రివ్యూ: నిను వీడని నీడను నేనే

0
33

వైవిధ్యమైన సినిమాలు చేసే యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. సినిమాల రిజల్ట్ తో పని లేకుండా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  తాజాగా దర్శకుడు కార్తీక్ రాజు చెప్పిన కథ నచ్చి ‘నిను వీడని నీడను నేనే‌’ చిత్రంలో నటించడమే కాకుండా నిర్మాతగా మారారు. అన్యసింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, ఆడియోకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఈరోజే విడుదలయింది. మరి సందీప్ కిషన్ కెరీర్ కి ఈ చిత్రం ఏమాత్రం ఉపయోగపడిందో చూద్దాం పదండి.

కథ: తల్లిదండ్రులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకొన్న ర్జున్ (సందీప్ కిషన్), మాధవి (అన్య సింగ్) అనుకోకుండా ఓ యాక్సిడెంట్‌కు గురవుతారు. ప్రమాదం అనంతరం అర్జున్, మాధవిలు రిషి (వెన్నెలకిషోర్), దియా (పూర్ణిమా భరద్వాజ్) జీవితంలోకి ప్రవేశిస్తారు. రుషి, అర్జున్ మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన రుషి దంపతులను అర్జున్‌ దంపతులు వెంటాడుతుంటారు.ఏ పరిస్థితుల్లో రుషి దంపతుల జీవితంలోకి అర్జున్ దంపతులు ప్రవేశించారు? అర్జున్ వెంటాడటం వల్ల రిషి సమస్యలు ఎదుర్కొన్నాడు? తల్లిదండ్రుల నిర్ణయానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకొన్న అర్జున్ వారిని ఎలా మెప్పించాడు? అర్జున్, మాధవి కుటుంబాలు ఏరకంగా వారి ప్రేమను అంగీకరించారు. చివరకు రిషి బంధం నుంచి అర్జున్ ఎలా విముక్తి పొందారు. రిషిని వదిలేయడానికి ప్రధాన కారణం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే నిను వీడని నీడను నేనే సినిమా.

కథ.. కథనం విశ్లేషణ: కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను అధ్యయనం చేసిన ఫ్రొఫెసర్‌ను కలిసి వివరాలు సేకరించే ప్రయత్నంలో కథ మొదలవుతుంది. అర్జున్, మాధవిల ప్రేమ కథ ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌తో మొదలవుతుంది. ప్రేమ కోసం అర్జున్ తెగింపుతో అర్జున్ క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్ అవుతుంది. అర్జున్ దంపతుల జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఓ కుదుపు వారిని కదిలిస్తుంది. విధి ఆడిన నాటకంలో తమ జరిగిన అన్యాయాన్ని తెలుసుకోవడమనే ఈ కథలో కొత్త పాయింట్. తొలిభాగాన్ని చక్కటి ట్రీట్‌మెంట్‌తో పరుగులు పెట్టించారు. ఇంటర్వెల్‌లో థ్రిల్లింగ్ పాయింట్‌ను రివీల్ చేయడం ద్వారా రెండోభాగంపై మరింత ఆసక్తి పెరుగుతుంది.

ఫీల్‌గుడ్ పాయింట్‌తో ఫస్టాఫ్‌ను ముగించేసిన తర్వాత కథను ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనే సందేహంతో లోనికి వెళితే దర్శకుడు కార్తీక్ రాజు ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ కంటెంట్‌తో సినిమాను మరో కోణం వైపు కథను షిఫ్ట్ చేయడం ఫీల్‌గుడ్ అంశం. సెకండాఫ్‌లో రకరకాలు లాజిక్స్ ప్రేక్షకుడిని వెంటాడేలా చేసినప్పటికీ.. మురళీ శర్మ క్లారిటీతో కన్విన్స్ చేయడం ఆకట్టుకొనే పాయింట్. క్లైమాక్స్‌ను ఎలా ముగిస్తాడని ఎదురు చూసే ప్రేక్షకులకు తల్లిదండ్రులు, పిల్లల మధ్య భావోద్వేగాలను చక్కగా కథలో జొప్పించడం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. చివర్లో ఓ పాయింట్‌తో ఇచ్చిన ట్విస్టుతో హ్యాపీగా ఎండింగ్‌గా ముగుస్తుంది.

మల్టీ డైమన్షన్ హారర్, థ్రిల్లర్ కావాల్సిన పాయింట్‌ను కథగా మలిచిన తీరుతోనే డైరెక్టర్ కార్తీక్ రాజు సగం సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. లాజికులు లేకుండా కథను నడిపించిన తీరు ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది. రోటిన్ థ్రిల్లర్లకు భిన్నంగా రాసుకొన్న సీన్లు ఆకట్టుకొంటాయి. అలాగే అన్ని రకాల ఎమోషన్స్‌ను ఎలివేట్ చేయడం, సస్పెన్స్‌ను ఆద్యంతం గుప్పిట్లో మూసి నడిపించిన తీరు ప్రశంసనీయం. సెకండాఫ్‌లో కమర్షియల్ హంగుల కోసం కామెడీని ఇరికించడం కథా వేగానికి కళ్లెం వేసినట్టు అనిపిస్తుంది. పోసాని, మురళీ శర్మ పాత్రలను తీర్చిదిద్దిన తీరు అలరిస్తుంది.

మాస్, లవర్ బాయ్‌ ఇమేజ్‌తో నెట్టుకొస్తున్న సందీప్ కిషన్ తన ప్రతిభకు సానపట్టేందుకు రూట్ మార్చి తీసిన సినిమా అనిచెప్పవచ్చు. సరైన కథ ఉంటే తానేంటే అని ఈ సినిమా ద్వారా నిరూపించుకొన్నాడు. రెండు కోణాలు ఉన్న పాత్రలు రిషి, అర్జున్‌లో ఒదిగిపోయాడు. కచ్చితంగా సందీప్ కెరీర్‌లోనే బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. సినిమాపై ఉన్న నమ్మకంతోనే నిర్మాతగా మారి ఓ ఫీల్‌గుడ్ మూవీగా మార్చడంతో ఆయన మరో లెవెల్‌కు వెళ్లే ప్రయత్నం చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో ఏకంగా వన్ మ్యాన్ షో అనే విధంగా నటించాడు.

మాధవిగా అన్య సింగ్ ఆకట్టుకొన్నదని చెప్పవచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్లలో కొంత తడబాటుకు గురైనట్టు కనిపిస్తుంది. సందీప్‌తో రొమాంటిక్ సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా కెమిస్ట్రీని మంచిగా పండించింది. యూత్‌ను ఆకట్టుకొనే విధంగా గ్లామర్‌‌, ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెరిసింది. వెన్నెల కిషోర్ భార్యగా పూర్ణిమా భరద్వాజ్ పాత్ర చిన్న పరిధి చాలా చిన్నది. అయినా కథకు బలంగా నిలిచే పాత్రకు తన మేరకు న్యాయం చేసిందని చెప్పవచ్చు.

నిను వీడని నీడను నేనే సినిమా తన చుట్టే తిరిగినా.. ఎక్కువగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేని పాత్రలో తన టాలెంట్‌ను కుమ్మేశాడు వెన్నెల కిషోర్. సటిల్ ఫెర్మార్మెన్స్ ఆకట్టుకొన్నాడు. చివర్లో ఓ భావోద్వేగమైన సన్నివేశంలో వెన్నెల కిషోర్ తన మార్కును చూపించాడు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన కొన్ని కామెడీ సీన్లు అంతగా పండలేకపోయాయి. ఇక పోసాని పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకొన్నాడు. ఈ సినిమాలో వినోదాన్ని అద్భుతంగా పండించాడు. మురళీ శర్మ మరోసారి భావోద్వేగమైన నటనతో ఆకట్టుకొన్నాడు.

తెర వెనుక టీమ్‌లో ఎస్ థమన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. కీలక సన్నివేశాల్లో రీరికార్డింగ్‌తో తన సత్తాను మరోసారి చాటుకొన్నాడు. పాటలకు పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. స్క్రీన్ ప్లే ఆధారంగా సాగే సన్నివేశాలకు తన మ్యూజిక్‌తో మరింత ఎలివేట్ చేశారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో పీకే వర్మ సినిమాటోగ్రఫి మరో ఎసెట్. లైటింగ్, కలర్ ప్యాటర్స్ చక్కగా వాడుకొని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాగుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు స్టోరీ నేరేషన్‌కు అడ్డుపడ్డాయనిపిస్తుంది.

కంటెంట్ ప్రధానంగా ఉన్న హారర్, థ్రిల్లర్ జోనర్ కావాల్సిన సాంకేతిక విభాగాలను, నటీనటులను ఎంపిక చేసుకొన్న తీరు నిర్మాతల అభిరుచికి అద్దంపట్టింది. సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా కనిపించేలా చేశారు. మంచి కథను తెరపైకి తీసుకురావడంలో సందీప్ కిషన్ చూపిన చొరవను అభినందించాలి.

ఇటీవల వస్తున్న సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌తో వస్తున్న సినిమాలకు భిన్నంగా మంచి ఫీల్ అందించే చిత్రం నిను వీడని నీడను నేనే. లాజికులు పక్కన పెడితే ఈ మధ్య వచ్చిన థ్రిల్లర్ జోనర్‌లో ఫీల్‌గుడ్ మూవీ అనిచెప్పవచ్చు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్, దర్శకుడు విజన్ ఈ సినిమాకు హైలెట్. రోడ్డు ప్రమాదంలో ఓ క్షణం నిర్లక్ష్యం వహిస్తే జీవితంలో ఎలాంటి అనర్ధాలు చోటుచేసుకొంటాయనే సందేశంతో తీసిన మంచి సినిమా. బీ, సీ సెంటర్లలో లభించే ఆదరణను బట్టి ఈ సినిమా కమర్షియల్ రేంజ్ డిసైడ్ అవుతుంది. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి నిను వీడని నీడను మూవీ నచ్చుతుంది.

రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here