‘గేమ్ ఓవర్’లో వీడియో గేమ్‌ ప్రోగ్రామ్‌ డిజైనర్‌గా కనిపిస్తా- తాప్సీ

0
39

‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సొట్టబుగ్లల సుందరి తాప్పీ… ఆ తరువాత మిస్టర్ పర్ ఫక్ట్, సాహసం లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో నటిస్తూనే… తమిళంలో ఆడుగాలం లాంటి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన చిత్రంలో నటించింది. ఆ తరువాత హిందీలో పింక్ చిత్రంతో తన కెరీర్ ను మలుపు తిప్పుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో తాప్సీ మినిమం గ్యారెంటీ హీరోయిన్ అయిపోయింది. తాజాగా తెలుగు, తమిళంలో ‘గేమ్ ఓవర్’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈనెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భింగా తన కెరీర్ గురించి… చలన చిత్ర పరివ్రమలో తన స్థానం గురించి మీడియాతో ముచ్చటించింది.
‘నెంబర్‌ గేమ్‌లతో అలసిపోయాను. నీ స్థానం 3, 2 అంటూ 1 దగ్గరికి వచ్చేసరికి నువ్వు కాదు, మరొకరు అనేవాళ్లు (నవ్వుతూ). అందుకే ఆ పోటీ నుంచి నేను తప్పుకుని, ప్రత్యేకంగా నాదైన దారిని ఎంచుకొన్నా. ఇప్పుడు ఆ దారిలోనే నేనొక్కదాన్నే. దక్షిణాది ప్రేక్షకులకి సినిమాలపై ప్రత్యేకమైన ప్రేమ. ప్రతి వారం సినిమా కోసం ఎదురు చూస్తుంటారు. నటులపై ప్రేక్షకులకుండే ప్రేమ కూడా ఎక్కువే. హిందీలో అయితే సినిమా బాగుందంటేనే చూసొద్దామని థియేటర్‌కి వెళ్లేవాళ్లే ఎక్కువ. పరిశ్రమల మధ్య నేను గమనించిన తేడా అదే. సినిమా దర్శకుల మాధ్యమం. మిగిలిన వాళ్లంతా సినిమాకి పనిముట్లుగా ఉపయోగపడతాం. ఐదారేళ్లుగా దర్శకుల ఆలోచనలకి తగ్గట్టుగానే పనిచేస్తున్నా. ‘గేమ్‌ ఓవర్‌’ మొదలైన సమయంలో ఇది సోలో హీరోయిన్‌ కథ, దీన్ని నా భుజాలపైనే మోయాలనే విషయాలు గుర్తుకే రాలేదు. కానీ విడుదల దగ్గర పడుతున్నకొద్దీ ఒత్తిడి పెరిగింది. అశ్విన్‌ శరవణన్‌ స్క్రిప్టు ఆసక్తికరంగా అనిపించింది. వెంటనే నిర్మాత శశికాంత్‌తో సినిమా చేయడానికి సిద్ధం అని చెప్పా. ఇలాంటి కాన్సెప్ట్‌ని హాలీవుడ్‌లోనూ చూడలేదు. దర్శకుడు ఇదివరకు తమిళంలో నయనతారతో చేసిన ‘మాయ’ తెలుగులో ‘మయూరి’గా విడుదలైంది. నేనూ తమిళంలో ‘కాంచన 2’ తర్వాత సినిమా చేయలేదు. అలా ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో మొదలు పెట్టాం. అనురాగ్‌ కశ్యప్‌ ఈ సినిమాని చూసి హిందీతో పాటు విదేశాల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో నేను వీడియో గేమ్‌ ప్రోగ్రామ్‌ డిజైనర్‌గా కనిపిస్తా. సినిమాలో ప్రమాదానికి గురైన అమ్మాయిగా నటించాను. 60 శాతం వరకు వీల్‌ ఛైర్‌లోనే కనిపిస్తాను. ఆ ప్రమాదం ఎలా జరిగింది? ఏడాది తర్వాత మళ్లీ తన జీవితం ఎలాంటి ఆటుపోట్లకి గురైందన్నది తెరపైనే చూడాలి. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఎంతో శ్రమించాను. 25 రోజులు వీల్‌ ఛైర్‌లో కూర్చోవాల్సి వచ్చింది. ‘బద్లా’, ‘పింక్‌’ చిత్రాల్లో అమితాబ్‌ బచ్చన్‌తో పనిచేయడం…
అభిషేక్‌ బచ్చన్‌తో నటిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో… అలానే వుంది. ఆయన బాగా కలిసిపోతుంటారు. మేమిద్దరం కలిసి చేయబోయే మూడో చిత్రం కూడా ఇలాగే విజయవంతం కావాలి. అంచనాలు లేకపోతే నటుల జీవితంలో కిక్కే లేదు. సినిమా గురించి ప్రేక్షకులు ఎదురుచూడటం, మాట్లాడుకోవడం ఆనందాన్నిచ్చే విషయమే. ఇకపైనా నా ప్రతి సినిమా రూ.వంద కోట్లు సాధించాలి. అందంగా కనిపించే కథానాయికలు చాలామంది ఉన్నారు. భిన్నమైన కథల కోసం నాలాంటి నాయికల్ని ఎంపిక చేసుకుంటున్నారు. గ్లామర్‌ ప్రధానమైన పాత్రలు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ అందులో కూడా మంచి కథ ఉండాలి. టాలీవుడ్ నుంచి మంచి కథలు వస్తున్నాయి. అందుకే తప్పనిసరిగా ఇక్కడ ఏడాదికొక సినిమా చేస్తున్నా. ఈమధ్య కూడా మూడు కథలు విన్నాను. తమిళంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. తెలుగు సినిమా గురించి చర్చలు సాగుతున్నాయి. అవి త్వరలోనే చెబుతా’ అంటూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here