తెలుగు వెండితెరపై మరో భక్తిరస చిత్రం కనువిందు చేయబోతోంది. అనంత ఆర్ట్స్ బ్యానర్‌పై కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్థిని బేబీ రిషిత ప్రధాన పాత్రల్లో, నర్సింగ్ రావు దర్శకత్వంలో బొజ్జ రాజ గోపాల్, దోరవేటి సుగుణ నిర్మించిన చిత్రం “శివ శంభో”. తనికెళ్ళ భరణి, సుమన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈనెల (ఏప్రిల్) 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది.
ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. గోరటి వెంకన్న, బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్రవీణ్, ప్రముఖ నటుడు, రచయిత డా. తనికెళ్ల భరణి, బర్దీపుర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర గిరి స్వామీజీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. చిత్రయూనిట్ సభ్యులందరికి పేరుపేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఇలాంటి భక్తిరస చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. భారతీయ కళలైన సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. “నర్సింగ్ రావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. తెలుగు చిత్రసీమలో ఇది చెప్పుకోదగ్గ సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను”. అని అన్నారు.
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. “సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ అరుదైన సినిమాను మనమంతా గౌరవించాలి. ఇటువంటి చిత్రాలను ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. చిత్రయూనిట్ సభ్యులందరికి పేరుపేరున శుభాకాంక్షలు, అభినందనలు”. అని అన్నారు..
చిత్ర నిర్మాతల్లో ఒకరు, రచయిత, సంగీత దర్శకులు దోరవేటి మాట్లాడుతూ.. “ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వెళ్లి చూసి సినిమాను ఆదరించాలని కోరుతున్నాము. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.” అని అన్నారు.
దర్శకుడు నర్సింగ్ ఎంతో శ్రమకోర్చి ఈ సినిమా ను నిర్మించామని, తప్పకుండా మంచి స్పందన వస్తుందని తెల్పుతూ, చిత్ర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమం చివర స్వామీజీ ఆశీఃప్రసంగం చేసి, అందరికీ జ్ఞాపికలు బహూకరించారు.
బ్యానర్ :అనంత ఆర్ట్స్
నిర్మాతలు: బొజ్జ రాజ గోపాల్, సుగుణ దోరవేటి.
డైరెక్టర్: నర్సింగ్ రావు
డిఓపి: కారె సతీశ్ కుమార్
హీరో హీరోయిన్: కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి,కేశవర్థిని బేబీ రిషిత.
పాటలు మాటలు, సంగీతం: దోరవేటి
ముఖ్యపాత్రలో: తనికెళ్ళ భరణి, సుమన్, టార్జాన్, విజయ్ రంగరాజన్, చిల్లర వేణు, రామస్వామి, రజాక్, మల్లేశ్, రవిరెడ్డి, రమేష్ యాదవ్, శ్రీకర్, విగ్నేష్ తదితరులు నటించారు.