వరలక్ష్మీ శరత్ కుమార్… తెలుగు ఇండస్ట్రీలో ప్రామిసింగ్ ఆర్టిస్ట్. ఎక్కువ భాగం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూ… తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆమె బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో చేసిన చెల్లెలు పాత్ర సినిమాకి ఎంత హైలైట్ అయిందో వేరే చెప్పనక్కరలేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేయడానికి పర్ ఫెక్ట్ ఫ్లాట్ ఫాం క్రియేట్ చేసుకున్న ఈ ఫైర్ బ్రాండ్… ఇప్పుడు ‘శబరి’గా మన ముందుకు వచ్చింది. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: సంజన(వరలక్ష్మి శరత్ కుమార్) తన భర్త అరవింద్(గణేష్ వెంకట్ రామన్)ని వదిలేసి కూతురు(బేబీ నివేక్ష)తో సింగిల్ గా బతుకుతుంటుంది. ముంబై నుంచి విశాఖపట్నం వచ్చి ఫ్రెండ్ వద్ద ఉంటూ జాబ్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో తన కాలేజీ ఫ్రెండ్ లాయర్ రాహుల్(శశాంక్)ని కలుస్తుంది. అతని సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డాన్స్ ట్రైనర్ గా జాయిన్ అవుతుంది. ఆ జాబ్ చేస్తూ సిటీకి దూరంగా ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఇల్లు తీసుకొని ఉంటుంది. సంజనకు తనని, తన కూతురుని సూర్య(మైమ్ గోపి) అనే క్రిమినల్ వెంబడిస్తున్నట్టు, చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అతన్నుంచి తప్పించుకోవాలని ట్రై చేసే క్రమంలో సంజన గాయాలపాలవుతుంది. పోలీసులకు ఈ విషయం చెప్పగా వాళ్ళు విచారణ చేస్తే సూర్య ఆల్రెడీ చనిపోయాడని తెలుస్తుంది. మరోవైపు తన భర్త అరవింద్ కూతురిని తనకు ఇవ్వాలని కోర్టుకు వెళ్తాడు. అసలు సంజన అరవింద్ ని ఎందుకు వదిలేసింది? సంజనని చంపడానికి వెంబడిస్తున్న సూర్య ఎవరు? కూతురుని కాపాడుకోడానికి సంజన ఏం చేసింది? సంజన గతం ఏంటి? రియాకి.. సూర్యకి సంబంధం ఏంటి? లాయర్ రాహుల్ సంజనకు ఎలాంటి సాయం చేశాడు అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఇలాంటి సినిమాలకు టేకింగ్ ప్రధానం. దాన్ని దర్శకుడు చాలా ఎంగేజింగ్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. సినిమా బిగినింగ్ నే ఓ మానసిక రోగుల ఆశ్రమం నుంచి ఓ వ్యక్తి తప్పించుకొని ఇద్దరిని చంపి తల్లి కూతురు కోసం వెతుకుతున్నట్టు చూపించి ఆసక్తి కలిగించారు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల తాలూకు నేపథ్యం పరిచయాలకు టైం తీసుకున్నా… ఆ తరువాత సంజన ఎందుకు తన భర్తకి దూరంగా ఉంటుంది అనే సస్పెన్స్ తో చివరి వరకూ సినిమాని ఎంగేజ్ చేయగలిగారు దర్శకుడు. ఓ సింగిల్ మదర్ జాబ్ కోసం పడే కష్టాలు… ఆమెకు ఎదురయ్యే అనుభవాలన్నీ చాలా ఆస్తకిగా వుంటాయి. సూర్య పాత్ర ఎంట్రీతో సినిమా ఫాస్ట్ గా ముందుకు సాగుతుంది. సంజన – సూర్యల మధ్య సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్స్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. శబరి సినిమాలో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ వుంది. గో అండ్ వాచ్ ఇట్.
వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పటిలాగే తన సహజ నటనతో ఆకట్టుకుంది. తల్లిగా ఎమోషన్ సీన్స్ లోనూ… కూతురుని కాపాడుకునే యత్నంలో యాక్షన్ సీన్స్ లోనూ ఆకట్టుకుంది. సింగిల్ మదర్ గా కూతురు కోసం తపన పడే మహిళగా మెప్పించింది. మైమ్ గోపి భయపెట్టగలిగాడు. గణేష్ వెంకట్రామన్ రెండు షేడ్స్ లో నటించి మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నివేక్ష క్యూట్ గా నటించింది. లాయర్ గా శశాంక్, పోలీసాఫీసర్ గా మధుసూదన్, కామెడీతో భద్రం.. ఇలా ఎవరికి వారు తమ తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.
సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణ. విజువల్స్ చాలా రిచ్ గా వున్నాయి. గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కి తగ్గట్టు ఉంది. తల్లి – కూతుళ్ళ అనుబంధంతో ఉన్న రెండు పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. దర్శకుడిగా అనిల్ పాస్ అయ్యారు. ఓ క్లీన్ థ్రిల్లర్ ని ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా తగ్గకుండా సినిమాకి ఖర్చు పెట్టారు నిర్మాత.
రేటింగ్: 3