రివ్యూ: ట్యాక్సీవాలా

0
461

 రేటింగ్: 3.25
‘గీత గోవిందం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ… ఇప్పుడు ‘ట్యాక్సీవాలా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వేసవిలోనే రావాల్సిన ఈ చిత్రం… పైరసీ తదితర కారణంగా వాయిదా పడి ఈ రోజే రిలీజైంది. రాహుల్ సంకృత్యన్ ఈ థ్రిల్లర్ కి దర్శకుడు. ఇందులో ఏమాత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో చూద్దాం పదండి.

కథ: శివ (విజయ్ దేవరకొండ) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. రకరకాల ఉద్యోగాలు చేసి.. చివరికి టాక్సీడ్రైవర్ కావాలనుకొని… తనకున్న బడ్జెట్లో ఓ వింటేజ్ కారు కొని దాన్ని బాగు చేయించుకుని క్యాబ్ సర్వీస్ మొదలుపెడతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ కారులో దయ్యం ఉందని తెలుసుకుంటాడు విజయ్. ఇంతకీ ఆ దయ్యం ఎవరు? దానికి కారుకున్న సంబంధమేంటి? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..!

కథనం – విశ్లేషణ: హార్రర్ కామెడీ అంటేనే బెంబేలెత్తిపోయే తరుణంలో యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్.. కొత్త రైటర్ సాయికుమార్ రెడ్డి అండతో.. జానర్ నుంచి పక్కకు వెళ్లకుండా.. కథకు కట్టుబడి ‘ట్యాక్సీవాలా’ సినిమా తీశాడు. సూపర్ నేచురల్ ఎలిమెంట్ ను సైంటిఫిక్ వేలో చెప్పడం ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. పూర్తి సీరియస్ సినిమాగా కాకుండా సిచువేషనల్ కామెడీతో మంచి వినోదం పంచాడు. దాంతో బాగా ఎంగేజ్ చేస్తుంది ‘ట్యాక్సీవాలా’.
విజయ్ దేవరకొండ మరోసారి మెప్పించాడు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ‘గీత గోవిందం’లో మాదిరే.. సాధారణమైన పాత్రలో అతను సులువుగా ఒదిగిపోయాడు. సహజమైన నటనతో.. తనదైన శైలి డైలాగ్ డెలివరీతో విజయ్ మెప్పించాడు. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ చూడ్డానికి క్యూట్ గా ఉంది.  మాళవిక నాయర్ కీలకమైన పాత్రలో తన ప్రత్యేకతను చాటుకుంది. హీరో స్నేహితులుగా మధునందన్ తో పాటు కొత్త కుర్రాడు విష్ణు అదరగొట్టారు. సినిమాలో కామెడీ క్రెడిట్ ప్రధానంగా వీళ్లిద్దరిదే. చమ్మక్ చంద్ర ఉన్న కాసేపు నవ్వించాడు. విలన్ పాత్రలో సిజ్జు ఓకే అనిపించాడు. రవి వర్మ.. యమున.. రవిప్రకాష్.. కళ్యాణి.. ఉత్తేజ్ చిన్న చిన్న పాత్రల్లోనే మెప్పించారు.
‘ట్యాక్సీవాలా’ సినిమాకి సాంకేతిక నిపుణుల పాత్ర కీలకం. టెక్నీషియన్లందరూ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. జేక్ బిజోయ్ నేపథ్య సంగీతం.. పాటలు సినిమాలకు బలంగా నిలిచాయి. సుజీత్ సారంగ్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద అస్సెట్. ఈ జానర్ సినిమాకు పర్ఫెక్ట్ గా సూటయ్యే లైటింగ్ థీమ్స్ తో అతను ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్.. ఆర్ట్ వర్క్ కూడా ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాలకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యన్.. రచయిత సాయికుమార్ రెడ్డి తమ పనితనం చూపించారు. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా అనిపిస్తుంది. మాటలన్నీ సందర్భానుసారం వచ్చేవే. రాహుల్ హార్రర్ థ్రిల్లర్లను బాగా డీల్ చేయగలనని చాటుకున్నాడు. అతను ఈ తరం దర్శకుడని సినిమాలో చాలా చోట్ల తెలుస్తుంది. సిచువేషనల్ కామెడీ పండించడంలో.. కథకు కీలకమైన సన్నివేశాల్ని డీల్ చేయడంలో అతడి పనితనం కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ, GA2, UV క్రియేషన్స్ లో మరో హిట్టు జమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here