కార్తికేయ గుమ్మడికొండ… ఆర్.ఎక్స్.100తో వెండితెరపై బుల్లెట్ లా దూసుకొచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తికేయ… ఆ తరువాత విడుదలైన వరుస చిత్రాలతో మినిమం గ్యారెంటీ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా… ఆచితూచి కథలను ఎంచుకుంటూ ముందుకుపోతున్నాడు ఈ యువ హీరో. ఇటీవల విడులైన ‘బెదురులంక’ సినిమాతో మరింత క్రేజ్ సంపాధించుకున్న కార్తికేయ… తాజాగా ‘భజే వాయు వేగం’తో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని ప్రభాస్ తాలూకాకు సంబంధించిన ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై నిర్మించారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ప్రశాంత్ రెడ్డికి వుంది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మరి ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.
కథ: వరంగల్ జిల్లా రాజన్నపేట గ్రామానికి చెందిన రైతు(తనికెళ్ల భరణి)కి ఓ కుమారుడు రాజు(టైసన్) ఉంటారు. తన కుమారునితో పాటు తన స్నేహితుని కుమారుడు వెంకట్(కార్తికేయ)ను కూడా తన కుమారునిలాగానే పెంచి పెద్దవాణ్ని చేస్తాడు. రాజును నేమో చదువుల్లో ప్రోత్సహిస్తారు… వెంకట్ ను తనకు ఇష్టమైన క్రికెట్ లో కోచింగ్ ఇప్పించి మంచి క్రికెట్ ప్లేయర్ ని చేస్తారు. అయితే ఇంతలో వీరి తండ్రి అనారోగ్యానికి గురికావడం… వైద్య చికిత్సకోసం ఓ రూ.8 లక్షలు కావాల్సి రావడంతో… వెంకట్ తన కెరీర్ ను ఫణంగా పెట్టి ఓ రూ.4లక్షలు తీసుకొచ్చి… దాన్ని క్రికెట్ట బెట్టింగ్ లో పెట్టి… డబుల్ చేయాలని చూస్తాడు. అనుకున్నట్టు గానే క్రికెట్ బెట్టింగ్ లో గెలిచినా… ఆ డబ్బు ఇవ్వకుండా బుకీ(టెంపర్ వంశ) మోసం చేసి… పైగా తననే రూ.40 లక్షలు బాకీ… ఇంట్లో ఉన్న రూ.4 లక్షలు తీసుకుని… మిగత 36 లక్షలు రాత్రి 9గంటలలోగా తెచ్చివ్వాలని వెంకట్ ను బెదిరిస్తాడు. మరి బుకీ బెదిరింపులకు భయపడి… 36 లక్షలు ఇచ్చాడా వెంకట్… తన తండ్రి చికిత్సకోసం డబ్బులు ఎలా సమకూర్చాడు? విలన్లకు(రవిశంకర్, శరత్ లోహితస్వ)లకు, బుకీ వంశీకి ఉన్న కనెక్షన్ ఏంటి? విలన్లలో ఒకరైన డేవిడ్… వెంకట్ చేతిలో ఎలా ఇరుక్కున్నారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: క్రైం థ్రిల్లర్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే డెబ్యూ దర్శకులు ఇలాంటి కథలను ఎంచుకుని… బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని చూస్తుంటారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో.. గ్రిప్పింగ్ గా తెరమీద ఆవిష్కరించగలిగితే… ఇలాంటి కథలను బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అందుకే నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి… సమాజంలో యువతను పట్టి పీడిస్తున్న క్రికెట్ బెట్టింగ్, డ్రగ్స్ ను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ క్రైం థ్రిల్లర్ ఫస్ట్ హాఫ్ స్లోగా సాగినా… ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకెండాఫ్ పై అంచనాలను పెంచేస్తుంది. ఇక సెకెండాఫ్ లో వచ్చే వన్ బై వన్ ట్విస్ట్ లు ఆడియన్స్ ను థ్రిల్ కు గురి చేస్తాయి. ఎక్కడా బోరింగ్ లేకుండా సాగే సెకెండాఫ్ తో సినిమా పరుగులు పెడుతుంది. ఈ సినిమాలో ఎక్కువగా పాటలు లేకపోవడం కూడా ఓ ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ‘సెట్టయిందే…’ పాట తప్ప.. సెకెండాఫ్ లో పెద్దగా పాటలు లేకపోవడంతో సినిమా చాలా రేసీగా సాగుతుంది. ఈ వీకెండ్ లో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ‘భజే వాయు వేగం’. గో అండ్ వాచ్ ఇట్.
హీరో కార్తికేయ ఇందులో ఓ డిఫరెంట్ పాత్రలో… తన మార్కు నటనతో ఆకట్టుకున్నాడు. సందర్భానుసారం వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో తన రౌద్రరూపం చూపించి… మాస్ ను బాగా ఎంటర్టైన్ చేశాడు. తన కెరీర్ లో నిలిచిపోయే సినిమా ఇది. అతనికి జంటగా నటించిన ఐశ్వర్యమీనన్ కూడా తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. హ్యాపీడేస్ ఫేం రాహుల్ టైసన్ ఇందులో ఓ కీలకపాత్రలో నటించి మెప్పించారు. సాయికుమార్ సోదరుడు రవిశంకర్ నటన ఆకట్టుకుంటుంది. తన మార్కు డైలాగులతో ఆకట్టుకున్నారు. నటుడు శరత్ లోహితస్వ తన మార్కు నటనతో పరిధిమేరకు నటించి మెప్పించారు. అలాగే సీనియర్ నటుడు తనికెళ్ల భరణి తన పాత్రకు న్యాయం చేశారు. హీరో స్నేహితుని పాత్రలో నటించిన సుదర్శన్ కూడా ఆకట్టుకున్నారు. విలన్ గ్యాంగ్ తరఫున హీరోను వెంటాడే పాత్రలో నటుడు కృష్ణ చైతన్య కూడా రౌద్ర రూపం ప్రదర్శించారు. విలన్ కుమారుని పాత్రలో నటించిన గగన్ పాత్ర పర్వాలేదు. హీరో తల్లిపాత్రలో నటించిన యాంకర్ కం నటి గాయత్రి భార్గవి కాసేపు ఉన్నా… మెప్పించారు. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు ప్రశాంత్ రెడ్డికి ఇది డెబ్యూ ఫిల్మే అయినా… సెకెండాఫ్ ను బాగా డీల్ చేశారు. ఫస్ట్ హాప్ లో కొంత వేగం తగ్గినా… ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి సినిమాని పరుగులు పెట్టించారు. కార్తికేయతో ఎక్కడా హీరోయిజం చూపించకుండా… కేవలం కథాబలం మీదనే నడిపించారు. దాంతో సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకునేలా తెరమీద చూపించారు. ఈ చిత్రానికి బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ప్లస్ అయింది. ద్వితీయార్థంలో నేపథ్య సంగీతం కీ రోల్ పోషించిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ సంస్థ… తన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఖర్చు పెట్టింది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో… సరదాగా చూసేయండి.
రేటింగ్: 3