విశ్వక్ సేన్… తనను తాను ప్రతి సినిమాకి ఛేంజ్ చేసుకుంటూ… తెలుగు ప్రేక్షకుల్లో ఓ మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఫలక్ నుమా దాస్ నుంచి… ఈ రోజు విడుదలైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’దాకా అతని సినిమాలన్నీ వేటికవే యూనిక్ అని చెప్పొచ్చు. మొన్నటి దాకా తెలంగాణ యాసతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్… ఇప్పుడు గోదావరి యాసతో అలరించడానికి మన ముందుకొచ్చారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ‘రౌడీ ఫెలో’ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలావుందో చూద్దాం పదండి.
కథ: రత్నాకర్ అలియాస్ లంకల రత్న (విశ్వక్సేన్) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. తన ధైర్యం, తెగువతో ఎమ్మెల్యే దొరస్వామిరాజుకు నమ్మిన బంటుగా మారుతాడు. కొన్ని పరిణామాలతో దొరస్వామిరాజుకు (గోపరాజు రమణ) వ్యతిరేకంగా రత్న ఎన్నికల్లో పోటీ చేస్తాడు. నానాజీ (నాజర్) సహాయంతో ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే రత్న జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. రత్న జైలు పాలవుతాడు? ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించిన రత్నను… ప్రజలు ఎందుకు ద్వేషించారు? లంకల రత్న టైగర్ రత్నగా ఎలా మారాడు? లంకల రత్నను ప్రేమించిన పెళ్లాడిన బుజ్జి (నేహాశెట్టి)అతడిని చంపడానికి ఎందుకు ప్రయత్నించింది? రత్నకు వేశ్య రత్నమాలతో (అంజలి) ఉన్న సంబంధం ఏమిటి? శత్రువుల్ని ఎదురించి రత్న తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కథ.
కథ… కథనం విశ్లేషణ: ఇప్పటి వరకూ మనం గోదావరి అందాలను మాత్రమే చూశాం. పెద్ద వంశీ నుంచి నేటితరం దర్శకుల వరకూ ఇప్పటి వరకూ గోదావరి నదీ అందాలను అక్కడి విలేజ్ డ్రామాను బేస్ చేసుకుని తీసిన సినిమాలనే చూశాం. ఇప్పుడు దర్శకుడు కృష్ణ చైతన్య… ఓ మాస్ స్టోరీతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే పేరుతో మన ముందుకు వచ్చారు. గోదావరి చుట్టూ కొన్ని లంకలుంటాయి. అక్కడ వుండే కొన్ని గ్యాంగ్స్ ను బేస్ చేసుకుని రాసుకున్న సినిమా అని డైరెక్టర్ చెప్పారు. దానికి విశ్వక్ సేన్ ను కథానాయకుడిగా ఎంచుకుని… అందాల బ్యూటీ నేహా శెట్టి… తెలుగు హీరోయిన్ అంజలిని ఎంచుకుని తెరకెక్కించిన ఈ చిత్రం రా అండ్ రస్టిక్ గా ఉంది. ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు దర్శకుడు. లోకల్ పాలిటిక్స్ ను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ ను మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.
నటీనటుల విషయానికి వస్తే విశ్వక్సేన్ రత్నాకర్ అనే పాత్రలో అదరగొట్టేశాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో విశ్వక్ మాస్ పాత్రలో చెల రేగి పోయి నటించాడు. యువకుడిగా, మధ్య వయస్కుడిగా రెండు భిన్నమైన పాత్రలలో కనిపించిన విశ్వక్… మొత్తం మీద వన్ మ్యాన్ షో నడిపించాడు. నేహా శెట్టికి చాలా మంచి పాత్రే పడింది. నేహాతో పోలిస్తే అంజలికి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఇక హీరో హీరోయిన్ల తర్వాత నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర గోపరాజు రమణదే. నాటక బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన దొరస్వామి రాజు అనే పాత్రలో జీవించాడు. నాజర్ పాత్ర చిన్నది అయినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ఇక ప్రవీణ్, హైపర్ ఆది, పమ్మి సాయి వంటి నటులు ఉన్నారు అని బలవంతపు కామెడీ చేయించకుండా ఉన్నంతలో సిచువేషనల్ కామెడీతో ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఒకటి రెండు సీన్స్ లో ఇబ్బంది పెట్టినా చాలా వరకు సినిమాకి ప్లస్ అయ్యేలా ఇచ్చాడు. దర్శకుడు చైతన్య కృష్ణ రాసుకున్న డైలాగ్స్ చాలావరకు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. అలాగే స్పెషల్ సాంగ్ ఒక రేంజ్ లో వర్కౌట్ అయింది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిడివి విషయంలో కూడా కొంత తగ్గించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. గోదావరి అనగానే గ్రీనరీకి అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షకులకు సినిమాటోగ్రఫీ విషయంలో కాస్త కొత్త ప్రయోగం కళ్ళ ముందుకు వచ్చినట్లు అనిపించింది. గ్రే షేడ్స్ తో సినిమాటోగ్రఫీ ని నడిపించారు. ఇక పీరియాడిక్ సినిమా కావడంతో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా వరకు కనిపించింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3.25