క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ: తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో పెళ్లి సందడి.. ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న అనుపమ!
తెలంగాణ పల్లెటూరి వాతావరణం, కుటుంబ బంధాలు, ప్రేమ, పెళ్లి చుట్టూ జరిగే సంఘటనలతో రూపొందిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. కొంత విరామం తర్వాత అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం, తెలంగాణ నేపథ్యంలో కథ సాగడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. కుటుంబంలో ఎదురయ్యే పెళ్లి సమస్యలు, తండ్రి ఆశలు, కూతురి కలలు, ప్రేమ వంటి అంశాలను వినోదం, భావోద్వేగాల మేళవింపుతో చూపించే ప్రయత్నం చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది… అనేది రివ్యూలో చూద్దాం పదండి
కథ:
పర్వతాలు (నరేష్) తన పెద్దల్లుడు బాలరాజు (తరుణ్ భాస్కర్) కారణంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. తాగుడుకు అలవాటు పడిన బాలరాజు వల్ల ఊళ్లో అవమానాలు ఎదురవుతుండటంతో, కనీసం తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు.
అయితే కీర్తికి మాత్రం చదువు పూర్తిచేసి మంచి ఉద్యోగం సంపాదించుకుని, తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఆశ ఉంటుంది. అదే సమయంలో తనతో చదువుకున్న ఉదయ్ (అఖిల్ రాజ్)ను ప్రేమిస్తుంది. మరోవైపు, తన పెద్ద కూతురికి వచ్చిన మంచి అమెరికా సంబంధాన్ని చూసి అసూయపడిన పర్వతాలు, ఆ సంబంధాన్ని తన చిన్న కూతురికి తీసుకురావాలని ఓ పథకం వేస్తాడు.
అనుకున్నట్టుగానే కీర్తికి పెళ్లి సంబంధం కుదిరే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఆమె మనసులో ఉన్న ప్రేమ, జీవితంపై తనకున్న ఆశయాలు వేరు. మరి కీర్తి పెళ్లి ఎవరితో జరుగుతుంది? తన ప్రేమను గెలిపించుకుంటుందా? తండ్రి ఆశలు, కూతురి కలల మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? బాలరాజులో మార్పు వస్తుందా? అన్నది తెరపై చూడాలి.
విశ్లేషణ:
ప్రేమ, కుటుంబం, పెళ్లి వంటి అంశాలను తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో ఆవిష్కరించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథలోని పాత్రల పరిచయం, కుటుంబంలో చోటుచేసుకునే సంఘటనలతో ఫస్ట్ హాఫ్ ప్రారంభమవుతుంది. బాలరాజు చేసే పనుల వల్ల పర్వతాలు ఎదుర్కొనే ఇబ్బందులు, చిన్న కూతురికి మంచి సంబంధం తీసుకురావాలనే అతని ప్రయత్నాలు కథను ముందుకు నడిపిస్తాయి.
తన పెద్ద కూతురికి వచ్చిన సంబంధాన్ని చిన్న కూతురికి తీసుకురావాలని పర్వతాలు వేసే ప్లాన్‌తో కథలో ఆసక్తి పెరుగుతుంది. కీర్తి పెళ్లికి నిరాకరించడం, తండ్రి తన నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రయత్నించడం వంటి సన్నివేశాలు కుటుంబంలో నెలకొనే సంఘర్షణను చూపిస్తాయి. ఇంటర్వెల్ సమయానికి కీర్తి పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి ఏర్పడుతుంది.
సెకండ్ హాఫ్‌లో పెళ్లి వేడుకలు, ఆ పెళ్లిని ఆపేందుకు కీర్తి చేసే ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల మధ్య చోటుచేసుకునే పరిణామాలు కథలో కీలకంగా నిలుస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో నరేష్ పాత్రకు సంబంధించిన భావోద్వేగ సన్నివేశం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. తరుణ్ భాస్కర్ కామెడీ కూడా కొన్ని చోట్ల మంచి వినోదాన్ని అందిస్తుంది.
కుటుంబ గౌరవం, తండ్రి బాధ్యత, పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులకు ఉండే ఆశలు వంటి అంశాలను దర్శకుడు కథలో భాగం చేశారు. కథాంశం పరిచయమైనదే అయినప్పటికీ, తెలంగాణ నేపథ్యం, పాత్రల మధ్య జరిగే సంఘటనలు సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని అందిస్తాయి. కొన్ని సన్నివేశాలు మరింత వేగంగా సాగి ఉంటే కథనం ఇంకాస్త బాగుండేది. ప్రేమకథకు మరింత బలం చేకూర్చేలా సన్నివేశాలు రాసుకుని ఉంటే హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మరింత ఆకట్టుకునేది.
మొత్తంగా కుటుంబ ప్రేక్షకులకు పరిచయమైన కథాంశంతో పాటు భావోద్వేగాలను అందించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తుంది.
నటీనటుల నటన
అనుపమ పరమేశ్వరన్ కీర్తి పాత్రలో చక్కగా నటించింది. తన జీవితంపై ఆశలు పెట్టుకున్న యువతిగా, ప్రేమ విషయంలో భావోద్వేగాలకు లోనయ్యే అమ్మాయిగా పాత్రకు న్యాయం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది.
నరేష్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. పర్వతాలు పాత్రలో తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించాలనే తపన, కుటుంబ పరువు గురించి ఆలోచించే మనస్తత్వం, కూతురిపై ఉన్న ప్రేమ వంటి విభిన్న భావాలను చక్కగా పలికించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఒకే సన్నివేశంలో భిన్నమైన భావోద్వేగాలను పలికించిన తీరు ప్రశంసనీయం.
తరుణ్ భాస్కర్ బాలరాజు పాత్రలో భిన్నంగా కనిపించారు. తాగుబోతు అల్లుడిగా తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచుతూ, కీలక సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నారు. ఆయన పాత్రలో కనిపించే మార్పులు కథకు మరో కోణాన్ని అందిస్తాయి.
అఖిల్ రాజ్ తన పాత్ర పరిధిలో బాగానే నటించారు. అనుపమ అక్కగా మౌనిక బూసం మంచి నటనను ప్రదర్శించారు. కిరీటి, లక్ష్మి కిరణ్, నీల ప్రియా, సునందిని, రమణా రెడ్డి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
సాంకేతికంగా ‘క్రేజీ కళ్యాణం’లో సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తెలంగాణ పల్లెటూరి వాతావరణం, అక్కడి ఇళ్లు, పరిసరాలను తెరపై చూపించిన తీరు కథకు చక్కగా సరిపోయింది. శ్యామ్ దుప్పటి కెమెరా పనితనం సన్నివేశాలకు సహజత్వాన్ని అందించింది.
సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. పాటలు కథకు అనుగుణంగా సాగుతాయి. దర్శకుడు భద్రప్ప గాజుల కుటుంబ సంబంధాలు, ప్రేమ, పెళ్లి చుట్టూ కథను నడిపిస్తూ ప్రేక్షకులకు పరిచయమైన అంశాలను తెలంగాణ నేపథ్యంతో చూపించారు.
నిర్మాత బూసం జగన్ రెడ్డి నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదని తెరపై కనిపించే లొకేషన్లు, సెటప్‌ను చూస్తే అర్థమవుతుంది. ఎడిటింగ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత కుదించి ఉంటే సినిమా వేగం ఇంకాస్త మెరుగుపడేది.
ప్లస్ పాయింట్స్
అనుపమ పరమేశ్వరన్ భావోద్వేగ నటన
నరేష్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్
తరుణ్ భాస్కర్ కామెడీ
తెలంగాణ పల్లెటూరి నేపథ్యం
ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ
భావోద్వేగ సన్నివేశాలు
కుటుంబ బంధాలను ప్రతిబింబించే కథాంశం
ఫైనల్‌గా..
‘క్రేజీ కళ్యాణం’.. పెళ్లి సందడిలో కుటుంబ భావోద్వేగాలను పంచే చిత్రం! ప్రేమ, తల్లిదండ్రుల ఆశలు, పిల్లల భవిష్యత్తు, కుటుంబ గౌరవం వంటి అంశాలను తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో చూపించిన ఈ సినిమాలో నరేష్ నటన, అనుపమ భావోద్వేగాలు, తరుణ్ భాస్కర్ కామెడీ ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. కథలో కొత్తదనం పరిమితంగా ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నటీనటుల ప్రదర్శన, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్ని అందిస్తాయి. పెళ్లి నేపథ్యంలో సాగే కుటుంబ కథలను ఇష్టపడేవారు ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.
రేటింగ్: 3/5









