‘బేబీ’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయి రాజేష్ కథ అందిస్తూ, ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించిన చిత్రం “చెన్నై లవ్ స్టోరీ”. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఈ రోజు థియేటర్లలో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
సాధారణంగా ప్రేమలో ఫెయిల్ అయితే అబ్బాయిలు దేవదాసులా మారి మందు కొట్టడం చూస్తుంటాం. కానీ ఇందులో కథానాయిక నివి (శ్రీ గౌరీ ప్రియ) బ్రేకప్ బాధలో కూరుకుపోయి మందు బాటిల్ పట్టుకుంటుంది. అలా ఒక చేదు గతం నుంచి బయటపడలేక వేదన అనుభవిస్తున్న నివి జీవితంలోకి స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) అనే అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవేశిస్తాడు. నివి ఇంట్లో చేరిన స్టీవెన్.. ఆమెను ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి ఎలాంటి పనులు చేశాడు? ఈ ప్రయాణంలో అజయ్ (త్రిగుణ్) పాత్ర ఏమిటి? చివరికి వీరి ప్రేమకథ ఏ తీరానికి చేరింది అనేది అసలు కథ.
విశ్లేషణ:
దర్శకుడు రవి నంబూరి ఫస్ట్ హాఫ్‌ను చాలా ఫీల్ గుడ్ గా, గ్రిప్పింగ్ గా నడిపించాడు. హీరో హీరోయిన్ల మధ్య ట్రాక్ సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఐదు నిమిషాల సైలెంట్ ఎపిసోడ్ గుండెల్ని మెలిపెట్టేలా, చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. అయితే ఇంటర్వెల్ వరకు సాఫీగా సాగే కథ, సెకండ్ హాఫ్ లో పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ద్వితీయార్థంలో హీరో హీరోయిన్ల ఆత్మఘోషను దర్శకుడు చాలా సీరియస్ గా చూపించాడు. కొన్ని చోట్ల సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్లు అనిపించినా, స్టీవెన్‌ని దేవుడిలా పూజించే మురుగన్ తల్లి ఎపిసోడ్, అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ స్లో గా అనిపించవచ్చు కానీ, యూత్ కి మరియు జెన్-జీ (Gen-Z) ఆడియన్స్ కి ఈ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి.
నటీ నటుల పనితీరు:
శ్రీ గౌరీ ప్రియ: ఈ సినిమాకు నిజమైన హీరో గౌరీ ప్రియ అనే చెప్పాలి. నివి పాత్రలో ఆమె వన్ ఉమెన్ షో చేసింది. బ్రేకప్ బాధను, ఎమోషన్స్‌ను క్లోజప్ షాట్స్‌లో తన కళ్ళతోనే అద్భుతంగా పలికించి టెర్రిఫిక్ అనిపించుకుంది.
కిరణ్ అబ్బవరం: స్టీవెన్ శంకర్ పాత్రలో కిరణ్ అబ్బవరం తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన రెగ్యులర్ రొటీన్ కి భిన్నంగా చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. ఫన్, ఎమోషన్, పెయిన్ అన్నీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు.
ఇతర నటీనటులు: చాలా కాలం తర్వాత త్రిగుణ్ ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ లో చక్కటి మార్కులు కొట్టేశాడు. సిరి హనుమంతు, పూజ తదితరులు తమ పరిధి మేరకు నటించారు. దర్శకులు పి. వాసు, కరుణ కుమార్ అతిథి పాత్రల్లో కనిపించి సర్ ప్రైజ్ చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
సాయి రాజేష్ రాసుకున్న ఇంటెన్స్ కథకు దర్శకుడు రవి నంబూరి ప్రాణం పోశాడు.
ఎప్పటిలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ తన మ్యాజిక్ చూపించాడు. ముఖ్యంగా సైలెంట్ ఎపిసోడ్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
విశ్వాస్ డానియెల్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. చెన్నై లొకేషన్స్, బీచ్ ఎపిసోడ్స్ ను ఒక అందమైన పెయింటింగ్ లా చూపించాడు.
మాస్ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు (ప్రొడక్షన్ వాల్యూస్) చాలా రిచ్ గా ఉన్నాయి, ఎక్కడా రాజీ పడలేదు.
తుది తీర్పు….
“చెన్నై లవ్ స్టోరీ” – టైటిల్ చూడగానే ఇదొక రెగ్యులర్ రొమాంటిక్ కామెడీ అనుకుంటే పొరపాటే. ఇదొక డీప్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ని పక్కన పెడితే, కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియల అద్భుతమైన నటన, గుండెల్ని తాకే డైలాగ్స్, మణిశర్మ మ్యూజిక్ కోసం ఈ చిత్రాన్ని తప్పక చూడొచ్చు. లాజిక్స్ పక్కనపెట్టి ఫీల్ ని ఆస్వాదించే యూత్‌కి, ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3.25/5
– Vadde Marenna









