వింటేజ్ ప్రభాస్ ను వెండితెరపై చూసి చాలా కాలం అయింది. దానిని ఇప్పుడు సెల్యులాయిడ్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కు ‘రాజాసాబ్’ రూపంలో ట్రీట్ ఇచ్చారు దర్శకుడు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్పెనా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ హారర్ కామెడీతో ఫ్యాన్స్ ను డార్లింగ్ ప్రభాస్ ఏమాత్రం థ్రిల్ చేశారో చూద్దాం పదండి.
కథ: రాజా అలియాస్ రాజాసాబ్(ప్రభాస్) నాన్నమ్మ గంగమ్మ(జరీనా వహాబ్) వయసు రీత్యా అల్జీమర్ తో బాధపడుతూ వుంటుంది. ఆమె గతం అంతా మరచిపోయినా తన భర్త కనకరాజు(సంజయ్ దత్)ను మాత్రం మరిచిపోకుండా వెతుకుతూ వుంటుంది. తన భర్తను వెతికి పెట్టమని రాజాసాబ్ ను బతిమాలుతూ వుంటుంది. ఈక్రమంలో ఓ రోజు కనకరాజు ఆచూకీ తెలిసి… రాజాసాబ్ పోలీసుల సహాయంతో పట్టుకోవాలని వెళతాడు. అయితే కనకరాజు తనకున్న తాంత్రిక విద్యలతో రాజాసాబ్ ను, తన భార్య గంగమ్మను, భైరవి(మాళవిక మోహన్)ని, వీటీవీ గణేష్ ను నర్సాపూర్ అడవిలోని రాజమహల్ కి వచ్చేలా చేస్తాడు. అక్కడ తన భార్య గంగమ్మను, మనుమడు రాజాసాబ్ అండ్ అతనితో వచ్చిన వాళ్లను ముప్పుతిప్పలు పెట్టి చంపాలని వివిధ రకాలుగా ప్లాన్స్ చేస్తుంటాడు. మరి కనకరాజు తాంత్రిక విద్యలు ఫలించాయా? కనకరాజు వారిని ఎందుకు చంపాలనుకుంటాడు? కనకరాజు అసలు కథ ఏంటి? గంగమ్మ అసలు జీవితం ఏమిటి? అనేతి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఫాంటసీ హారర్ కామెడీ సినిమాను ప్రభాస్ చేస్తున్నాడు అంటేనే… ఓ పాన్ ఇండియా స్టార్ హారర్ కామెడీలో నటించడం ఏమిటని అందరూ అనుకున్నారు. అయితే చాలా కాలంగా భారీ యాక్షన్ చిత్రాలతో మునిగిపోయిన ప్రభాస్ ను… వింటేజ్ లుక్ లో ఫ్యాన్స్ ను అలరించడానికి చేసిన ప్రయత్నమే ఈ రాజాసాబ్ అని దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చి.. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు. ఇందులో ప్రభాష్ లుక్ చాలా ఫ్రెష్ గా వండటంతో పాటు… తన పూర్వపు కామెడీ టైమింగ్ ను కూడా జోడించి అలరించే ప్రయత్నం చేశారు. అందుకు ఇంట్రడక్షన్ సీనే ఉదాహరణ. పాటల చిత్రీకరణ కూడా చాలా కొత్తగా వుంది. అలాగే తన మిత్రలతో కానీ… తను ఇష్టపడే అమ్మాయిలతో కానీ తను వేసే సెటైరికల్ పంచ్ సంభాషణలు చాలా కొత్తగా వున్నాయి. రాజమహల్ లో ఓవైపు భయపడుతూనే… తను రాబోయే విధ్వంసాలను ఏలా ధ్వంసం చేశాడనేది తెరపై చూస్తేగానీ ప్రేక్షకులు థ్రిల్ అవ్వరు. ఈ చిత్రంలో ప్రభాస్ అన్ని వేరియషన్స్ లోనూ కనిపించి అభిమానులను ఈ సంక్రాంతికి అలరిస్తాడనడంలో సందేహం లేదు. చివర్లో పార్ట్స2గా రాజాసాబ్ సర్కస్ కూడా ఉంటుందని చివర్లో హింట్ ఇచ్చారు మూవీ మేకర్స్.
ప్రభాస్ అన్నీతానై తన వింటేజ్ లుక్… పర్ ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో ఆద్యంతం ఆడియన్స్ ను అలరించాడు. అతనికి సపోర్టివ్ గా నటించిన ముగ్గురు హీరోయిన్లతోనూ తన కెమిస్ట్రీని బాగానే పండించారు. కనకరాజు పాత్రకు సంజయ్ దత్ బాగా యాప్ట్ అయ్యారు. తన హావభావాలతో హారర్ ను పండించారు. అతనితో పాటు సముద్రఖని పాత్ర కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కమెడియన్ సత్య, వీటీవీ గణేష్, సంప్తగిరిల కామెడీ కూడా కాసేపు నవ్విస్తుంది. ఎప్పటిలాగే సప్తగిరి తన కామెడీ టైమింగ్ తో బాగా ఆకట్టుకుంటాడు. బోమన్ ఇరానీ పాత్ర కూడా కథకు తగ్గట్టుగానే వుంది. ఇక గంగమ్మ పాత్ర చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది కాబట్టి… బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వాహబ్ పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ముగ్గురు ముద్దుగుమ్మలూ అందచందాలతో అలరించారు. జెస్సీ పాత్రలో నిధి అగర్వాల్, భైరవి పాత్రలో మాళవిక మోహన్, అనిత పాత్రలో రిద్దికుమార్ తమ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
దర్శకుడు మారుతి అంచలంచెలుగా ఎదుగుతూ తొలిసారి ఓ పాన్ ఇండియా స్టార్ ను తెరపై చూపించే అవకాశం కొట్టేశాడంటేనే… చిత్ర పరిశ్రమలో అతని ఎదుగుదలకు నిదర్శనం. పాన్ ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేయగలిగే కథను సిద్దం చేసుకోవడం కూడా చాలా సాహసమే. ఇంతకు ముందు ప్రేమకథాచిత్రంతో హారర్ ను ప్రేక్షకులకు చూపించిన అనుభవంతో ఈ తరహా కథకు ఫాంటసీని జోడించి రాజా సాబ్ ను తీసి… తను ఎంచుకున్న కథ… కథనాలతో ఓ రకంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించి విజయం సాధించారనే చెప్పొచ్చు. కొన్ని కొన్ని సాంకేతిక లోపాలతో సినిమా తెరకెక్కినా… ఓవరాల్ గా ఓ వింటేజ్ ప్రభాస్ ను ప్రేక్షకులకు చూపించి… వందశాతం విజయం సాధించారు. వీఎఫ్ఎక్స్ పై ఇంకాస్త శ్రధ్ధ తీసుకుని వుంటే బాగుండేది. అలాగే నిడివి కూడా చాలా ఎక్కువైందనే ఫీలింగ్ కలుగుతుంది. థమన్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా గ్రాండియర్ గా నిర్మించారు. డార్లింగ్ సినిమాను సరదాగా ఓ సారి చూసేయండి.
రేటింగ్: 3










