స్టార్ హీరో విజయ్, టాప్ హీరోయిన్ సమంత జంటగా, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి థాను నిర్మించిన తమిళ చిత్రం ‘తెరి’ ఘన విజయం సాధించింది. తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో అనువాదమై ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సూపర్ హిట్ చిత్రంలా నిలిచింది. ఈ చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ ‘పోలీసోడు’చిత్రం ఈ నెల 23న రీ-రిలీజ్ కానుంది.
ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో ప్రముఖ పంపిణీ సంస్థ ఏషియన్ ఫిలిమ్స్ వారు, ఆంధ్రా లో సురేష్ మూవీస్ వారు భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రీ-రిలీజ్ వార్తతో సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుండగా, విజయ్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు మరోసారి ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తండ్రి–కూతురు అనుబంధం, పోలీస్ బ్యాక్‌డ్రాప్, భావోద్వేగాలు, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవించి అట్లీ ఈ ‘పోలీసోడు’ చిత్రాన్ని రూపొందించారు. విజయ్ ద్విపాత్రాభినయంలో మెప్పించగా, సమంత పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే మరో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటించారు. ప్రభు, రాధిక శరత్ కుమార్ పాత్రలు కూడా ఈ చిత్రానికి కీలకం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.
ఈ చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ కుమార్ పాటలు అప్పట్లో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ‘పోలీసోడు’ విజయ్‌కు తెలుగులో కూడా బలమైన అభిమాన వర్గాన్ని మరింత పెంచింది.
ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో మెరుగైన క్వాలిటీతో రీ-రిలీజ్ అవుతున్న ఈ చిత్రం మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్, సమంతల అభిమానులకు ఇది నిజంగా ఒక తీపి వార్త.










