ఇస్మార్ట్ శంకర్‌… మాస్ ఎంటర్టైనర్

0
285

నటీనటులు : రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, షియాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి
సంగీతం : మణిశర్మ
నిర్మాత : పూరి జగన్నాథ్, చార్మీ
దర్శకత్వం : పూరి జగన్నాథ్‌
రేటింగ్: 3/5
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో సినిమా అనగానే… ప్రేక్షకుల్లో ఓ రేంజులో ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. అందులోనూ మాస్ ఎంటర్టైనర్ జోనర్ కావడంతో… యూత్ కి కావాల్సిన అన్ని మసాలాలు ఇందులో వున్నాయని ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టుగానే… ట్రైలర్స్ లో బోలెడంత యూత్ కంటెంట్ ను శాంపిల్ గా చూపించేశారు కూడా. యూత్ కే కాదు.. మాస్ ను మెప్పించే బోలెడన్ని బుల్లెట్ లాంటి డైలాగులు కూడా రుచి చూపించేశారు. వీటికి తోడు ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు కూడా వుండటంతో సినిమాపై బోలెడన్ని అంచనాలేర్పడ్డాయి. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ ఏమాత్రం అలరించాడో చూద్దాం పదండి.

కథ : శంకర్‌ (రామ్‌ పోతినేని) ఓల్డ్ సిటీలో సెటిల్మెంట్స్‌ చేసే కుర్రాడు. ఓ డీల్ విషయంలో పరిచయం అయిన చాందిని (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఆ సమయంలోనే పొలిటీషియన్‌ కాశీ రెడ్డిని చంపిన కేసులో జైలుకు వెళతాడు. జైలు నుంచి తప్పించుకున్న శంకర్‌ మెదడులోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు సైంటిస్ట్‌ పింకీ (నిధి అగర్వాల్‌). అసలు శంకర్‌ మెదడులో మరో వ్యక్తి జ్ఞాపకాలను ఎందుకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు? పొలిటీషియన్ కాశీరెడ్డిని శంకరే చంపాడా? శంకర్‌కి సీబీఐ ఆఫీసర్‌ అరుణ్‌ (సత్యదేవ్‌)కి సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే ‘ఇస్మార్ట్ శంకర్’పై ఓ లుక్ వేయాల్సిందే.
విశ్లేషణ : పూరి… ఓ మంచి హిట్ ఇచ్చి చాలా కాలం అయిపోయింది. అయినా అతని మీద ఒత్తిడేమీ లేదు. తన పని తాను చేసుకుంటూ… వరుస సినిమాలు తీస్తూనే వున్నాడు. అలానే రామ్ కూడా హిట్ చూసి చాలా కాలం అయింది. వీరిద్దరూ ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది. పక్కా కమర్షియల్ ఫార్ములాతో కొంచెం కొత్తదనం వుండేలా నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా టెక్నాలజీ బేస్ చేసుకుని సైన్స్ ఫిక్షన్ తో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’.. యూత్ ను ఓ రేంజులో అలరిస్తుంది. పూరి తన మార్కు టేకింగ్ తో ఇద్దరు ముద్దుగుమ్మల అందాలను ఉపయోగించుకుంటూనే… తన దైన శైలిలో యాక్షన్ సీన్స్ ను జోడించి తెరకెక్కించారు. తన మాస్ మసాలా ఫార్ములానే నమ్ముకుని తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా ఆడియన్స్ ను అలరిస్తుంది. ముఖ్యంగా డైలాగులతో ఆడియన్స్ ను అలరిస్తాడు. దానికి తోడు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. తన మ్యూజిక్‌తో ప్రతీ సీన్‌ను మరింతగా ఎలివేట్ చేశాడు మణి. కొన్ని సీన్స్‌లో నేపథ్య సంగీతం సన్నివేశాలను డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. పాటలు బాగున్నాయి. అలానే సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. ఎడిటింగ్, నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.
సరికొత్త మేకోవర్‌లో డిఫరెంట్‌ యాటిట్యూడ్‌, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌.. తన ఎనర్జిటిక్ యాటిట్యూడ్ తో ప్రేక్షకులను అలరిస్తాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్‌ ను చాలా అలవోకగా చెప్పేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మాస్‌ యాక్షన్‌ సీన్స్‌లో రామ్ పర్ఫామెన్స్‌ సూపర్బ్. హీరోయిన్లుగా నభా, నిధి అగర్వాల్‌ గ్లామర్‌ షోలో పోటి పడ్డారు. కథలోనూ ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రలు కావటంతో నటనతోనూ ఆకట్టుకున్నారు. మరో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా గుర్తుండిపోయే పాత్ర చేశాడు. షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి తమకు అలవాటైన పాత్రల్లో ఈజీగా నటించారు. ఓవరాల్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ ఆడియన్స్ ను అలరిస్తాడు. గో అండ్ వాచ్ ఇట్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here