లండన్ లో గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన తెలుగు స్వర మాంత్రికుడు

0
85

మేళకర్త రాగాల మాంత్రికుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు, స్వరవీణాపాణిగా అందరికీ పరిచితుడైన వోగేటి నాగ వెంకట రమణ మూర్తి లండన్ వేదికగా సంగీత విభాగంలో గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టి అందరినీ ఔరా అనిపించారు.

“లాంగెస్ట్ మారథాన్ చర్చ్ ఆర్గాన్ ప్లేయింగ్” అనే అంశంలో 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61 గంటల 20 నిమిషాలు తన సంగీత సాధనంపై ఆలపించి ఈ అరుదైన ఘనతను సాధించారాయన.
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త), వెన్నం ఫౌండేషన్ (అమెరికా), స్వరనిధి (ఇండియా), ద భవన్ (యూకే) సంస్థలు సంయుక్తంగా ఈ ప్రపంచ రికార్డును లండన్ లోని హ్యామర్ స్మిత్ కు చెందిన కళానిలయమైన *ద భవన్* లో సెప్టెంబర్ 30, 2019 నుంచి అక్టోబర్ 2, 2019 వరకు నిరాటంకంగా నిర్వహించాయి.

వేకువ జామున పూజా కార్యక్రమాలు పూర్తి చేసి, ద భవన్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఎన్.నందకుమార ఆశీస్సులు తీసుకుని, స్వరవీణాపాణి
సెప్టెంబర్ 30 న ఉదయం 5 గంటలకు మారథాన్ ఆలాపన ప్రారంభించారు.
మూడు సార్లు గిన్నిస్ రికార్డు గ్రహీత, ప్రత్యేక ఆహ్వానితులు, పాలమూరు విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి కీలకోపన్యాసం చేస్తూ, ఈ గిన్నిస్ రికార్డు నియమ నిబంధనలు, ఏ రకంగా విశ్రాంతి తీసుకోవచ్చో, ప్రధాన సాక్షులు ఎలా వ్యవహరించాలో వివరించారు.
స్వరవీణాపాణి గంటసేపు సంగీతాలాపన చేస్తే ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవడానికి అర్హుడని, ఎన్ని గంటలు ఏకధాటిగా చేసినా అన్ని ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకునేందుకు అర్హత ఉంటుందన్నారు.

యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ శ్రీ సత్యప్రసాద్ కిల్లీ, వారి బృందసభ్యులైన వైస్ ప్రెసిడెంట్ సి.అమర్ నాథ్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ అల్లాడి ఆదిత్య వర్ధన్‌ మిగతా సభ్యులతో ఈ గిన్నిస్ రికార్డుకు వ్యూహరచన చేసి విజయం సమకూర్చారు.
రికార్డు ప్రయత్నంలో భాగంగా స్వరవీణాపాణి విశ్రాంతి, ఆహార స్వీకరణ వ్యూహరచన హైదరాబాద్ కు చెందిన కప్పగంతుల రాజశేఖర్ చూసుకోగా, స్వరవీణాపాణి ఆరోగ్య భద్రతను ఢిల్లీకి చెందిన కాకాని నాగేశ్వర ప్రసాద్ పర్యవేక్షించారు.
గిన్నిస్ రికార్డు ప్రయత్నం కంటే ముందు కావలసినంత సాధన చేసినప్పటికీ, 20 గంటల మారథాన్ తర్వాత ఒకసారి, 40 గంటల తర్వాత మరో సారి స్వరవీణాపాణి తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. అయినప్పటికీ మేళకర్త రాగాలాపనతో సభికులందరూ మంత్రముగ్ధులయ్యారు. ఒత్తిడిని అధిగమించి తన మేళకర్త రాగాలాపనతో ఔరా అనిపించారు.
గతంలో నార్వేకు చెందిన నీనా ఇర్స్ లింగర్ పేరున ఉన్న 60 గంటల 1 నిముషం 25 సెకండ్ల రికార్డును స్వరవీణాపాణి అధిగమించి 61 గంటల 20 నిమిషాల కొత్త రికార్డు నమోదు చేశారు.
గిన్నిస్ రికార్డు అధికారిక న్యాయనిర్ణేత జాక్ బ్రాక్ బ్యాంక్ అన్ని రుజువులను, సమర్పించిన వివరాలను పరిశీలించి సత్య ప్రసాద్ కిల్లీ బృందాన్ని అభినందించారు. ప్రతి అంశాన్ని డాక్యుమెంట్ చేసిన విధానాన్ని మెచ్చుకొన్నారు.
గిన్నిస్ అధికారులైన జాక్, సోనియా బృందాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనసభాధిపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డికి కిల్లీ పరిచయం చేసారు
పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి క్లిష్టమైన అంశాన్ని గిన్నిస్ రికార్డు గా తీసుకుని అందులో విజయం సాధించడం అసాధారణమైన విషయమని పేర్కొంటూ వీణాపాణిని శాలువాతో సత్కరించి అభినందించారు.
లండన్ లోని భారత హైకమీషన్ సమన్వయ మంత్రి మన్ ప్రీత్ సింగ్ నారంగ్ మాట్లాడుతూ ఈ గిన్నిస్ రికార్డు కేవలం వీణాపాణికి మాత్రమే చెందినది కాదని, అది ప్రతి భారతీయుని విజయమని, యుక్త చేసే ప్రతి కార్యక్రమానికి భారత హై కమీషన్ సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తుందని అన్నారు.
లండన్ హ్యామర్ స్మిత్, ఫుల్ హ్యామ్ మేయర్, కౌన్సిలర్ డేరియల్ బ్రౌన్ మాట్లాడుతూ ఒక వ్యక్తి విజయం సాధించడానికి ఇక్కడ ఉన్న తెలుగు వారంతా ఏకమై ప్రోత్సహించి తోడుగా నిలిచిన తీరు తనను ఎంతో కదిలించిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఇలాంటి ఓ చారిత్రక కార్యక్రమం ద భవన్ లో నిర్వహించడం భవన్ కు దక్కిన ఓ అరుదైన ఘనతగా ఎం.ఎన్.నందకుమార పేర్కొన్నారు. యుక్త చేసే ప్రతి కార్యక్రమంలో ద భవన్ తోడ్పాటు కచ్చితంగా ఉంటుందన్నారు.

యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ప్రెసిడెంట్ రాజశేఖర్ కుర్బ మాట్లాడుతూ
సదుద్దేశంతో, సాహితీ సాంస్కృతిక సౌరభాలను వెదజల్లే ఎలాంటి మంచి కార్యక్రమానికైనా యుక్త ముందు వరుసలో ఉంటుందన్నారు.
గిన్నిస్ రికార్డు చేయాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి ఈరోజు ఈ విజయం సాధించేవరకు అమెరికాకు చెందిన శ్రీ వెన్నం మురళి ప్రోత్సహస్తూ సహాయ సహకారాన్ని అందించడం ఎన్నడూ మరువలేనని స్వర వీణాపాణి అన్నారు.
ఈ ఘనవిజయం వెనుక నిలిచన ద భవన్ బృందానికి, తన శ్రేయోభిలాషులకు, మిత్రులకు స్వరవీణాపాణి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here