స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ లీడ్స్ లో ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, దివిజ ప్రభాకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా … ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: బ్రహ్మానందం(రాజా గౌతమ్) యాక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తొమ్మిదేళ్లుగా ఏ పని చేయకుండా ప్రయత్నాలు చేస్తూ… అప్పుడప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉంటాడు. బ్రహ్మ తాతయ్య ఆనంద్ రామ్మూర్తి(బ్రహ్మానందం) ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు. బ్రహ్మానందంకు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు రాశి(దివిజ ప్రభాకర్) బ్రహ్మానందంను, ఆనంద్ రామ్మూర్తిని పలకరిస్తూ ఉంటుంది. నేషనల్ లెవల్ థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటేషన్ లో బ్రహ్మానందం రాసిన నాటకం సెలెక్ట్ అవుతుంది కానీ అది ప్లే చేయాలంటే ఆరు లక్షలు అడుగుతారు. డబ్బుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు బ్రహ్మానందం. ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ తార(ప్రియా వడ్లమాని) వదిలేస్తుంది. బాబాయ్ అవమానిస్తాడు. దీంతో బాధపడుతున్న బ్రహ్మానందంకు నా దగ్గర ల్యాండ్ ఉంది, నేను చెప్పినట్టు చేస్తే ఆ ల్యాండ్ నీకు ఇస్తాను అని ఆనంద్ రామ్మూర్తి చెప్పడంతో డబ్బుల కోసం ఆయనతో కలిసి బ్రహ్మానందం ఒక ఊరికి వెళ్తాడు. మరి ఆనంద్ రామ్మూర్తి పెట్టిన కండిషన్స్ ఏంటి? వాళ్ళు ఏ ఊరికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? బ్రహ్మానందంకు 6 లక్షలు వచ్చాయా? తార మళ్ళీ తిరిగొచ్చిందా? బ్రహ్మానందం నటుడు అయ్యాడా? తాత – మనవడు ఎందుకు సింగిల్ గా ఉంటున్నారు? వారి మధ్య రిలేషన్ ఏంటి తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ… వరుస హిట్లతో దూసుకుపోతున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా… ఈ సారి ఓ ఫీల్ గుడ్ సెంటిమెంట్ సినిమాతో వచ్చాడు. సుమంత్ తో మళ్ళీరావా అనే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని, నవీన్ పోలిశెట్టితో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి కామెడీ థ్రిల్లర్ ను, సంగీత, తిరువీర్ తో కలిసి మసూద లాంటి స్పైన్ చిల్లింగ్ హారర్ డ్రామాను తెరకెక్కించాడు. ఇవన్నీ వేటికవే ప్రత్యేక జోనర్స్. ఇప్పుడు మళ్ళీ ఇంతకూ ముందు విడుదలైన మూడు సినిమాల జోనర్స్ కి సంబంధం లేకుండా బ్రహ్మ ఆనందంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.
నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం – రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడుగా నటించారు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలు, బ్రహ్మనందం కష్టాలు, థియేటర్ ప్లే ఛాన్స్ రావడం, ఆనంద్ రామ్మూర్తి ఓల్డ్ ఏజ్ హోమ్, అన్నయ్య – తాతయ్య మీద రాశి ప్రేమ, డబ్బుల కోసం ఆనంద్ రామ్మూర్తి వెంట బ్రహ్మానందం ఊరికి వెళ్లడంతో సాగుతుంది. అక్కడికి ఊరికి వెళ్ళాక ఇంటర్వెల్ కి తాత ఓ ట్విస్ట్ ఇవ్వడంతో ఆసక్తి నెలకొంటుంది. ఆ ట్విస్ట్ తో బ్రహ్మానందం అక్కడే ఇరుక్కుపోవడం, తాత కోసం ఏం చేసాడు అని సాగుతుంది.
ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా కామెడీతోనే నడిపించి అక్కడక్కడా చిన్న ఎమోషన్ చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో నవ్విస్తూనే ముసలి వాళ్ళ ఎమోషన్, వాళ్ళ కష్టాలు, మనుషులతో అనుబంధాలు… ఎమోషన్ ను ఎక్కువగా క్యారీ చేసారు. రాజా గౌతమ్ పాత్రను ఎన్ని ఎమోషన్స్ వచ్చినా మారని ఒక సెల్ఫిష్ క్యారెక్టర్ లా పొట్రైట్ చేసారు. మంచి ఎమోషన్ నడిపించి ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ప్రమోషన్స్ లో చెప్పినట్టు… సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు కేవలం రాజా గౌతమ్ పాత్ర మాత్రమే గుర్తుండి పోతుంది. ఓ వైవిధ్యమైన హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో తెరకెక్కిన బ్రహ్మ ఆనందం… అందిరినీ ఆకట్టుకుంటుంది.
బ్రహ్మానందం గురించి చెప్పాల్సిన పనే లేదు. వెయ్యికి పైగా సినిమాల్లో మనల్ని నవ్వించి అప్పుడప్పుడు ఏడిపించిన బ్రహ్మానందం.. ఈ సినిమాలో కూడా ఓ పక్క నవ్విస్తూనే కాస్త ఏడిపించారు. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో హీరోగా పలు సినిమాలు చేసినా అంత గుర్తింపు రాని రాజా గౌతమ్ ఈ సినిమాలో నటుడిగా తన కసి అంతా తీర్చుకున్నట్టు, నటనలో ఎంతో పరిణీతి చెందినట్టు అనిపిస్తుంది. రాజా గౌతమ్ తండ్రికి ధీటుగా ప్రతి సన్నివేశంలోనూ బాగా నటించాడు అని చెప్పొచ్చు.
ఇక వెన్నెల కిషోర్ కూడా ఫుల్ గా నవ్వించారు. సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ బ్రహ్మానందం మనవరాలి పాత్రలో మెప్పించింది. భవిష్యత్తులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. రాజీవ్ కనకాల, సంపత్, ఐశ్వర్య హోలక్కల్, ప్రియా వడ్లమాని, బామ్మ పాత్రలో నటించిన పెద్దావిడ.. అందరూ వారి పాత్రల్లో బాగా మెప్పించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. ఒక మంచి పాయింట్ చుట్టూ కామెడీ అల్లుకొని కథనం చాలా గ్రిప్పింగ్ గా రాసుకుని నడిపించారు. క్లైమాక్స్ మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. దర్శకుడు టైటిల్ కి తగ్గ న్యాయం చేసాడనే చెప్పొచ్చు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3