‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు: దర్శకుడు హరీష్ శంకర్
‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘దేఖ్‌లేంగే సాలా’ విడుదలైంది. ఈ గీతావిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత నవీన్ యెర్నేని, గీత రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుంచి విడుదలైన తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ అభిమానులు, సినీ ప్రేమికుల్లో ఒక్కసారిగా భారీ ఉత్సాహాన్ని రేపింది. ఉత్సాహభరితమైన సంగీతం, అద్భుతమైన నృత్య రీతులతో రూపొందిన ఈ పాటలో పవన్ కళ్యాణ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన అవతారంలో కనిపిస్తున్నారు. వింటేజ్ స్టైల్, రా ఇంటెన్సిటీతో ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆయన తన ఐకానిక్ బ్లాక్‌బస్టర్ పాటల జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తున్నారు.
ఈ పాటతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అనే బ్లాక్‌బస్టర్ త్రయం ఘనంగా మళ్లీ కలిసింది. గతంలో చార్ట్‌బస్టర్ పాటలు, గుర్తుండిపోయే మాస్ ఎంటర్టైనర్లను అందించిన ఈ త్రయం, ‘దేఖ్‌లేంగే సాలా’తో తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. పదునైన దృష్టి, విశిష్టమైన సంగీత అవగాహనకు పేరుగాంచిన దర్శకుడు హరీష్ శంకర్.. మాస్, ఆధునిక అంశాలను మేళవిస్తూ రూపొందించిన ఈ పాటలో తన నైపుణ్యాన్ని మరోసారి నిరూపించారు. ప్రతి బీట్, ప్రతి స్టెప్, ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పాటకు సమగ్ర ఆకర్షణను తీసుకొచ్చారు.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తన ఉత్సాహభరితమైన సంగీతంతో మరోసారి మాయ చేశారు. ప్రారంభం నుంచే శ్రోతలను ఆకట్టుకునేలా ఆయన ఈ పాటను స్వరపరిచిన తీరు కట్టిపడేసింది. భాస్కరభట్ల రాసిన సాహిత్యం అందరూ పాడుకునేలా ఉండటమే కాకుండా, ప్రేరణ కలిగించేలా ఉంది. అలాగే, సినిమా ఎలా ఉండబోతుందో తెలిపేలా సాహిత్యం అద్భుతంగా కుదిరింది. ఇక విశాల్ దద్లానీ గాత్రం పాటకు మరింత పవర్‌ను జోడించి, దీనిని ఖచ్చితంగా అందరూ ఇష్టపడే గీతంగా మార్చింది.
‘దేఖ్‌లేంగే సాలా’ గీతావిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “దేవి శ్రీ ప్రసాద్ అంటే నాకు ఇష్టం. ఆనందం సినిమా చూసి.. ఈ సంగీత దర్శకుడితో జీవితంలో ఒక్కసారైనా పని చేయాలని కోరుకున్నాను. దేవుడు ఒక్కసారి కాదు.. మూడుసార్లు అవకాశం ఇచ్చాడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలకు కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. దేవి శ్రీ ప్రసాద్ అంటే నాకు ఒక ఎమోషన్. దర్శకుడిని బట్టే సంగీతం వస్తుంది అంటూ.. తన కష్టాన్ని కూడా మా ఖాతాలో వేస్తుంటాడు. ఒక పాట యొక్క సంపూర్ణ తత్వాన్ని మీకు అందించడంలో అంకితభావంతో పని చేసే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. పుష్ప తర్వాత దేశంలోనే అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగినా కూడా ఇప్పటికీ మొదటి సినిమాకి పని చేసినట్టుగా పని చేస్తున్నాడు. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే నిర్మాతలు నవీన్ గారు, రవిశంకర్ గారు. వారి వల్లే ఈ సినిమాకి ఇంత భారీతనం. విజయాలు వచ్చినా, పరాజయాలు ఎదురైనా ఎప్పుడూ ఒకేలా ఉంటారు. అందుకే మైత్రి సంస్థ దేశంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఉంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆలస్యమైందని కొందరు రాశారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల అసలు ఆలస్యం అవ్వలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రయాణం గురించి వివరంగా చెబుతాను. మొదట ఒక ప్రేమ కథ చేయాలనుకున్నాం. కానీ, అభిమానులు గబ్బర్ సింగ్ లాంటి సినిమా కావాలని కోరుతుండటంతో సందిగ్ధంలో పడిపోయాం. అదే సమయంలో పాండమిక్ వచ్చింది. ఆ సమయంలో నేను కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను. ఏ కథ చేయాలనే సందిగ్ధంలో నా వల్లే కొంచెం సమయం వృధా అయింది. ఒక రీమేక్ చేద్దామనుకొని అది కూడా పక్కన పెట్టాము. కొంచెం ఆలస్యమైనా పర్లేదు, అభిమానులందరూ మళ్ళీ మళ్ళీ చూసే సినిమా చేయాలని మా టీం అంతా కలిసి పని చేశాము. నిజానికి పవన్ కళ్యాణ్ గారి వల్లే చిత్రీకరణ త్వరగా పూర్తయింది. ఆయన మమ్మల్ని ఊపిరి ఆడనివ్వకుండా షూటింగ్ చేశారు. ఉదయాన్నే కేబినెట్ మీటింగ్ కి విజయవాడ వెళ్ళిపోయేవారు. రెండు రోజులు షూటింగ్ ఉండదేమో అనుకునేవాళ్ళం. కానీ, ఆయన రాత్రి పూట షూటింగ్ కి సమయం కేటాయించేవారు. ఉదయమంతా ప్రజాసేవలో ఉండి, రాత్రి ఫ్లయిట్ లో హైదరాబాద్ వచ్చి తెల్లవారుజాము వరకు షూటింగ్ చేసి, మళ్ళీ మంగళగిరి వెళ్ళిన రోజులున్నాయి. 18 గంటలు, 20 గంటలు పని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒక్కటే చెబుతుంటారు.. ప్రయత్నంలో లోపం ఉండకూడదని. ప్రయత్నంలో లోపం లేదు కాబట్టే.. అపజయాన్ని చూసి కూడా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు.” అన్నారు.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “ఇంతటి ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ పాట ఆవిష్కరణ వేడుక జరగడం చాలా చాలా సంతోషంగా ఉంది. మా నాన్న గారు దూరమై డిసెంబర్ 14కి పదేళ్ళు. ఆయన ఆశీస్సులతో ఒకరోజు ముందుగా ఈ పాటను విడుదల చేసుకోవడం ఆనందంగా ఉంది. హరీష్ శంకర్ గారు నాకు స్నేహితుడు, సోదరుడు లాంటి వారు. గబ్బర్ సింగ్, డీజే తరువాత మా కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది. సంగీతం, సాహిత్యం విషయంలో ఆయనకు గొప్ప అభిరుచి ఉంది. హరీష్ శంకర్ గారు సృష్టించిన సంచలనం గబ్బర్ సింగ్ ని అంత తేలికగా ఎవరూ మరిచిపోలేరు. జీవితంలో సమస్యలు రావడం సహజం. అప్పుడు మనం పాటించాల్సిన సూత్రం ఏంటో తెలుసా.. దేఖ్‌లేంగే సాలా. అదే ఈ పాట. ఒక కమర్షియల్ సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి లాంటి అగ్ర కథానాయకుడుపై ఇలాంటి సందేశమిచ్చే పాటను రూపొందించే సందర్భాన్ని సృష్టించిన హరీష్ గారికి కృతఙ్ఞతలు. సిచువేషన్ బాగుంటేనే పాట బాగా వస్తుంది. హరీష్ గారు ఇంత అద్భుతమైన సందర్భాన్ని ఇచ్చారు కాబట్టే.. పాట అద్భుతంగా వచ్చింది. భాస్కరభట్ల గారు అంతే అద్భుతంగా సాహిత్యం అందించారు. మైత్రి సంస్థ నాకు కుటుంబం లాంటిది. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలని అభిమానులు చూడాలనుకుంటున్నారో అంతకుమించేలా హరీష్ శంకర్ గారు ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో చూపించబోతున్నారు. ఈ సినిమా అభిమానులకు విందులా ఉంటుంది” అన్నారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “దేఖ్‌లేంగే సాలా పాట మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే.. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ ఈ స్థాయిలోనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడానికి పది సంవత్సరాలు పట్టింది. పవన్ గారు, హరీష్ గారి కలయికలో మా బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. అలాగే దేవిశ్రీ గారు మా బ్యానర్ లో చేసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టరే. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.” అన్నారు.
గీత రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ.. “నేను చదువుకున్న రాజమండ్రిలో ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. హరీష్ శంకర్ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. గబ్బర్ సింగ్ లో దిల్ సే దిల్ సే అనే పాట రాశాను. మళ్ళీ పవర్ స్టార్ గారు, హరీష్ గారు, దేవి గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి రాయడం ఆనందంగా ఉంది. ఈ పాట రాసేటప్పుడు హరీష్ ఒక్కటే మాట అన్నారు.. దిగాలిగా ఉన్నోడు లెగాలి అని. ‘దేఖ్‌లేంగే సాలా చూసినాంలే చాలా’ అనే మకుటం కూడా ఆయనే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ప్రసిద్ధ డైలాగ్ ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ని స్ఫూర్తిగా తీసుకొని సాహిత్యం రాశాను. ఈ పాట ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదుచూశాను. ఈ ఏడాది చిరంజీవి గారికి ‘మీసాల పిల్ల’, పవన్ గారికి ‘దేఖ్‌లేంగే సాలా’ రచించడం గర్వంగా ఉంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సాధించబోయే విజయం కోసం మీ అందరిలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను.” అన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా, ‘దేఖ్‌లేంగే సాలా’ పాటతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ‘దేఖ్‌లేంగే సాలా’ పాటతో వచ్చిన ఊపు చూస్తే, ఈ చిత్రం రాబోయే రోజుల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్లలో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.
పాట వివరాలు:
గానం: విశాల్ దద్లానీ, హరిప్రియ
సాహిత్యం: భాస్కరభట్ల
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కొరియోగ్రఫీ: దినేష్ మాస్టర్
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా తదితరులు
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సి. చంద్రమోహన్
ఛాయాగ్రహణం: అయనంక బోస్
కూర్పు: కార్తీక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రావిపాటి చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నబకాంత, పృథ్వీ
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్










