రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంట వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మొన్న విడుదలైన ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమాలో నటించిన ఈ జంట… తాజాగా ‘విద్యా వాసుల అహం’తో మన ముందుకొచ్చారు. విడుదలక ముందే ప్రీ ప్రమోషన్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ… ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
స్టోరీ ఏమిటంటే…
విద్య(శివాని రాజశేఖర్), వాసు(రాహుల్ విజయ్)లకు పెళ్లి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అయితే విద్య అనుకోకుండా ఓసారి గుడికి వెళ్లినప్పుడు అక్కడ పెళ్లి గురించి చెప్పిన మాటలు విని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతుంది. అయితే విద్య చాలా క్యాలుక్యులేటెడ్ అమ్మాయి. తనకు నచ్చిన పెళ్లి కొడుకును సెలెక్ట్ చేయడం కోసం ఒక అప్లికేషన్ ను రెడీ చేసి… దాన్ని పేరెంట్స్ కి… మీకు నచ్చిన వాళ్లందరితో ఫిల్ అప్ చేయించి ఇవ్వండి. అప్పుడు ఒకరిని ఫైనల్ చేస్తానని చెబుతుంది. అలా వాసు దగ్గరికి కూడా ఆ అప్లికేషన్ వస్తుంది. ఇక అసలే పెళ్లి అంటే ఇంట్రెస్ట్ లేని వాసు ఈ అప్లికేషన్ చూసి ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో అమ్మాయి ఎవరో చూడకుండానే ఫిల్ చేసి పంపిస్తాడు. అయితే వాసు అప్లికేషన్ నచ్చి పెళ్లికి ఒకే చెబుతుంది విద్య. అలా వాసుని ఓకే చేయడంతో విద్య, వాసుల పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత కొత్త కాపురం పెట్టిన ఈ జంటకు మొదట్లో అంతా బావుంటుంది. జీవితం సంతోషంగా ముందుకు వెళుతుంది. అయితే సడన్‌గా వీళ్లిద్దరి మధ్య అహం వలన గొడవలు స్టార్ట్ అవుతాయి. మరి కొత్త జంట మధ్య గొడవ ఎందుకు వచ్చింది? ఎవరి అహం వలన ఎవరి మనసు నొచ్చుకుంది? ఇందుకు వారి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సహకారం అందింది? చివరకు ‘విద్యా వాసుల అహం’ ఎలా సద్దుమణిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలావుందంటే…
పెళ్లైన ఓ కొత్త యువ జంటలో ఉండే ఇగోని బేస్ చేసుకుని తీసుకున్న ఈ సినిమా కథ.. కథనం కొత్తగా ఉంది. ఇటీవల యువతను బేస్ చేసుకుని తీస్తున్న సినిమాలన్నీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందులోను కాస్త రొమాన్స్, మరికొంత కామెడీని జోడించి తెరమీద చూపిస్తే… ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించేయొచ్చు. అందుకే శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ జంటగా ఇలాంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను ‘విద్యావాసుల అహం’పేరుతో ఎక్కించి… మంచి మార్కులే కొట్టేశారు చిత్ర బృందం. ప్రస్తుత జనరేషన్‌లో పెళ్లైన జంటల మధ్య క్యూట్ రిలేషన్ షిప్‌తో పాటు అహం (ఇగో) వలన గొడవలు ఎలా వస్తున్నాయో పర్ఫెక్ట్ గా చూపించారు దర్శకుడు మణికాంత్. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంది. ఎక్కడా బోర్ కొట్టదు. క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. భార్యభర్తల మధ్య వచ్చే ఇగోలను తల్లిదండ్రులుగా వారు ఏమి చేయాలనేదాన్ని కూడా ఇందులో చూపించారు. జంటల మధ్య క్షణికావేశంలో వచ్చే అహం… పెద్దల ఇన్వాల్వ్ మెంట్ తో సమసిపోతుందనేదాన్ని ఓ మెసేజ్ రూపంలో చూపించారు. అందరికీ నచ్చుతుంది. గో అండ్ వాచ్ ఇట్.
ఎవరెలా చేశారంటే…
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంట గురించి కొత్తగా చెప్పనక్కరలేదు… వారిద్దరూ కలిసి ఇంతకు ముందు ‘కోట బొమ్మాళి పీఎస్’లో నటించి ఆకట్టుకున్నారు. దాంతో వీరిద్దరి జంట మరోసారి నటిస్తున్నారంటే… సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అందుకుతగ్గట్టుగానే ఇద్దరూ పోటీ పడి నటించారు. ప్రస్తుత జనరేషన్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారో… ఇందులో వీరిద్దరి పాత్రలు అలానే ఉన్నాయి. వారు కూడా పాత్రల్లో జీవించేశారనే చెప్పొచ్చు. వారితో పాటు నటించిన అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణిల పాత్రలు కూడా పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు…
దర్శకుడు మణికాంత్ ఈ జనరేషన్ యువతకు తగ్గట్టుగా ఆలోచించి.. రాసుకున్న కథ… కథనాలు కొత్తగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయనేది ఇందులో చూపించి ఆకట్టుకున్నారు. దర్శకుడిగా ప్రేక్షకుల్లో మంచి మార్కులే సంపాధించుకున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటను చాలా క్యూట్ గా, రొమాంటిక్ గా చూపించారు. యూత్ కి బాగా నచ్చుతుంది. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా పెట్టేశారు. నిర్మాణ విలువల చాలా ఉన్నతంగా ఉన్నాయి. సరదాగా ‘ఆహా’ ఓటీటీలో చూసేయండి.
రేటింగ్: 3










