మెసేజ్ ఇచ్చే… నేనే సరోజ

సినిమా అంటే వినోదాత్మకంగానే కాదు… సమాజానికి సందేశాత్మకం గానూ ఉండాలన్న ఆలోచనతో… అమ్మాయిలను దుర్మార్గుల నుంచి సేవ్ గర్ల్స్ అనే కాన్సెప్ట్ తో రచయిత డా.సదానంద్ శారద S-3 క్రియేషన్స్ పతాకంపై శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నేనే సరోజ ‘ఉరఫ్ కారంచాయ్. శాన్వి మేఘన, కౌశిక్ బాబు ఇందులో జంటగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా సమాజానికి ఏమాత్రం సందేశం ఇచ్చిందో చూద్దాం పదండి.

కథ: ఓ చిన్న పల్లెటూళ్లో పుట్టి పెరిగిన పేదింటి అమ్మాయి సరోజ(శాన్వి మేఘన). చదువుకుని మంచి డాక్టర్ అయ్యి… గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే తపన ఉన్న అమ్మాయి. అయితే తండ్రి మాత్రం చదువు వద్దు… నువ్వు పుట్టడమే నాకు మైనస్… అదే అబ్బాయి అయితే కట్న కానుకలు తెస్తడు, అదే నీకైతే మమే ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి… ఇక చదివింది చాలు… పెళ్లి చేసుకో అనే రాచి రంపాన పెడుతుంటాడు. అయితే సరోజ తల్లి మాత్రం… ఎలాగైన తన కూతురుని డాక్టర్ చేయాలనే పట్టుదలతో ఉంటుంది. ఈ క్రమంలో భార్య భర్తలిద్దరూ తగువులాడుకుంటారు. ఈ తగువులాటలో తన తండ్రిని వారించబోగా… అతని తలకు బలమైన గాయం అవుతుంది. దాంతో సరోజ ఇల్లు విడిచి పట్టణానికి పారిపోయి వస్తుంది. ఇలా పారిపోయి వచ్చిన సరోజ…. తన పై చదువులను ఎలా కొనసాగించింది, తనకు సహాయం చేసిన వ్యక్తి ఎవరు? అసలు తన తండ్రి చావు బతుకుల మధ్య నుంచి బయటపడ్డాడా? సరోజ వైద్యురాలిగా మారడానికి కాలేజీ జీవితంలో ఎలాంటి ఆటు పోట్లను ఎదుర్కొని… సాటి మహిళా విద్యార్థినులకు అండగా నిలిచిందనేదే మిగతా కథ.

కథ… కథనం విశ్లేషణ: సమాజంలో అమ్మాయిలు పుట్టుక దగ్గర నుంచి జీవితంలో స్థిరపడేదాకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మాయి పుట్టడమే కుటుంబానికి మైనస్ అనే తలంపుతో ఉన్న చాలా మంది తండ్రులకు ఇలాంటి సినిమా ఓ మంచి మెసేజ్ ఇస్తుంది. అమ్మాయి అయనా అబ్బాయి అయినా ఒకటే… వారిని సరైన మార్గంలో పెంచి… విద్యాబుద్ధులు నేర్పిస్తే… సమాజంలో వారే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని ఇందులో కొన్ని కొన్ని ఉదాహరణలతో అమ్మాయిల మనో స్థైర్యాన్ని పెంచారు దర్శకుడు. చదుకునే అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేయడం, ప్రేమను ఒప్పుకోకపోతే వారి మీద దాడులు చేయడం, అధికార మదంతో అమ్మాయిలను బలవంతంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం, వర్క్ ప్లేసులో వేధింపులు, పాఠశాల, కళాశాలల్లో ఉపాధ్యాయుల వేధింపులు తదితర వాటిని ఇందులో చూపించి… వాటిని సరోజ ఎలా తిప్పికొట్టిందనేది చాలా చక్కగా… అమ్మాయిలకు ఉపయోగపడేలా చపించారు. గ్రామీణ ప్రాంతాలలో పెరిగే అమ్మాయిలతో పాటు… పట్టణ ప్రాంతాల్లో పెరిగిన అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ఎలా లైంగిక వేధింపులకు గురవుతున్నారు… వాటిని ఎలా ఎదుర్కోవాలనేది ఓ చిన్న సాంకేతిక అలర్ట్ నెస్ తో ఇందులో చూపించారు.
టైటిల్ రోల్ పోషించిన శాన్వి మేఘన ఇందులో చలాకీ అమ్మాయిగా నటించి మెప్పించింది. తేడా వస్తే… తన కరాటే విన్యాసాలతో అబ్బాయిల మక్కీలు ఇరగ్గొట్టే గడుసు అమ్మాయి పాత్రలో మెప్పించింది. యాక్షన్ సీన్స్ ను చాలా అవలీలగా చేసింది. గ్రామీణ యువతి నుంచి వైద్య విద్యార్థినిగా ఎదిగే క్రమంలో శాన్వి ట్రాన్స ఫర్మేషన్ చాలా బాగుంది. ఆమెకు జోడీగా నటించిన కౌశిక్ పాత్ర ఓకే. ఓ సాధారణ యువకుని పాత్రలో పర్వాలేదు అనిపించాడు. శాన్వి తండ్రిగా, ఆమె మామగా వేసిన పాత్రలు కూడా బాగున్నాయి. కళాశాలలో వచ్చే క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. వాళ్లు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుమన్, చంద్రమోహన్ కాసేపు ఉన్నా… తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే… దర్శకుడు శ్రీమాన్ గుమ్మడవెల్లి అమ్మాయిలపై ఇంట బయట జరుగుతున్న అఘాయిత్యాలు, దౌర్జన్యాలను బాగా స్టడీ చేసి… ఈ చిత్రం కథ… స్క్రేన్ ప్లేను రాసుకున్నారు. అందుకే చాలా న్యాచురల్ గా శాన్వి పాత్రను తీర్చిదిద్దారు. ఎక్కడా ఓవర్ బిల్డప్ లు, ఎలివేషన్స్ ఇవ్వకుండా… సిచ్యుయేషన్స్ కి తగ్గట్టుగా సంభాషణలు గానీ, యాక్షన్ సీన్స్ గానీ ఇందులో తెరమీద చూపించారు. సినిమా మొత్తానికి ఈమె పాత్రనే హైలైట్ కాబట్టి… అందుకు తగ్గట్టుగానే స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం బాగా కుదిరింది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాత డాక్టర్ సదానంద శారదా… ఈ సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. అమ్మాయిల తల్లిదండ్రులకు కొండంత భరోసానిచ్చి… ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *