రివ్యూ: మహర్షి

0
162

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్. శ్రీమంతుడు, భరత్ అను నేను తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘మహర్షి’. దిల్ రాజు, పి.వి.పి, అశ్వినీదత్ నిర్మాతలు. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. మాస్.. క్లాస్ ప్రేక్షకులు మెచ్చేలా రైతుల సమస్యలను ఏవిధంగా వెండి తెరమీద చూపించారో తెలుసుకుందాం పదండి.

కథ: అమెరికాలో ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో సీయీవో గా పనిచేసే రిషి(మహేష్) సడన్ గా ఉద్యోగానికి సెలవు పెట్టి… ఓ మారుమూల గ్రామంలో రవి(అల్లరి నరేష్) అనే యువకుడు రైతుల కోసం చేస్తున్న పోరాటానికి మద్ధతు ఇవ్వడానికి వస్తాడు. అక్కడి నుంచి తన కంపెనీ కార్య కలాపాలను నడుపుతాడు. మొదట్లో రవి ఉద్యమాన్ని పట్టించుకోని మీడియా మరియు గ్రాస్తులు.. రిషి రాకతో ఉద్యమానికి మద్ధతు పలకడంతో పాటు… మీడియా కూడా నేషనల్ వైడ్ గా రవి పోరాటానికి ప్రచారం కల్పిస్తుంది. మరి రవి చేస్తున్న పోరాటం ఫలితాన్ని స్తుందా? ఇంతకు రవి ఆ గ్రామం తరఫున, రైతుల తరఫున ఎందుకు పోరాటం చేస్తున్నట్టు? రిషి.. రవిల మధ్య ఎలాంటి స్నేహం వుంది? చివరకు రిషి కంపెనీ సీయీవోగా కొనసాగారా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: ఈ సినిమాను మహేష్ తో తీయడానికి రెండేళ్లు వెయిట్ చేశానని దర్శకుడు వంశీ పైడిపల్లి ఎందుకు చెప్పాడో… ఈ చిత్రం కాన్సెప్ట్ ను చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం రాజకీయాలనైనా.. వ్యవసాయ రంగాన్నైనా కార్పొరేట్లే శాసిస్తున్నారు. వారికి ఎదురు తిరిగితే.. జీవితాలు వుండవు. అలాంటి కాన్సెప్టును తీసుకుని ‘మహర్షి’ చుట్టూ రాసుకున్న కథ, కథనాలు ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. మొదటి భాగంలో కళాశాల నేపథ్యంలో రాసుకున్న ఎంటర్టైనింగ్ సన్నివేషాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తరువాత సెకెండాఫ్ లో వచ్చే విలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ అన్నీ కొంత సీరియస్ గా కొనసాగినా… ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా ఊపందుకుంటుంది. ముఖ్యంగా రైతుల సమస్యలపై మహేష్ మీడియాతో మాట్లాడే ఎపిసోడ్ సినిమాకే హైలైట్. భూముల విలువ పెరిగే కొద్ది… రైతుల విలువ తగ్గియిపోంది. పండించే వాళ్లు తగ్గిపోయారు.. తినేవాళ్లు ఎక్కువయ్యారు. దాంతో కల్తీ కూడా పెరిగిపోతోంది. ఇదే కొనసాగితే మనం ఇచ్చే ఆస్తులు పిల్లల హాస్పిటల్ ఖర్చులకు కూడా సరిపోవు లాంటి డైలాగులు ఇప్పుడు వుండే యూత్ ను ఆలోచింపజేస్తాయి. కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగాలే కాదు.. వ్యవసాయాన్ని కూడా ఓ ఉద్యోగంలా భావించి.. దాన్ని కూడా ఓ జాబ్ లాగా గర్వంగా చెప్పుకోవాలనేది ఇందులో ప్రస్తావించారు. వీకెండ్ పార్టీలతో ఎంజాయ్ చేయకుండా కనీసం వీకెండ్ అగ్రికల్చర్ పేరుతోనైనా గ్రామలకు వెళ్లి వ్యవసాయం నేర్చుకోమని చెప్పడం బాగుంది. సినిమా నిడివి ఎక్కవైందనే కంప్లయింట్ తప్ప.. ఇందులో నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవు.
ఎప్పటిలాగే మహేష్.. తన సూపర్బ్ పెర్ ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. ఫస్ట్ హాఫ్ లో కాలేజీ స్టూడెంట్ గా… మరోవైపు కంపెనీ సీయివోగా… ప్రీ క్లైమాక్స్ నుంచి కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా రైతుల సమస్యలపై పోరాడే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సీయివో గా మహేష్ చూపించిన పెర్ ఫార్మెన్స్ అద్భుతంగా వుంది. ఇందులో ఎప్పటిలాగే మరింత స్మార్ట్ గా కనిపించారు. స్టైలింగ్ బాగుంది. స్టూడెంట్.. సీయివో పాత్రలకు అనుగుణంగా స్టైలింగ్ బాగా చేయడంతో.. వేరియషన్ యాప్ట్ గా కనిపించింది. మహేష్ తో పాటు మరో ముఖ్యమైన పాత్రలో కనిపించాడు అల్లరి నరేష్. గ్రామీణ ప్రాంతం నుంచి ఎంటెక్ చదవడానికి సిటీకి వచ్చే అమాయకుని పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఆ తరువాత గ్రామం తరఫున పోరాడే యువకుని పాత్రలోనూ చక్కగా ఇమిడిపోయారు. మహేష్ కి జోడీగా నటించిన పూజా హెగ్డే తన పాత్రకు న్యాయం చేసింది. ప్రొఫెసర్ పాత్రలో రావు రమేష్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పించాడు. మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ కాసేపు వున్నా.. అతనికి రాసుకున్న ప్లాట్ బాగుంది. ‘నేను ఓడిపోవడం వల్లే… గెలవాలనే పట్టుదల నీలో పుట్టింది’ అనే డైలాగ్ బాగుంది. తల్లి పాత్రలో జయసుధ, స్నేహితుల పాత్రలో వెన్నెల కిశోర్, కమల్ కామరాజు తదితరులు నటించి మెప్పించారు.
‘ఊపిరి’ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం… అందరూ ఊహించినట్టుగానే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా వుంది. నిడివి ఎక్కువైందనే కంప్లైట్ తప్ప సినిమాను నడిపించడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు. ప్రస్తుతం కార్పొరేట్ వ్యవస్థలు రాజకీయాల్ని, వ్యవసాయాన్ని ఎలా శాసిస్తున్నాయో… చక్కగా చూపించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్యం సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా గ్రాండియర్ గా తెరకెక్కించి సక్సెస్ సాధించారు. వేసవిలో ఎంజాయ్ చేయడంతో పాటు.. ఓ చక్కటి మెసేజ్ ను ఇచ్చే ‘మహర్షి’ని ఓ సారి చూసేయండి.

చివరగా… రైతు విలువను గొప్పగా చెప్పే ‘మహర్షి’

రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here