నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పాంచాలి పంచ భర్తృక’(Panchali Panchabhartruka Review and Rating) సినిమా… ‘లెస్ లాజిక్.. మోర్ మ్యాజిక్’ అనే క్యాప్షన్‌తో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ క్రైమ్ డ్రామాగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: నలుగురు అమాయక స్నేహితులు అనుకోకుండా ఓ విదేశీ యువతి హత్య కేసులో చిక్కుకుంటారు. ఆ హత్యకు అండర్‌వరల్డ్ డాన్‌తో సంబంధం ఉండటంతో వారి సమస్య మరింత పెద్దదవుతుంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు గ్యాంగ్స్టర్ల నుంచి తప్పించుకునేందుకు వారు చేసే ప్రయత్నాలు, ఈ వ్యవహారంలోకి రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎలా వస్తుంది? అనేదే సినిమా ప్రధాన కథ.
విశ్లేషణ: సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడిని ఆకట్టుకునే స్థాయిలో కథనం లేకపోవడం పెద్ద మైనస్. సీన్లు ఒకదాని తర్వాత ఒకటి హడావుడిగా సాగుతుంటాయి కానీ కథ ముందుకు వెళ్తున్న ఫీలింగ్ మాత్రం పెద్దగా కలగదు.
‘లెస్ లాజిక్’ అని ముందే చెప్పినా.. కనీసం ప్రేక్షకుడిని నవ్వించేంత బలమైన కామెడీ ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో కామెడీ పంచ్‌లు పేలకపోవడంతో సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది.
ఫస్ట్ హాఫ్‌లో కథను సెటప్ చేసే విధానం అంతగా ఆకట్టుకోదు. పాత్రల పరిచయం, సంఘటనలు, కామెడీ అన్నీ కలగాపులగంగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో ట్విస్ట్ ద్వారా ఆసక్తి పెంచాలని ప్రయత్నించినా.. అప్పటికే కథనం మీద ప్రేక్షకుడికి ఆసక్తి తగ్గిపోతుంది.
డ్రామా పెంచే ప్రయత్నంలో మెయిన్ స్టోరీ ట్రాక్ నుంచి పక్కకు వెళ్లడం మరో మైనస్. క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయదు. మరింత ఎంటర్టైనింగ్గా, పంచ్‌తో ముగించి ఉంటే బాగుండేది.
నటీనటుల నటన:
రాజేంద్ర ప్రసాద్ తన అనుభవంతో సినిమాను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్ కొన్ని సన్నివేశాల్లో నవ్వులు తెప్పిస్తాయి. అయితే బలహీనమైన కథ, రాసుకున్న పాత్ర కారణంగా ఆయన స్థాయికి తగ్గ పాత్ర దక్కలేదనే భావన కలుగుతుంది.
రోల్ రైడా ఎనర్జిటిక్‌గా కనిపించినప్పటికీ, ఆయన పాత్రకు సరైన బలం లేకపోవడంతో పెర్ఫార్మెన్స్ పూర్తిగా ఉపయోగపడలేదు. కొన్ని డైలాగ్స్, కామెడీ సీన్స్ వర్కవుట్ అయినా అవి సినిమాను నిలబెట్టేంత స్థాయిలో లేవు.
రాజ్ పవన్, జెమిని సురేష్ తమ పాత్రల పరిధిలో నటించారు. మిగిలిన నటీనటుల నుంచి చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ కనిపించదు.
సాంకేతిక విభాగం:
దర్శకురాలు గంగ సప్త శిఖర ఎంచుకున్న కాన్సెప్ట్‌లో మంచి కామెడీకి అవకాశం ఉంది. కానీ దాన్ని స్క్రీన్‌పై ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలహీనత.
కాన్సెప్ట్‌లో కామెడీ, క్రైమ్, థ్రిల్‌కు మంచి అవకాశం ఉన్నప్పటికీ.. దాన్ని ఆసక్తికరమైన కథనంగా మార్చడంలో దర్శకురాలు పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు.
సంగీతం పెద్దగా గుర్తుండిపోయే స్థాయిలో లేదు. అక్కడక్కడా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించినా సినిమాకు ప్రత్యేకమైన ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.
ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో అనవసరంగా అనిపించే సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమా కొంతవరకు బెటర్‌గా ఉండేది.
కెమెరా వర్క్ ఓకే అనిపించినా.. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి.
‘పాంచాలి పంచ భర్తృక’లో కాన్సెప్ట్ ఉన్నా.. దానికి తగ్గ కథనం లేదు. కామెడీ సినిమా అని చెప్పినా నవ్వించే సన్నివేశాలు తక్కువగా ఉండటం, బలహీనమైన స్క్రీన్‌ప్లే, ల్యాగ్, అనవసరమైన సన్నివేశాలు సినిమాకు పెద్ద మైనస్లుగా మారాయి.
రాజేంద్ర ప్రసాద్ తన అనుభవంతో సినిమాను నిలబెట్టేందుకు ప్రయత్నించినా.. బలమైన కథ, ఆసక్తికరమైన కథనం లేకపోవడంతో ఆయన ప్రయత్నం కూడా పూర్తిగా ఫలించలేదు.
మొత్తంగా… కామెడీ క్రైమ్ డ్రామాగా మలచడంలో భంగ పడ్డ ‘పాంచాలి పంచ భర్తృక’ (Panchali Panchabhartruka Review)
రేటింగ్: 1.5/5









