Review: జయ జానకి నాయక

0
83

తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైశ్వాల్, కేథరిన్, జగనపతిబాబు, శరత్ కుమార్, తరుణ్ అరోరా, నందు, వాణి విశ్వనాథ్, సితార, సుమన్, శ్రవణ్, శశాంక్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను
రేటింగ్: 3.5/5
వరుసగా హిట్లు సాధిస్తున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్ సినిమా అనగానే.. కచ్చితంగా హీరో కెరీర్ కు ఈ సినిమా ఉపయోగపడుతుందనే టాక్ నడిచింది. ఎందుకంటే.. సాయి శ్రీనివాస్ కి అర్జంటుగా ఓ హిట్టు కావాలి. అది మామూలు హిట్టు కాదు.. ఓ మాస్ హీరో ఇమేజ్ కి ఎలాంటి హిట్టొస్తే.. కిక్కు ఇస్తుందో… అలాంటిదే కావాలి. అందుకే ఏరి కోరి.. బడ్జెట్టుకు వెనకాడకుండా ఇప్పడు ‘జయ జానకి నాయక’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: చక్రవర్తి గ్రూప్ ఇండస్ట్రీస్ అధినేత(శరత్ కుమార్) కుమారుడు గగన్(సాయి శ్రీనివాస్). కాలేజీతో చదువుతూ డీసెంట్ గా వుండే బాయ్. అలాంటి గగన్… తన కాలేజీలోనే చదువుతున్న స్వీటి(రకుల్ ప్రీత్ సింగ్)ని రౌడీల నుంచి రక్షిస్తాడు. దాంతో స్వీటీ ఇంప్రెస్ అయిపోయి… గగన్ ను ప్రేమించడం మొదలుపెడుతుంది. గగన్ కూడా స్వీటిని ప్రేమిస్తాడు. అయితే స్వీటీ తండ్రి(జయప్రకాష్) మాత్రం వీరి ప్రేమకు అడ్డుచెబుతాడు. అయితే స్వీటిని అస్మిత్ నారాయణ(జగపతిబాబు) కుమారుడు(శంశాంక్)కి ఇచ్చి పెళ్లి చేస్తున్న సమయంలో అతణ్ని విలన్(తరుణ్ అరోర) మనుషులు చంపేసి… స్వీటీని బంధించి తీసుకెళతారు. మరి అలా రౌడీల భారిన పడిన స్వీటిని హీరో ఎలా రక్షించాడు? అస్మిత్ నారాయణ కుమారుణ్ని విలన్ గ్యాంగ్ ఎందుకు చంపేసింది? తను ప్రాణంగా ప్రేమించిన స్వీటీని.. గగన్ తిరిగి సొంతం చేసుకున్నాడా? అందుకు అతనికి ఎదురైన ఇబ్బందులేంటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: ఇండస్ట్రీలో బోయపాటి డైరెక్షన్ కి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ వుందంటే దానికి కారణం.. అతను చూపించే హీరోయిజమే. మాస్ ప్రేక్షకులు మెచ్చుకునే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో బోయపాటికి తిరుగు లేదు. అందుకే మాస్ కు .. ఫుల్ మీల్ పెట్టడంలో బోయపాటి ఎప్పుడూ ముందుంటాడు. భద్రలాంటి క్యూట్ లవ్ స్టోరీ అని బోయపాటి చెప్పినా…. ఇందులో యాక్షన్ ఎపిసోడ్లు మాత్రం ‘సరైనోడు’ని మించి వున్నాయి. దానికి కారణం.. సాయి శ్రీనివాస్ కటౌట్ అని చెప్పొచ్చు. ఎదరొచ్చిన వందమందినైనా చంపే మజిల్స్ హీరో సొంతం కావడంతో.. వాటిని ఫుల్ గా ఉపయోగించుకున్నాడు బోయపాటి. మాస్ ప్రేక్షకులతో పాటు.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కూడా విజిల్ వేసే యాక్షన్ సీన్స్ వుండటంతో… బోయపాటి మరోసారి తన మార్కును చూపించి.. హీరోయిజం ఎలివేట్ అయ్యేలా చేశారు. యాక్షన్ సీన్స్ తో పాటు.. రకుల్ ప్రీత్ సింగ్ తో చేయించిన సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. దాంతో అతని సినిమాలో కుటుంబ సమేతంగా చూసే విధంగా అన్ని రకాల ఎలిమెంట్లు వున్నాయి. దాంతో ‘జయ జానకి నాయక’ బోయపాటి ఖాతాలో మరో హిట్టు వేసింది. అలానే సాయి శ్రీనివాస్ కెరీర్ కూడా ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుంది.
సాయి శ్రీనివాస్ యాక్షన్ సీన్సలో ఫుల్ ఎనర్జీ చూపించారు. ముఖ్యంగా కాలేజీలో వచ్చే యాక్షన్ సీనుతో పాటు… హంసలదీవిలో తీసిన యాక్షన్ ఎపిసోడ్ చిత్రానికే హైలైట్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ బ్యాంగులో వచ్చే యాక్షన్ సీన్ లో కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ఫుల్ మజిల్ పవర్ చూపించి మాస్ ఆడియన్స్ ను మెప్పించాడు. అతనికి జోడీగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. మొదటి భాగంలో చాలా చలాకీగా కనిపించి యూత్ ని బాగా ఆకర్షిస్తుంది. ఇంటర్వెల్ తరువాత వచ్చే ఎమోషన్ సీన్లలోనూ ఆమె నటన బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. అలాగే జగపతిబాబు ఇంట్రడక్షన్ సీన్ అతని పాత్ర తీరు తెన్నులను పరిచయం చేస్తుంది. పరువుకోసం అతను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. చెప్పకనే చెప్పేశాడు. ఇక చాలా కాలం తరువాత శరత్ కుమార్ ఇందులో హీరో తండ్రిగా నటించి మెప్పించాడు. కుమారులతో కలిసి జాలీగా.. జోవియల్ గా వుండే తండ్రి పాత్రలో శరత్ కుమార్ మెప్పించారు. విలన్ పాత్రలో నటించిన తరుణ్ అరోరా కూడా బాగా నటించారు. ఇక ఇతర పాత్రలు చేసిన శశాంక్, సుమన్, శ్రవణ్ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. చాలా కాలం తరువాత నటించిన వాణీ విశ్వనాథ్ పాత్ర కొంచెమే అయినా… హంసలదీవి ఎపిసోడ్ కి ప్లస్ అయింది.
ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే… దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి తన సినిమా మ..మ.మాస్ అనిపించేశాడు. క్యూట్ లవ్ స్టోరీతో పాటు… యాక్షన్ ఎపిసోడ్లు ఏమాత్రం తగ్గకుండా చూసుకుని అందరు మెచ్చే చిత్రాన్ని అందించారు. దేవిశ్రీ అందించిన నేపథ్య సంగీతం బాగా వుంది. పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ ను బాగా తెరకెక్కించారు. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం ఫుల్ మీల్స్ పెడుతుందనడంలో సందేహం లేదు.

-వడ్డే మారెన్న

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here