుల్ కన్నింగ్ సీఎంలుగా మెప్పించారు. సీనియర్ నటుడు పృథ్వి కూడా నెగటివ్ రోల్లో పాత్రకు న్యాయం చేశాడు. ఇక యంగ్ హీరో ప్రిన్స్, ప్రభాకర్ కూడా విలన్‌గా కనిపిస్తారు.
థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం షేక్ చేసి పడేశాడు. యాక్షన్ సీన్లలో మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్‌తో సినిమాను నిలబెట్టాడు. సినిమా స్టార్టింగ్ నుంచి 20 నిమిషాల పాటు వచ్చే నేపథ్య సంగీతం కూడా చాలా హైలెట్. సంతోష్ దేటకే సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి పెట్టిన ప్రతి ఖర్చు తెరమీద చాలా రిచ్‌గా కనిపించింది. ఎడిటింగ్ ఫక్తు మాస్ సినిమా కావడంతో మరీ ట్రిమ్ చేయడానికి స్కోప్ లేదు. ఇక బోయపాటి దర్శకుడిగా మాస్ కథపై పూర్తిగా పట్టు సాధించాడు. కథ కాస్త బలహీనంగా ఉన్నా తనదైన మాస్ ఎలివేషన్లు, పంచ్ డైలాగులు… అదిరిపోయే యాక్షన్ సీన్లతో సినిమాను లాగించేశాడు. బోయపాటి సినిమా నుంచి మనం ఎక్కువుగా ఏం ఆశించనక్కర్లేదు. మాస్ జనాలను మెంటలెక్కిస్తాడు… వాళ్లను ఉర్రూతలూగించేస్తాడు. ఈ సినిమాలోనూ అదే ఆడియెన్స్‌ను టార్గెట్‌గా పెట్టుకుని సినిమా తీశాడు… గో అండ్ వాచ్ ఇట్… !!!
రేటింగ్: 3.25