నవ్వించే ‘మీకు మాత్రమే చెప్తా’

0
215

‘పెళ్లిచూపులు’ సినిమాతో టాలెంట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా…. అదే సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది. మరి యూత్ ని ఏమాత్రం నవ్వించిందో చూద్దాం పదండి.

కథ: రాకేష్ (తరుణ్ భాస్కర్)ఒక టీవీ ఛానెల్ లో యాంకర్ గా పని చేస్తుంటాడు. డాక్టర్ అయిన స్టెఫీ(వాణి భోజన్) ప్రేమలో పడిన రాకేష్ ఆమెకు సిగరెట్, మందు తాగడం వంటి విషయాలలో కొన్ని అబద్దాలు చెవుతాడు. ఇంకా రెండు రోజులలో స్టెఫీ తో పెళ్లనగా రాకేష్ ఒక అమ్మాయితో గదిలో ఉన్న వీడియో బయటకి వస్తుంది. దీనితో రాకేష్ తన మిత్రుడు అభినవ్ గోమటమ్ సహాయతో ఆ వీడియో ని సైట్ నుండి డిలీట్ చేసేలా ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరి ఆ వీడియో స్టెఫీ కీ కనిపించకుండా చేయగలిగారా? ఆ వీడియో గురించిన నిజం స్టెఫీ తెలుసుకుందా? అసలు ఆ వీడియోలో రాకేష్ ఎందుకు ఉన్నాడు? రాకేష్, స్టెఫీ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

కథ.. కథనం విశ్లేషణ: యూత్ కు కనెక్ట్ అయ్యే ఓ కాంటెంపరరీ కాన్సెప్ట్ ని ఎంచుకున్న దర్శకుడు, ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. ఒక చిన్న పాయింట్ ని కథావస్తువుగా తీసుకుని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని నవ్వించారు
‘పెళ్లి చూపులు’తో జాతీయ అవార్డు గెలుచుకొని టాలెంట్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరో గా మొదటి చిత్రం తో మెప్పించాడు. తన గర్ల్ ఫ్రెండ్ కి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని ప్రతి క్షణం భయపడే ఫ్రస్ట్రేటెడ్ గయ్ గా ఆయన నటన సహజత్వానికి దగ్గరగా ఉంది. తరుణ్ ఫ్రెండ్ పాత్ర చేసిన అభినవ్ హీరో తో సమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. మిత్రుడి టెన్షన్ ని పంచు కుంటూ, అక్కడడక్కడా ఫన్నింగ్ పంచెస్ తో తన రోల్ కు ఆయన పూర్తి న్యాయం చేశారు. అబద్దాలు నచ్చని…, రాకేష్ చర్యలను అనుమానించే అమ్మాయి పాత్రలో వాణి భోజన్ చక్కగా సరిపోయింది. అనసూయ, అవంతిక మిశ్రా, పావని గంగిరెడ్డి తక్కువ నిడివి గల పాత్రలో నటించి మెప్పించారు.
దర్శకుడు మొబైల్ వలన వ్యక్తి ప్రైవసీ కి ఏవిధంగా భంగం కలుగుతుంది అనే విషయాన్నీ ఒక జంట ప్రేమ, పెళ్లికి ముడిపెట్టి ఫన్నీ గా దర్శకుడు నడిపిన విధానం బాగుంది. ఆయన రాసుకున్న సన్నివేశాలు, స్క్రీన్ ప్లే  ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.ఒక చిన్న పాయింట్ చుట్టూ రెండు గంటల పాటు నడిపిన కథ.. కథనాలు ఆడియెన్స్ ను బాగా నవ్విస్తాయి. పంచ్ లు బాగున్నాయి. కథలో భాగంగా శివ స్వరపరిచిన రెండు పాటలు పర్వాలేదు, బీజీఎమ్ ఒకే. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండు. ఈ సినిమా సింపుల్ స్టోరీతో సందర్భోచితంగా సాగే పక్కా కామెడీ ఎంటర్ టైనర్. సినిమాలో తరుణ్, అభినవ్ మధ్య నడిచే సీన్స్ అలాగే వీడియోకి సంబంధించిన  ఎపిసోడ్లు బాగా నవ్విస్తాయి.  ఓవరాల్ గా ఈ సినిమా ఒకసారి సరదగా చూడొచ్చు. గో అండ్ వాచ్ ఇట్!!!
రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here