హార్రర్ కామెడీ అనేది తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. అయితే, అదే పాత ఫార్ములాకు కాస్త జానపద ఛాయలు అద్ది, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తీసిన చిత్రమే ఈ ‘రాకాస’. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ:
రాకవరం అనే గ్రామం, అక్కడ వెయ్యేళ్ల క్రితం పుట్టిన ఒక బ్రహ్మ రాక్షసుడు… ఊరి క్షేమం కోసం జరిగే నరబలి… ఈ పాయింట్ వినడానికి పాత విఠలాచార్య సినిమాలను గుర్తుకు తెస్తుంది. 2026 నేపథ్యంలో సాగే ఈ కథలోకి అమెరికా నుంచి వచ్చిన హీరో ఈరబాబు (సంగీత్ శోభన్) ఎలా ప్రవేశించాడు? ఆ రాక్షసుడి బారి నుండి గ్రామాన్ని ఎలా కాపాడాడు? అనేదే సినిమా.
విశ్లేషణ:
సంగీత్ శోభన్… ‘మ్యాడ్’ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్… ఇందులో సోలో హీరోగా మెప్పించలేక పోయాడు.
వెన్నెల కిషోర్: సినిమా సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ ఎంట్రీతో వినోదం వుంటుంది అనుకునే వాళ్ళకి నిరాశే మిగులుతుంది. గెటప్ శీను ప్రమోషన్స్ లో ఆకట్టుకున్నంతగా… సినిమాలో క్యారెక్టర్ పరంగా ఆకట్టుకోలేక పోయాడు.
దర్శకత్వ ప్రతిభ: కొత్త దర్శకురాలు మానస శర్మ, పాత కథను ఎంచుకుని…. అందుకు సరైన స్క్రీన్ ప్లే కూడా రాసుకోలేక పోయింది. బోరింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు.
నిర్మాణ విలువలు: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ఏమాత్రం క్వాలిటీ లేదు. గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయి. చివర్లో వచ్చే సాంగ్ మాత్రమే ఆకట్టుకుంటుంది.
ఊహించదగ్గ కథనం: కథలో పెద్దగా ట్విస్టులు లేవు. క్లైమాక్స్‌లో రాక్షసుడిని చంపే విధానం చాలా పాత పద్ధతిలో (విఠలాచార్య సినిమాల తరహాలో) ఉండటం ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్‌కు అంతగా ఎక్కకపోవచ్చు.
పాత్రల చిత్రణ: తనికెళ్ల భరణి వంటి దిగ్గజ నటుడి పాత్రను కేవలం బస్సులో తాయెత్తులు అమ్ముకునే వ్యక్తిగా చూపించడం ఆ పాత్ర గాంభీర్యాన్ని తగ్గించినట్టు అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ నయన్ సారికకు పెద్దగా ప్రాధాన్యత లేదు.
ఎమోషనల్ కనెక్ట్: క్లైమాక్స్‌లో రాక్షసుడి ఫ్లాష్‌బ్యాక్ ద్వారా ఎమోషన్ పండించాలని చూసినా, అది కాస్త సాగదీసినట్లుగా (సోదిలా) అనిపిస్తుంది. రాక్షసుడి క్యారెక్టరైజేషన్‌లో స్పష్టత ఇంకాస్త ఉంటే బాగుండేది.
సంగీత్ శోభన్ ‘ఈరబాబు’ పాత్రలో పర్వాలేదు అనిపించాడు. గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, హీరోయిన్ పాత్ర ల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. వెన్నెల కిషోర్ తన మార్కు కామెడీతో మెప్పించలేక పోయాడు. దర్శకురాలు ఈ ప్లాట్ ను ఎందుకు ఎంచుకొని తీసారో… నిర్మాతలని ఎలా మెప్పించారనేది అంతా మిథ్య గానే అనిపిస్తుంది. నేపథ్య సంగీతం ఎక్కడా ఆకట్టుకోదు. హార్రర్ మూడ్‌ను ఎలివేట్ చేసే ఒక్కటంటే ఒక్క సీను ఇందులో కనిపించదు.
‘రాకాస’ ఒక రొటీన్ హార్రర్ కామెడీ మూవీ
రేటింగ్: 2.25










