‘పేపర్ బాయ్’ తరువాత దర్శకుడు జయశంకర్ ‘అరి’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అరి షడ్వర్గాల కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లోకి వచ్చింది. అనసూయ, వినోద్ వర్మ, సాయి కుమార్ వంటి వారు నటించిన ఈ మూవీని ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. మరి ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం..
కథ
అరి షడ్వర్గాల నేపథ్యంలో ఈ కథను తయారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరు పాత్రల్ని దర్శకుడు తీసుకున్నాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు ప్రతీకగా ఆరు కారెక్టర్స్‌ను ఎంచుకున్నాడు. అమూల్ (వైవా హర్ష) సన్నీ లియోన్ మీద కామంతో రగిలిపోతోంటాడు. ఆమెతో ఒక్కరాత్రి గడపాలని కోరికతో ఉంటాడు. ఇలా రకరకాల కోరికలున్న వ్యక్తులు ‘ఇచ్చట అన్ని కోరికలు తీర్చబడును’ అనే ప్రకటన చూస్తారు. దీంతో తన కోలిగ్ కంటే అందంగా ఉండాలనే కోరికతో ఆత్రేయి (అనసూయ), తరతరాలు డబ్బుతో తనలానే సుఖంగా ఉండాలని విప్రనారాయణ్ (సాయి కుమార్) నిధి కోసం ఇన్ స్పెక్టర్ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్), తన కుటుంబీకుల ఆస్తిని కాజేయాలని గుంజన్ (శుభలేఖ సుధాకర్), చనిపోయిన భర్తను మళ్లీ భూమ్మీదకు తీసుకు రావాలని లక్ష్మీ (ప్రభావతి) ఇలా రకరకాల కోరికలతో ఉంటారు. వీరంతా కూడా కోరికలు తీర్చబడను అనే ప్రకటన చూసి ఓ లైబ్రరీకి వస్తారు. అసలు ఆ ప్రకటన ఇచ్చిన వ్యక్తి (వినోద్ వర్మ) ఎవరు? ఆ ఆరుగురికి ఈ వ్యక్తి ఇచ్చే టాస్కులు ఏంటి? చివరకు ఆ ఆరుగురిలో ఎలా మార్పు వచ్చింది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
అరి చిత్రంలో భారీ తారాగణమే ఉంది. డబ్బు మదంతో చెలరేగిపోయే పాత్రలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ అదరగొట్టేశారు. అనసూయ కనిపించేది కొద్ది సేపే అయినా తన అందం, నటనతో ఆకట్టుకుంటుంది. సీనియర్ ఆర్టిస్ట్ శుభలేఖ సుధాకర్‌కి కాస్త డిఫరెంట్ పాత్ర దక్కింది. వైవా హర్ష పాత్ర చాలా రిలీఫ్‌గా ఉంటుంది. అక్కడక్కడా కాస్త నవ్వులు కూడా పూయిస్తాడు. శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పుడూ కనిపించేలా, నటించేలానే ఇందులోనూ నటించాడు. వినోద్ వర్మ మాత్రం కళ్లతోనే చాలా చోట్ల నటించేశాడు. ఆయన పాత్ర ఈ మూవీకి హైలెట్ అవుతుంది. చతుర, వితుర పాత్రలు అక్కడక్కడా నవ్విస్తాయి. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపిస్తాయి.
అరి షడ్వర్గాలు అనేవి మనుషుల్లో సహజంగానే ఉంటాయి. ఇక ఇప్పుడు అయితే కామం, క్రోధం, లోభం, మోహం ఇలా అన్నీ కూడా మనుషుల్లో ఎక్కువగా పేరుకుపోయాయి. మరి వీటిని జయించాలి? అంటే ఏం చేయాలి.. అసలు కోరికలు లేకుండా, నిస్వార్థంగా మనిషి జీవించాలి అంటే ఏం చేయాలి? ఒకరికి హాని చేయకుండా, తలపెట్టకుండా ఎలా బతకాలి? ఇలాంటి అంశాల్ని చెబితే.. క్లాస్ పీకుతున్నారని అనుకుంటారు. కానీ ఈ చిత్రంలో అలాంటి అంశాలన్నీ కూడా ఎంతో సుత్తిమెత్తంగా టచ్ చేశారు.
ఓ మనిషి ఎలా బతకాలి? పరుల గురించి ఎలా ఆలోచించాలి? అనే విషయాన్ని చక్కగా చూపించారు. ప్రథమార్దం అంతా కూడా పాత్రల పరిచయం, వారి వారి కోరికల చిట్టాలతో సాగుతుంది. చతుర, వితురలతో ప్రారంభమయ్యే సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. ఆ తరువాత ఆరు పాత్రల ఎంట్రీ.. ఇచ్చట కోరికలు తీర్చబడును అనే ప్రకటన.. వారికి టాస్కులు ఇవ్వడం వంటి వాటితో ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్‌కు కథలో అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది.
సెకండాఫ్‌లో ఆ ఆరు పాత్రల్లో మార్పులు, మార్పు చెందే ఆ పరిణామక్రమం బాగుంది. అరె అసలు మనుషులంటే ఇలా కదా ఆలోచించాలి? ఇలా కదా జీవించాలి? అనేలా ఆడియెన్స్‌లో ఆలోచనల్ని పుట్టించేస్తాడు దర్శకుడు. అలా తాను చెప్పాలనుకున్న మెసెజ్, సమాజానికి ఇవ్వదల్చుకునే సందేశాన్ని క్లైమాక్స్‌లో గొప్పగా చెప్పేస్తాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చూస్తే ప్రేక్షకుడికి గూస్ బంప్స్ పక్కా వస్తాయి. చివరకు ఓ మంచి సినిమాను చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చేస్తాడు. ఇక ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. మనిషులందరిలోనూ ఈ అరిషడ్వర్గాలుంటాయి. అందరికీ ఉపయోగపడే చిత్రమిది. ఇలాంటి సినిమాను అన్ని భాషల్లోనూ రీమేక్ చేసుకోవచ్చు
సాంకేతికంగా చూసుకుంటే ఈ మూవీకి సంగీతం, కెమెరా, వీఎఫ్ఎక్స్ ప్రధాన బలం. అనూప్ సంగీతం, ఆర్ఆర్ అదిరిపోతుంది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా అనిపిస్తుంది. లిమిటెడ్ బడ్జెట్‌లో వీఎఫ్ఎక్స్ క్వాలిటీ చూస్తే వావ్ అనాల్సిందే. అసలు ఇలాంటి ఓ కథను అంగీకరించడం, ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించాలనే ఎంతో ధైర్యం ఉండాలి. నిర్మాతలు పెట్టిన లిమిటెడ్ బడ్జెట్‌లోనే జయశంకర్ మంచి క్వాలిటీతో ఓ గొప్ప సినిమాను ఆడియెన్స్‌కి అందించారని చెప్పుకోవచ్చు.
రేటింగ్ : 3









