ప్రభాస్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’

0
246

‘బాహుబలి’ తరువాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్… భారీ బడ్జెట్టుతో తెరకెక్కిన ‘సాహో’లో నటించారు. UV క్రియేషన్స్ పతాకంపై ‘రన్ రాజా రన్’ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ప్రోమోలతోనూ… పబ్లిసిటీతోనూ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైంది. మరి ఈ చిత్రంతో డార్లింగ్ ప్రభాస్… ఏమేరకు అలరించాడో చూద్దాం పదండి.

కథ: అశోక్ చక్రవర్తి (ప్రభాస్) అమృత నాయర్ (శ్రద్ధా దాస్) ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్. ఓ భారీ దోపిడీ కేసును ఛేదించే క్రమంలో ఇద్దరు ఓ టీమ్ లో కలిసి పని చెయ్యాల్సి వస్తోంది. అయితే ఆ టీమ్ లో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు. రాబరీ గురించి.. అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టీవిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీమ్ ని లీడ్ చేస్తుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపులతో కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది. అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి ? భారీ చోరీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ? ఆ మలుపు తిరగటానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమయ్యాడు? మధ్యలో సడెన్ గా సాహో (ప్రభాస్) కథలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? పోలీస్ అశోక్ చక్రవర్తి (ప్రభాస్ )కి, సాహో (ప్రభాస్)కి మధ్య సంబంధం ఏమిటి ? ఇంతకీ వీళ్లు ఒకరా, ఇద్దరా? అసలు ప్రభాస్ ఎవరు ? అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి? మొత్తానికి ఈ కథను మొత్తం నడిపించింది ఎవరు ? ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ లు ఎదుర్కొన్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: భారీ అంచనాలతో ప్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా, అద్భుతమైన విజువల్స్ తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. సినిమా చూస్తున్నంతసేపూ ఓ అత్యుత్తమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ శ్రద్ధా కపూర్ పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. ప్రభాస్ – శ్రద్ధా కపూర్ మధ్య కెమిస్ట్రీ మరియు ప్రభాస్ క్యారెక్టర్ లోని షేడ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో కీలక మైన మరియు క్రూరమైన పాత్రలో నటించిన విలన్ ఛంకీ పాండే తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. విలన్స్ కి సంబంధించిన. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో వాళ్ళ నటన చాల బాగుంది.

ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ, లాల్, మురళి శర్మ, వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. సుజిత్ ఎక్కడా విజువల్ ట్రీట్ తగ్గకుండా.. మరియు భారీ యాక్షన్స్ సీన్స్ తో సినిమాని నడిపాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్, అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ స్, మరియు ప్రభాస్ – శ్రద్ధా మధ్య ట్రాక్, ఛేజింగ్ సీన్స్, అదేవిదంగా క్లైమాక్స్ లోని ట్విస్ట్ లు, అండ్ ప్రభాస్ యాక్షన్ పార్ట్.. సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

దర్శకుడు సుజిత్ రాసుకున్న ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీని తన విజన్ కి తగ్గట్టుగానే తెరమీద ప్రభాస్ ను చూపించి సక్సెస్ అయ్యారు. ఫ్యాన్స్ ను దృష్టిలో వుంచుకుని రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బమ్స్. పతాక సన్నివేషంలో ప్రభాస్ విశ్వరూపాన్ని చూపించి విజయం సాధించారు. మాస్ ఆడియన్స్ కు నచ్చే ఫుల్ మీల్ మూవీ ‘సాహో’.
మధి సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా ఆయన కథాకథనాలకు అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాలో స్లోగా సాగే సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది.

ఇక సంగీత దర్శకులు తనిష్క్ బాగ్చి, గురు రాంధ్వా, బాద్షా, శంకర్ ఎహసాన్ లాయ్ సమకూర్చిన పాటలు వినడానికి కంటే.. స్క్రీన్ మీద బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అలాగే జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాతలు ప్రమోద్, వంశీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా సినిమాను నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్!!
రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here