చాలా కాలం తరువాత అల్లు శిరీష్ ‘బడ్డీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఊర్వశివో రాక్షసివో తరువాత నటించిన ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటించింది. తమిళ దర్శకుడు సామ్ ఆంటోన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రిషా రాజేష్ సింగ్, ఆలీ, అజ్మల్ అమీర్, ముఖేష్ రుషి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. సంగీతం హిప్ ఆప్ తమిళ అందించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘బడ్డీ’తో అల్లువారబ్బాయి ఏమాత్రం అలరించారో చూద్దాం పదండి.
కథ: తల్లిదండ్రులను ఓ ఫ్లైట్ యాక్సిడెంట్ లో పోగొట్టుకున్న ఆదిత్య(శిరీష్)… వైజాగ్ ఏయిర్ పోర్టులో పైలైట్ గా పనిచేస్తుంటాడు. అదే ఎయిర్ పోర్టులో ఎయిర్ కంట్రోలర్ ట్రాఫిక్ సెంటర్(ఏటీసీ)లో పనిచేసే పల్లవి(గాయత్రి భరద్వాజ్).. ఆదిత్య ప్రేమలో పడుతుంది. ఆమె మూలంగా ఆదిత్య సస్పెన్షన్ అవుతాడు. ఆదిత్యను పల్లవి చూస్తుంది కానీ… ఆదిత్య మాత్రం పల్లవి ఎవరో తెలియకుండానే ఆమెతో ఏటీసీ కంట్రోల్ లో పనిచేసే అమ్మాయిగా మాట్లాడుతూ ఉంటారు. ఆమెకు ఓ టెడ్డీని కూడా బహుమితిగా ఇస్తాడు. అయితే ఈ క్రమంలో పల్లవి అనుకోకుండా అర్జున్(అజ్మల్) అనే వైద్యుడి గ్యాంగ్ చేత కిడ్నాప్ కు గురవతుంది. ఆమెను కిడ్నాప్ చేసే క్రమంలో ఆమె ఆత్మ… తనకు ఆదిత్య బహుమతిగా ఇచ్చిన టెడ్డీ బేర్ లోకి ప్రవేశిస్తుంది. ఇలా టెడ్డీ బేర్ లోకి వెళ్లిన పల్లవి ఏమి చేసింది? తను ప్రేమించిన ఆదిత్యను పల్లవి ఎలా కలుస్తుంది? ఆమెను కిడ్నాప్ చేయడానికి గల కారణం ఏమిటి? కిడ్నాప్ గురైన పల్లవిని ఆదిత్య ఎలా కనుక్కుంటాడు? అందుకు టెడ్డీ ఎలాంటి సహాయం అందించింది? చివరకు టెడ్డీ కథ ఏమైంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఏదైనా డాల్ ను బేస్ చేసుకుని తీసే సినిమాల్లో బోలెడంత ఫన్ ఉంటుంది. అలాగే హారర్ ను కూడా తెరమీద చూపించారు కొంత మంది దర్శకులు. అయితే ఈ బడ్డీలో మాత్రం టెడ్డీ బేర్ తో కాస్త ఫన్… కొంత ఎమోషన్ పండించారు. గతంలో ఇలాంటి స్టోరీస్ చాలానే వచ్చినా… ఇది మాత్రం కొంత యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారనే చెప్పొచ్చు. లాజిక్ లు ఆలోచించకుండా సినిమాను చూస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. థ్రిల్లింగ్ అంశాలూ చాలానే ఉన్నాయి. ఇందులో ఎలివేషన్స్ కి… హీరోయిజానికి స్కోప్ ఉన్నా… అల్లు శిరీష్ ను దృష్టిలో ఉంచుకుని చాలా నాచురల్ గా ఉండేలా యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసి తీశారు. అయితే మూవీ హాంగ్ కాంగ్ కి షిఫ్ట్ అయ్యాక అనవసరపు యాక్షన్ సీక్వెన్సెస్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారనుకునే టైంలో… టెడ్డీ బేర్ తో కేజీఎఫ్, భగవంత్ కేసరి, ఆనిమల్ ఇన్స్ పిరేషన్ తో చేయించిన మెషిన్ గన్ ఎపిసోడ్ ఎంగేజింగ్ గా ఉంది. ఓవరాల్ గా ‘బడ్డీ’ అటు చిన్నపిల్లలతో పాటు… ఓ వర్గం ఆడియన్ ను ఆకట్టుకుంటాడు. సరదాగా ఈ వీక్ ఎండ్ లో ఓ సారి చూసేయొచ్చు.
అల్లు శిరీష్… ఎప్పటిలాగే తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్స్ లో తన సెటిల్ ఫర్ ఫార్మెన్స్ తో మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో నాచురల్ గా కనిపించారు. ఇందులో పాటలకు పెద్దగా స్కోప్ లేదు. అలాగే హీరోయిన్ తో సీన్స్ కూడా లేవు. అయితే తనని ప్రేమించిన అమ్మాయిని కాపాడే… ఓ ప్రియుడి పాత్ర ఎలా ఉంటుందో అనేది క్లైమాక్స్ లో ఫ్లైట్ యాక్షన్ సీక్వెన్స్ లో చూపించిన నటన చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అతనికి జంటగా నటించిన గాయత్రి భరద్వాజ్ నటన కూడా పర్వాలేదు. విలన్ పాత్రలో నటించిన అజ్మల్ ఎప్పటిలాగే తన మార్కు రౌద్రం చూపించారు. ఆలీ కామెడీ కాసేపు నవ్వులు పూయిస్తుంది. శిరీష్ ని ప్రేమించే అమ్మాయి పాత్రలో నటించిన మరో నటి ప్రిషా రాజేష్ సింగ్ కూడా సెకెండాఫ్ లో బాగానే చేసింది. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు సామ్ ఆంటోన్ ఎంచుకున్న ప్లాట్ కొత్తగా ఉంది. అయితే దాన్ని నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉంటే… ఈ సినిమా మరో లెవెల్ లో వుండేది. టెడ్డీతో మరింత ఫన్ జనరేట్ చేసుంటే… కిడ్స్ బాగా ఎంజాయ్ చేసే వారు. ఫన్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ను సమానంగా ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. హిప్ హాప్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ పర్వలేదు. సినిమాటోగ్రఫీ కొంచం డల్ గా ఉందనే చెప్పొచ్చు. వీఎఫ్ఎక్స్ వీక్ గా ఉంది. చాలా చోట్ల అది కనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 2.75









