‘జెర్సీ’ బయోపిక్ కాదు- నాని

0
51

విలక్షణమైన అభినయంతో అటు క్లాస్… ఇటు మాస్ ప్రేక్షకులను అలరించి…. నాచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని… తాజాగా న‌టించిన సినిమా `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌కు, ట్రైల‌ర్‌కు, పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సందర్భంగా నాని విలేక‌రుల‌తో  ముచ్చటించారు. ఆ విశేషాలేంటో అతని మాటల్లోనే…

ఇది బయోపిక్ కాదు…

ఇది బ‌యోపిక్ కాదు. పూర్తిగా ఫిక్ష‌నల్ స్టోరీ. నా టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూసి అలా అనుకున్నారేమో. ఒక‌వేళ ర‌మ‌న్‌లాంబా కూడా క్రికెట్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి మ‌ళ్లీ క‌మ్‌బ్యాక్ అయ్యారేమో. ఒక‌వేళ ఆ విష‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని అంద‌రూ అలా అనుకుంటున్నారేమో. ఎవ‌రో సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కి… కాపీ పేస్టులు జ‌రిగి నా వ‌ర‌కు కూడా చేరింది. మా జెర్సీ బ‌యోపిక్ కాదు. ఫిక్ష‌నల్ స్టోరీ. జెర్సీ అంటే క్రికెట‌ర్ యూనిఫార్మ్. ఎనీ స్పోర్ట్స్ మేన్ వేసుకునే యూనిఫార్మ్ జెర్సీ అని అంటారు. కేవ‌లం క్రికెట్ స్టోరీ కాబ‌ట్టి ఈ సినిమాకు ఆ పేరు పెట్టామ‌ని మాత్రం అనుకోవ‌ద్దు. ఇందులో జెర్సీ అనే టైటిల్‌కు చాలా స్ట్రాంగ్ రీజ‌న్ ఉంటుంది. అదేంట‌న్న‌ది సినిమా చూశాకే తెలుస్తుంది.

`మ‌జిలీ`తో పోలిక ఉండదు…

అది చూడ‌లేదు కాబట్టి, నేను ఆ సినిమాకు, ఈ సినిమాకు మ‌ధ్య ఉన్న పోలిక‌ల‌ను గురించి చెప్ప‌లేను. పైగా శివ మావాడు. `నిన్ను కోరి`తో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఎప్ప‌టిక‌ప్పుడు టీజ‌ర్లు, ట్రైల‌ర్లు పంపించేవాడు. నాకు చాలా చాలా నచ్చేశాయి అవ‌న్నీ. నిజంగా `జెర్సీ`ప్ర‌మోష‌న్స్, `గ్యాంగ్ లీడ‌ర్‌` సినిమా షూటింగ్ లేకుండా ఉంటే ఎప్పుడో వ‌రుస‌గా సినిమాలు చూసుండేవాడిని. మా సినిమా ఇంకా విడుద‌ల కాలేదు కాబ‌ట్టి అలా అనుకుంటున్నారేమోగానీ, అస‌లు వ‌స్తాయ‌ని నేను అనుకోను. ట్రైల‌ర్‌లోనే సినిమా క‌థ‌కు సంబంధించి చాలా చెప్పేశాం. లూస‌ర్ అన‌డం, త‌క్కువ చేసి మాట్లాడ‌టం వంటివ‌న్నీ ఉంటాయి. వాటివ‌ల్ల ఫ్ర‌స్ట్రేష‌న్ ఉంటుంది. ఆ ఫ్ర‌స్ట్రేష‌న్ వ‌ల్ల అర్జున్ జీవితంలో ఏం జ‌రిగింద‌నేది క‌థ‌.

వెంటనే ఒప్పేసుకున్నా…

క‌థ మామూలుగానే విన్నా. కానీ చాలా త‌క్కువ స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకున్నా. సినిమా చేద్దాం అని ముందు ద‌ర్శ‌కుడికే చెప్పాను. `ఎలా చేద్దాం అని ప్లాన్ చేద్దాం` అని అన్నా. ఆ మాట‌కు అర్థం సినిమా చేద్దామ‌నే. కానీ అత‌నికి నేను చెప్పింది అర్థం కాలేదు. ఆ విష‌యం నాకు అర్థ‌మై త‌ర్వాత నేను వివ‌రంగా చెప్పాను. నేను గ‌ల్లీ క్రికెట్ ఆడేవాడిని. స్కూల్లో కూడా నేను లాస్ట్ బ్యాట్స్ మేన్‌ని. కొన్ని సార్లు నా టీమ్లో అంద‌రూ ఓడిపోతేనో, లేకుంటే ఎవ‌రికో ఒక‌రికి దెబ్బ‌లు త‌గిలితేనో నాకు అవ‌కాశం వ‌చ్చేది. ఆ బ్యాచ్ అన్నమాట‌. ఈ సినిమా చూశాక క్రికెట్ ప‌ట్ల మీద దృక్ప‌థం చాలా మారింది. ఇంత‌కు ముందు క్రికెట్ ఛానెల్‌లో వ‌స్తుంటే నేను రిమోట్ నొక్కేసేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. చూస్తున్నా. ఎందుకంటే ఈ సినిమా కోసం ట్ర‌యినింగ్ తీసుకున్న త‌ర్వాత నాకు క్రికెట్ ప‌ట్ల అవ‌గాహ‌న పెరిగింది. క్రికెట్ అంటే కేవ‌లం బ్యాట్‌తో బాల్‌ను కొట్ట‌డం కాదు, ఫోర్లు, సిక్సుల‌ను మించింది ఇంకేదో ఉంద‌ని అర్థం చేసుకున్నా. బాడీ లాంగ్వేజ్ నుంచి ఎన్నో విష‌యాలను గురించి తెలుసుకున్నా. డేనియ‌ల్ అని సిటీలో బెస్ట్ క్రికెట్ అకాడెమీ ఒక‌టి ఉంది. డేనియ‌ల్ నాకు శిక్ష‌ణ ఇచ్చారు. షూటింగ్ స్పాట్‌కి కూడా ఆయ‌నే వ‌చ్చారు. నాకు నా బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు బాగా తెలుసు. అందుకే ఈ సినిమా విష‌యంలో ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా. నేనిప్పుడు చాలా హైలో ఉన్నా. చాలా శాటిస్‌ఫైడ్ సినిమా ఇది. చాలా గొప్ప సినిమా చేశామ‌నే ఫీలింగ్ ఇప్ప‌టివ‌ర‌కూ నాకు రాలేదు. ఈ సినిమాతోనే వ‌చ్చింది.

గౌతమ్ ‘మళ్ళీ రావా’ చూడలేదు…

దర్శకుడు చెప్పిన నెరేష‌న్‌లో పాత్ర‌లో నేను లీన‌మైపోయాను. అస‌లు లాజిస్టిక్స్ ని నేను ఊహించ‌లేదు. అంత టైమ్ కూడా లేదు. నేనే కాదు, ఈ సినిమా చేసిన వారంద‌రూ చాలా గొప్ప ప‌ని చేశామ‌నే ఫీలింగ్‌లో ఉన్నారు. సంతోషంతో క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగే సీన్లు కూడా ఉన్నాయి. ఇందులో వంద శాతం హ్యాపీ ఎండింగే. అంద‌రూ ఒక ఎగ్జ‌యిట్‌మెంట్‌తో బ‌య‌టికి వ‌స్తారు.
గౌతమ్ చేసిన ‘మ‌ళ్లీ రావా’ చూడ‌లేదు. కాక‌పోతే అత‌ను చెప్పిన క‌థ న‌చ్చింది. అత‌నిలో నిజాయ‌తీ న‌చ్చింది. అందుకే నేను అత‌ని ప్రీవియ‌స్ సినిమా చూసి జ‌డ్జి చేయాల‌ని అనుకోలేదు. సినిమా చేస్తున్న‌ప్పుడు చాలా హైగా అనిపించింది. ఏదో గొప్ప సినిమా చేస్తున్నామ‌నే ఫీలింగే వ‌చ్చింది. ఇంత‌కు ముందు కూడా చాలా ఎమోష‌న్ ఉన్న సినిమాలు చేశా. నిన్ను కోరి, ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం అవ‌న్నీ వేరే త‌ర‌హా సినిమాలు. అందులో ఏదో ఒక డిస్క‌ష‌న్ ఉంది. దీనికీ, వాటికీ తేడా ఉంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో భీమిలి చేసి తొమ్మిదేళ్లు అవుతోంది. మ‌ధ్య‌లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు వచ్చాయి. కానీ న‌చ్చాలి క‌దా. ఈ జోన‌ర్‌లో ఐడియాలు న‌చ్చితే స‌రిపోదు. వాటిని ఎంత బాగా ట్రీట్ చేశార‌నేది కీల‌కం. అలాంటి క‌థ‌ను నాకు గౌత‌మ్ చెప్పాడు. ఐడియాను రెండున్న‌ర గంట‌ల ఫార్ములాలో అద్భుతంగా చెప్పాడు. ఇప్పుడు న‌చ్చింది. చేస్తున్నా.
ఇందులో ఫాద‌ర్‌గా న‌టించడం ఏం ఇబ్బంది లేదు. న‌న్ను నిజంగా ముస‌లివాడిగా వేయ‌మ‌న్నా, ప్రాస్త‌టిక్ మేక‌ప్ వేసుకోమ‌న్నా సిద్ధంగానే ఉన్నా. న‌టుడిగా నాది కాని వ‌య‌సులో న‌టించ‌డానికి చాలా ఆనందిస్తా. ఈ సినిమా కోసం బరువు త‌గ్గ‌లేదు. కాక‌పోతే రిహార్సల్స్ వంటివి చేస్తుంటే త‌గ్గానంతే. భీమిలి క‌బ‌డీ జ‌ట్టు అప్పుడు రోజూ కాళ్లు కొట్టుకుపోయేవి. అప్పుడు మీడియాగానీ, సోష‌ల్ మీడియాగానీ ఇంత స్ట్రాంగ్‌గా లేదు. అందువల్ల ఎవ‌రికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అంత భారీగా పెర‌గ‌డంతో దెబ్బ త‌గిలింది అని అనగానే… త‌గిలింద‌ట త‌గిలింద‌ట అనేది పెద్ద న్యూస్ అవుతోంది. అప్ప‌ట్లో ఇంత డిస్క‌ష‌న్ లేదు. ప్ర‌తి తండ్రీ ప్ర‌పంచం దృష్టిలో ఏమైనా ఫ‌ర్వాలేదు కానీ, కొడుకు దృష్టిలో మాత్రం హీరో కావాల‌నుకుంటాడు. అందుకే జెర్సీలో ఆ డైలాగ్ అంత హిట్ అయింది. మా అబ్బాయికి ఇంకా న‌న్ను జ‌డ్జి చేసే వ‌య‌సు రాలేదు. ల‌క్కీగా నా సినిమాలు కొన్నిసార్లు స‌క్సెస్ కాన‌ప్పుడు కూడా నా న‌ట‌న గురించి ఎవ‌రూ ఎప్పుడూ ఒక మాట అన‌లేదు. కాక‌పోతే రెండు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసేట‌ప్పుడు `నాని ఇక క‌మ‌ర్షియ‌లేనా..` అని అన్నారంతే. అది కూడా పెద్ద జ‌డ్జిమెంట్ కాద‌నుకోండి. స‌త్య‌రాజ్ తో ప‌నిచేయ‌డం పెద్ద లెర్నింగ్‌. చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న‌కు చాలా చిన్న డైలాగులే ఉండేవి. ఒక‌రోజు మ‌ధ్యాహ్నం ఆయ‌న‌కు ఒక చిన్న డైలాగ్ ఉంది. ఆ విష‌యం తెలిసి మ‌దురైలో షూటింగ్ చేస్తున్న ఆయ‌న అక్క‌డి నుంచి చెన్నైకి కారులో వ‌చ్చి అక్క‌డి నుంచి ఫ్లైట్‌లో ఇక్క‌డికి వ‌చ్చారు. తీరా వ‌చ్చేస‌రికి ఇక్క‌డ షాట్ లేదు. అయినా ఆయ‌న డిస‌ప్పాయింట్ కాలేదు. నేనే కేర్‌వ్యాన్‌లోకి వెళ్లి సారీ చెప్పా. అయినా ఆయ‌న `ఇందులో ఏముంది` అని చాలా కూల్‌గా చెప్పారు. ఇన్నేళ్ల న‌ట‌నా కెరీర్‌లో ఆయ‌న అలా మాట్లాడుతుంటే విన‌డానికి చాలా సంతోషంగా, నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉన్న‌ట్టుగా అనిపించింది.

స్టార్‌డ‌మ్ ని న‌మ్ముతా

స్టార్‌డ‌మ్ మీద నాకు న‌మ్మ‌కం ఉంది. కాక‌పోతే ఇప్ప‌టిలాగా అంద‌రూ అమ్మే స్టార్‌డ‌మ్ మీద కాదు. కంటెంట్ వ‌ల్లే స్టార్‌డ‌మ్ వ‌స్తుంద‌ని న‌మ్ముతా. కెరీర్‌ని ప‌ర్ఫెక్ట్ గా ప్లాన్ ఏమీ చేసుకోను. అవకాశం వ‌చ్చిన వాటిలో నాకు న‌చ్చిన దాన్ని సెల‌క్ట్ చేస్తున్నా. నాకు అర్థ‌మైన రీతిలో ముందుకు సాగుతున్నా. అది నాకే తెలియ‌కుండా నా కెరీర్‌కి ఉప‌యోగ‌ప‌డుతోంది. నేనేం చేసినా నాకు ఇష్ట‌మైంది, నాకు న‌చ్చింది, నాకు అర్థ‌మైంది కాబ‌ట్టి చేస్తున్నా. సినిమా సినిమాకు ఎద‌గ‌డం అనేది నాకేమీ ప్రెజ‌ర్‌గా లేదు. ఎంసీఏ త‌ర్వాత బాగా ప్రెజ‌ర్ ఫీల‌య్యా. ఇప్పుడు లేదు. ఒక‌ప్పుడు జండాపై క‌పిరాజు, పైసా, అహ‌నా క‌ల్యాణం అన్నీ ఫ్లాపులే. ఆ స‌మ‌యంలో ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం లాంటి క‌థ‌ను అంగీక‌రించాను. నాకు న‌చ్చింది చేసుకుంటూ వెళ్లానంతే. న‌చ్చింది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రెజ‌ర్ ఎందుకుంటుంది.

ఇప్పుడు పట్టించుకోవడం లేదు….

సోషియల్ మీడియాలో వచ్చే వార్తలను తొలుత బాగా పట్టించుకునే వాణ్ణి. ఇప్పుడు నాకు అర్థ‌మైంది ఒక్క‌టే.. వాటిని ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు.. అని! బిగినింగ్‌లో .నాకు ఆ విష‌యం తెలియ‌క ఫీల‌య్యేవాడిని. అలా అన్నారా? ఇలా అన్నారా? అని అనుకునేవాడిని. ఇండ‌స్ట్రీలోని వాడిని కూడా కాదు కాబ‌ట్టి తెగ బాధ‌ప‌డేవాడిని. అప్పుడు ఎవ‌రైనా ఒక మాట అంటే అది నా చెవిలో ప‌డితే చాలా బాధ‌నిపించేది. ఆ త‌ర్వాత నాకు అంతా అల‌వాటైపోయింది. అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాడు అస‌లు బ‌త‌క‌లేడనే విష‌యం తెలిసింది. ఒక‌సారి ‘పిల్ల జ‌మీందార్’ స‌మ‌యంలో నానికి హెడ్ స్ట్రాంగ్ అని రాశారు. అప్పుడు చాలా ఫీల‌య్యా. అప్పుడు అంత ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌న్న సంగ‌తి ఇప్పుడు అర్థ‌మ‌వుతోంది. స్టార్టింగ్‌లో ఎవ‌రైనా ఏదైనా రాస్తే అది కోపం వ‌చ్చి రాశారేమో అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు రాయ‌డం వాళ్ల ధ‌ర్మం, మ‌నం ఇగ్నోర్ చేయ‌డం మ‌న ధ‌ర్మం అని అనుకున్నా.

‘బిగ్ బాస్’ ప్రపంచాన్ని పరిచయం చేసింది…

మ‌నం ప్ర‌పంచానికి ప‌రిచ‌యం కావ‌డం క‌న్నా, ప్ర‌పంచం మ‌న‌కు ప‌రిచ‌యం కావ‌డం ఇంపార్టెంట్‌. బిగ్ బాస్‌తో అలా నాకు ప్ర‌పంచం ప‌రిచ‌య‌మైంది. బిగ్ బాస్ ఒక్కో ఎపిసోడ్ అక్క‌డ జ‌రుగుతున్న కొద్దీ… ఇక్క‌డ సోష‌ల్ మీడియాలో దాని రిఫ్లెక్ష‌న్ ఉండేది. షోలో హీట్ పెరిగేకొద్దీ ఇక్క‌డ సోష‌ల్ మీడియాలో హీట్ పెరిగేది. `ఇది నా ఆఖ‌రి ఎపిసోడ్‌` అని ఎప్పుడు ట్వీట్ చేశానో, ఆ త‌ర్వాత `నాని అన్నా.. ప్లీజ్ కమ్ బ్యాక్‌` అని అడుగుతున్నారు. వెబ్‌సీరీస్ త‌ప్ప‌కుండా చూస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో వెబ్‌సీరీస్ అనేది చాలా దూరం వెళ్తుంది. దాని భ‌విష్య‌త్తు చాలా గొప్ప‌గా ఉంటుంది. ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. మెయిన్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు అంద‌రూ సినిమా, వెబ్‌సీరీస్‌లు చేస్తున్నారు. నా ద‌గ్గ‌ర అలాంటి కంటెంట్ లేదు. ఉంటే నా ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లోనూ చేస్తానేమో… అష్టాచ‌మ్మా చేస్తున్న‌ప్పుడు ఇంద్ర‌గంటిగారు న‌న్ను చూసి అప్పుడు స్టార్ మెటీరియ‌ల్ అని చెప్పారు. కానీ అప్పుడు నేను న‌మ్మ‌లేదు. ఆ సినిమా చేస్తున్నంత కాలం నాకు డౌటే. ఆయ‌న‌కు నాలో ఏదో న‌చ్చింది కాబ‌ట్టి సినిమా చేశారు కానీ, ఈ సినిమాకు ఎవ‌రూ రారేమో అని అనుకునేవాడిని. కానీ తొలిరోజు నా డౌట్స్ క్లియ‌ర్ అయిపోయాయి. ఓవ‌ర్సీస్ మార్కెట్ అనేది ఎక్స్ పెరిమెంట‌ల్ సినిమాల‌ను అప్రిషియేట్ చేసేది కాదు. వాళ్లు ప్రాప‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. మ‌నం చెప్పాల‌నుకున్న క‌థ‌లు క‌రెక్ట్ గా చెప్ప‌డానికి ఓవ‌ర్సీస్ మార్కెట్‌, తెలుగు మార్కెట్ ను ఎక్స్ పాండ్ చేస్తుంది. రెగ్యుల‌ర్ గా ఎక్స‌ర్‌సైజ్‌లు చేయను ఆరునెల‌ల‌కు ఒక‌సారి ఎప్పుడో బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు ఎవ‌రైనా `లావైపోయావు` అని అంటే వేగంగా వ‌చ్చి వారం రోజులు జిమ్ చేస్తాను. అంతేగానీ ఆ త‌ర్వాత మానేస్తాను.

అప్పట్లో వంశీ స్మార్ట్ గా… ఎంతో చరిష్మా ఉండేది

నేను రెమ్యూనిరేష‌న్ ఎంత పెంచానో మీరే చెప్పండి.. (న‌వ్వుతూ). సినిమాను బ‌ట్టి మారుతుంటుందండీ.
మా ద‌ర్శ‌కుడు చాలా జెన్యూన్ ప‌ర్స‌న్‌. ఆయ‌న్ని చూడగానే చాలా నిజాయ‌తీగా ఉన్నాడ‌ని అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆయ‌న‌తో ప‌నిచేసిన‌ప్పుడు ఇంకా బాగా అర్థ‌మ‌య్యేవాడు. కొన్నిసార్లు ఆయ‌న‌లో ఇంత లోతు మ‌నిషి ఉన్నాడా అని అనిపిస్తుంది. ఈ సినిమా చూశాక ప్ర‌తి ప్రేక్ష‌కుడికి, ప్ర‌తి సీనులోనూ గౌత‌మ్ క‌నిపిస్తాడు.
నా క్లాస్‌లో వంశీ ఉండేవాడు. చాలా స్మార్ట్ గా ఉండేవాడు. క్రికెట్ అంటే పిచ్చి. అప్ప‌ట్లో చాలా చ‌రిష్మా ఉండేది. ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీలో వంశీ అనే పేరుతో ఒక ప్రొడ్యూస‌ర్ ఉన్నాడ‌ని తెలుసు. ఒక‌సారి మా క్లాస్‌మేట్ క‌లిసిన‌ప్పుడు ఇండ‌స్ట్రీలో వంశీ ఉన్నాడ‌ని తెలిసింది. ఈ సినిమాకు ముందు మాట్లాడుకున్నాం. అదేంటో త‌ను మాత్రం న‌న్ను `సార్` అనిపిలుస్తూ ప్రొటోకాల్ మెయింటెయిన్ చేస్తున్నాడు. ఈ సినిమా మొత్తానికి కాస్త కంగారుగా ఎవ‌రైనా ఉన్నారా అంటే అది వంశీ మాత్ర‌మే. జెన్యూన్ ప్రొడ్యూస‌ర్‌. ఒక‌సారి విక్ర‌మ్ వేదా పాట చూశాను. శ్ర‌ద్ధ‌ను చూడ‌గానే చాలా జెన్యూన్‌గా అనిపించింది. త‌న‌లో సారా పాత్ర‌లో ఉన్న ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా క‌నిపించాయి. సెట్లో త‌ను న‌టిస్తుంటే త‌న న‌ట‌న‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయా. త‌న‌కు చాలా మంచి ఫ్యూచ‌ర్ ఉంది.

నాకు చిన్న‌పిల్ల‌లంటే ఇష్టం

నాకు చిన్న‌పిల్ల‌లంటే ఇష్టం. చిన్న వాళ్లు ఎక్క‌డుంటే అక్క‌డికి వెళ్లి ఆడుకునేవాడిని. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌లోనూ, మ‌రికొన్ని సినిమాల్లోనూ చిన్న‌పిల్ల‌లుంటారు. అలాగే నేను ఈ సినిమాలో బాబును కూడా నేనే కేర్ తీసుకోవాల‌ని అనుకున్నాను. కానీ వాడు మ‌మ్మ‌ల్ని కేర్‌ఫుల్‌గా చూసుకునేవాడు. ఇదిగో ఇంత మంది ముందు కూర్చుని ఇంద‌రు చెప్పే ప్ర‌శ్న‌ల‌ను వింటూ, స‌మాధానాలు చెబుతున్నా. కానీ అత‌ను అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు నా ద‌గ్గ‌ర ఉండేవి కావు. కొన్ని సార్లు నైట్ షూటింగ్‌లు చేసేవాళ్లం. అలాంటి స‌మ‌యాల్లో వాడి ఎన‌ర్జీని చూసి రెట్టింపు ఎన‌ర్జీతో ప‌నిచేసేవాళ్లం. బ్యాక్‌గ్రౌండ్ సంగీతం సినిమాకు హైలైట్ అవుతుంది. ఇప్ప‌టికే నేను చూసేశాను.విన్నాను. సినిమాను నెక్స్ట్ లెవ‌ల్‌కి తీసుకెళ్తుంది. నేచుర‌ల్ స్టార్ అని ముందు అంద‌రూ అంటుంటే `ఎందుకు` అని అనుకునేవాడిని. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కి వాళ్ల ప్రేమ అని అర్థ‌మైంది. నాకు ఇంట్లో న‌వీన్ అని పేరు పెడితే మా అమ్మ నానీ అని ముద్దుగా పిలిచింది. ఇప్పుడు అభిమానులు కూడా ముద్దుగా పిలుచుకుంటున్నారు. అందుకే నేచుర‌ల్ స్టార్ అని పిలిచినా నాకు ఆనందంగానే ఉంది. చైనాలో సినిమాను విడుద‌ల చేస్తున్నాం.ఎప్పుడు ఏంటి అనేది త్వరలో చెప్తారు. ఒక‌ప్పుడు సినిమా అంటే ఉద‌యం 11 గంట‌ల‌కు థియేట‌ర్ల‌కు వెళ్లి స‌ర‌దాగా చూసేవాళ్లం. కానీ ఇప్పుడు అలా కాదు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో వివ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు వ‌స్తూనే ఉన్నాయి. ఉద‌యం 8 గంట‌ల‌కు సినిమా చూసేవాళ్ల‌కు వంద ర‌కాల ఒపీనియ‌న్లు మెసేజ్‌ల రూపంలో అందుతున్నాయి. థ్రిల్లింగ్‌గా థియేట‌ర్‌కు వెళ్లి సినిమాలు చూసే ఎక్స్ పీరియ‌న్స్ లు ఈ త‌రం మిస్ అవుతోంది. అలా కాకుండా ఎలాగూ సినిమా చూడాల‌నుకున్నారు కాబ‌ట్టి, సెల్‌ఫోన్లు ఆఫ్‌చేసి థియేట‌ర్ల‌కు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here