ప్రిన్స్ నటించిన సినిమా కలి. నరేష్ అగస్త్యన్, నేహా కృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. శివ శేషు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ పతాకంపై లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ కలి ఆడియెన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: పూర్వీకులు సంపాధించిన ఆస్తులతో జీవితాన్ని ఎంజాయ్ చేసే శివరాం (ప్రిన్స్) కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. నిస్వార్ధంగా ఉంటూ ఎవరికైనా ఆపద వస్తే సాయం చేసే గుణం చూసి అతడిని ప్రేమించి వేద(నేహా కృష్ణన్) పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొంటుంది. అయితే కొందరు చేసిన మోసంతో ఆస్తులన్నీ పోగొట్టుకొంటాడు. చివరకు డిప్రెషన్లోకి వెళ్లి సూసైడ్‌కు ప్రయత్నిస్తాడు. శివరాం తన ఆస్తులను ఎలా పొగొట్టుకొన్నాడు? సంపన్నుడిగా ఉన్న స్థాయి నుంచి బికారీగా మారిన తర్వాత శివరాం ఎదురైన సమస్యలు ఏమిటి? ప్రేమించి పెళ్లి చేసుకొన్న వేద ఎందుకు వదిలేసి వెళ్లింది? ఆత్మహత్య చేసుకొనేంతగా శివరాంకు ఎదురైన కష్టాలు ఏమిటి? శివరాం నిజంగా ఆత్మహత్య చేసుకొన్నాడా? ఆత్మహత్య తర్వాత ఏం జరిగింది? శివరాంకు కలి ఎందుకు ఎదురుపడ్డాడు? కలికాలం నుంచి శివరాం ఎలా బయటపడ్డాడు? శివరాం, కలి మధ్య నడిచిన గేమ్ ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: జీవితంలో సమస్యలు ఎదురైతే సూసైడ్ పరిష్కారం కాదు. మరణం వల్ల జరిగేది ఏమీ ఉండదు. అర్ధాంతరంగా జీవితాన్ని వదిలేస్తే.. మనల్ని నమ్ముకొన్న వారి పరిస్థితి ఏమిటి అనే కోణంలో మంచి పాయింట్‌తో కథ రాసుకొన్నాడు. కానీ ఫస్టాఫ్‌లో కథలోకి వెళ్లడానికి కొంత టైమ్ తీసుకొన్నప్పటికీ.. సెకండాఫ్‌లో కలి, శివరాం మధ్య నడిపించిన డ్రామా, ఎమోషన్స్ అద్బుతంగా ఉన్నాయి. ఒకరకంగా ఈ సినిమా ప్రయోగాత్మక చిత్రమే అయినా భావోద్వేగాలను బాగా పడించే ప్రయత్నం చేయడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. ఓ గేమ్ ప్రధానంగా సాగే డ్రామాలో మరింతగా ఎమోషన్స్ జొప్పించి ఉంటే ఇంకా బెటర్‌గా ఉండేదనిపిస్తుంది.
కలి సినిమా మొత్తం రెండు పాత్రలతో సాగే మూవీ. ప్రిన్స్, నరేష్ ఆగస్త్య సినిమాను తమ పాత్రలతో నడిపించిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వారిద్దరూ పోటాపోటీగా నటించారు. ఆ పాత్రలకు రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. మిగితా వారందరూ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
కలి సినిమాకు టెక్రికల్ అంశాలు బలంగా నిలిచాయి. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అంశాలు సినిమాను రిచ్‌గా మార్చాయి. జీవన్ బాబు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఎడిటర్ విజయ్ కట్స్ అనుసరించిన విధానం బాగుండటంతో సినిమా రేసీగా ఉంటుంది. నిశాంత్ కొటారి, రమణ జాగర్లమూడి సినిమాటోగ్రఫి సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేసింది. రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై లీలాగౌతమ్ వర్మ అనుసరించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌గా ఉన్నాయి. కథపై మరింత కసరత్తు చేసి ఉంటే.. మూవీ డెఫినెట్‌గా మంచి థ్రిలర్ అయి ఉండేదనిపించింది.
సూసైడ్ వల్ల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చక్కటి మెసేజ్ ఉన్న సినిమా. రెగ్యులర్, రొటీన్ అంశాలకు భిన్నంగా సినిమా ఉంటుంది. ప్రయోగాత్మకంగా, డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాలు మంచి అనుభూతిని అందిస్తాయి. రెగ్యులర్ ఆడియెన్స్ ఈ వారం థియేటర్లో చేసేందుకు మంచి ఛాయిస్. అంచనాలు లేకుండా వెళితే ఓ డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3