రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అందులోనూ ఫ్యాక్షన్ కు పేరుగాంచిన కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామం పేరు అంటే ఆడియన్స్ లో మరింత అటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యాక్షన్ చరిత్రలో అగ్రస్థానం ఆగ్రామానిదే అని సీమ ప్రజలకు బాగా తెలుసు. ఆగ్రామం పేరుతోనే కడప జిల్లాకు చెందిన బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తూ… కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం వహించిన సినిమా ఈరోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: కడప జిల్లాలోని దేవగుడి గ్రామానికి చెందిన చెందిన వీరారెడ్డి (రఘు కుంచె), జమ్మలమడుగుకి చెందిన నారపరెడ్డికి ఫ్యాక్షన్ వుంటుంది. వీరిద్దరి మధ్య సాగే ఫ్యాక్షన్ గొడవల్లో అనుచరులు చనిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ధర్మ (అభినవ్ శౌర్య)తండ్రి కూడా చనిపోతాడు. దాంతో వీరారెడ్డి కి ధర్మ కుడి భుజంగా కాపు కాస్తూ… ప్రత్యర్థులను మట్టుబెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో వీరారెడ్డి కూతురు శ్వేత రెడ్డి (అనుశ్రీ) ధర్మను ఇష్టపడుతుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. మరి కులము, పరువు అంటూ పాకులాడే వీరారెడ్డి అందుకు అంగీకరించాడా? వీరి ప్రేమ ఎలాంటి టర్న్ తీసుకుంది? చివరకు ఎలా ఎండ్ కార్డు పడింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!!
విశ్లేషణ: రాయలసీమ నేపథ్యం… ఆ ప్రాంతం విజువల్స్ అన్నీ తెర మీద కొత్తగా కనిపిస్తాయి. దీనికి బలమైన ప్లాట్ సెట్ చేసుకుని… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను తీస్తే… కచ్చితంగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు… నిర్మాత కం దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి కూడా అదే చేశారు. రాయలసీమ అంటే కేవలం కొట్లాటలే కాకుండా… ఆ ప్రాంతంలో జరిగే జాతరలు, వేడుకలను ఎంతో ఎమోషనల్ గా తెర మీద చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా రెండు కుటుంబాల మధ్య సాగే ఫ్యాక్షన్ గొడవలు చూపించారు. సెకండ్ హాఫ్ నుంచి అసలు కథ ను చాలా రియల్ స్టిక్ గా ఆవిష్కరించి దేవగుడి టైటిల్ కు జస్టిఫికేషన్ ఇచ్చారు.
మనిషి చంద్రమండలం వరకు వెళ్లి పరిశోధనలు చేస్తున్నాడు కానీ… ఇంకా రాతియుగపు నాటి కుల వ్యవస్థను మాత్రం వదలలేకపోతున్నాడనే విషయాన్ని ఇందులో చూపించారు. సినిమాను ఎక్కడా బోర్ లేకుండా తెరకెక్కించడంలో డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారు. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సాగుతుంది. ఉన్న బడ్జెట్లో సినిమాని చాలా రిచ్ విజువల్స్తో, మంచి పాటలు, ఫైట్స్ కంపోజ్ చేసి ఒక మంచి కమర్షియల్ సినిమా ఫీల్ తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.
హీరోగా నటించిన అభినవ్ శౌర్య మాస్ లుక్ లో బాగా ఒదిగిపోయి నటించాడు. అతనికి జోడిగా నటించిన అనుశ్రీ కూడా సెకండ్ హాఫ్ లో బాగా నటించింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఆమె విశ్వరూపం చూపించింది, అలాగే ఆమె సోదరుడి పాత్రలో నటించిన నరసింహ కూడా ఆకట్టుకున్నారు. వీరందరూ కొత్త ముఖాలైనప్పటికీ చాలా బాగా నటించారు. ఇక రఘు కుంచె దేవగుడి వీరారెడ్డి పాత్రలో జీవించారు. ఆహార్యం… యాస… భాష లో కూడా వైవిధ్యం చూపించాడు. అలానే ఈ సినిమాలో నటించిన మీసాల లక్ష్మణ్, రఘుబాబు, రాకెట్ రాఘవ తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ నేపథ్యాన్ని బాగా చూపించారు. మదిన్ అందించిన సంగీతం బాగుంది. పాటలు వినడానికి బాగున్నాయి, అలాగే తెరమీద కూడా అంతే చక్కగా తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3










