ప్రధాన తారాగణం: ఎన్టీఆర్, పూజాహెగ్డే, ఈషా రెబ్బ, సునీల్, సీనియర్ నరేష్, జగపతిబాబు, రావు రమేష్, నాగబాబు, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర, నర్రా శీను, శత్రు, సితార, దేవయాని తదితరులు
సంగీతం: యస్.యస్.తమన్
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
రేటింగ్: 3.5
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, జై లవకుశ లాంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రం ‘అరవింద సమేత.. వీర రాఘవ’. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వున్న ఎన్టీఆర్… క్లాస్ ఆడియన్స్ తో బాగా కనెక్టయ్యే త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్లతో మంచి పాజిటివ్ బజ్ ఏర్పరచుకున్న ఈ చిత్రం.. ఏమాత్రం ఎన్టీఆర్ అభిమానులను అలరించిందో చూద్దాం పదండి.
కథ: ఫ్యాక్షన్ కు బలైన కుటుంబం వీరరాఘవ(ఎన్టీఆర్)ది. పాతికేళ్ల క్రితం ఐదు రూపాయలకోసం పేకాట వద్ద మొదలైన చిన్న తగదా హత్యలకు దారితీసి.. రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ చిచ్చును రేపుతుంది. దాంతో బసిరెడ్డి(జగపతిబాబు), నారపరెడ్డి(నాగబాబు) ఇద్దరు బద్ద శత్రువులై ఫ్యాక్షన్ పగతో రగిలిపోతూ వుంటారు. ఈ నేపథ్యంలో బసిరెడ్డి తన వర్గంతో కాపుకాచి… నారపరెడ్డిని మట్టుబెడతారు. కళ్ల ముందే తండ్రి చనిపోవడంతో చేత కత్తిబట్టి ప్రత్యర్థిబర్గమైన బసిరెడ్డి వర్గాన్ని తుత్తునీయులు చేస్తాడు వీరరాఘవ. కళ్లెదుటే తండ్రిని పోగొట్టుకోవడంతో… తాను, తన భవిష్యత్తు తరమైనా ప్రశాంతగా వుండాలని పట్టణానికి వెళ్లిపోయి జీవిస్తుంటాడు వీర రాఘవ. ఆ సమయంలోనే అరవింద(పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. క్రమం వీరి స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే బసిరెడ్డి కుమారుడు బాలిరెడ్డి(నవీన్ చంద్ర) వీర రాఘవను చంపి ఎలాగైనా కసి తీర్చుకుని.. తమ ఏరియాలో రాజకీయంగా ఎదురులేకుండా చేసుకోవాలని చూస్తుంటాడు. మరి బాలిరెడ్డి.. వీర రాఘవరెడ్డిని చంపాడా? లేదా? అనేదే మిగతా కథ.
కథ.. కథనం విశ్లేషణ: ఇప్పటి వరకు టాలీవుడ్లో ఫ్యాక్షన్ నేపథ్యంలో చాలా చిత్రాలే వచ్చాయి. నైన్ టీస్ లో వచ్చిన అత:పురం, సమరసింహారెడ్డి గానీ, ఆ తరువాత వచ్చిన నరసింహానాయుడు, ఇంద్ర, ఆది తదితర చిత్రాలన్నీ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టినవే. ఎందుకంటే ‘ఫ్యాక్షన్’ అనే కాన్సెప్ట్ ను తెరమీద నిఖార్సుగా చూపించగలిగితే… ఇనానమస్ గా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారనేదానికి ఈ చిత్రాలే ఉదాహరణ: అలాంటి ఫ్యాక్షన్ నేపథ్యాన్నే కథా వస్తువుగా తీసుకుని మాటల మాంత్రికుడు టేకప్ చేసిన ఈ ఫ్యాక్షన్ చిత్రానికి.. ఇంతకు ముందు చిత్రాలకు తేడా ఒక్కటే.. ఇందులో ప్రతి సీనులోనూ మనిషి జీవితాన్ని స్పృషించే పదునైన సంభాషణలు వండటమే. ఇన్నర్ గా ప్రతి డైలాగులోనూ జీవితానికి సంబంధించిన మీనింగ్ వుండటమే. సందేశం అనే లెక్చర్ ఇవ్వకుండా.. మాటలతోనే మనుషులు ఆలోచించే విధంగా రాసుకున్న ఫ్యాక్షన్ రూపుమాపే పదునైన సంభాషణలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. ఫ్యాక్షన్ వదులుకొని ప్రశాంతంగా జీవించాలనుకునే వారికి ఈ చిత్రం కచ్చితంగా ఒక ఇన్ స్పిరేషనే. ఆడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు.. కానీ యుద్ధం ఆపినవాడే మగాడు.. వాడే మొనగాడు, యుద్ధం చేసే చేతగాని వానికి.. శాంతి కోరుకునే హక్కులేదు లాంటి పదునైన డైలాగులు ఎన్నో ఉన్నాయి. అలానే చివర్లో మహిళల ప్రాధాన్యతను వివరించే క్రమంలో పాలిచ్చే పెంచే తల్లులకు.. పాలించే అర్హతలేదా అనే వుమెన్ సెంట్రిక్ డైలాగులు క్లైమాక్స్ లో బాగా పేలాయి. ఫ్యాక్షన్ మూవీ అంటే.. కేవలం నరుకుడు, సంపుడు కాకుండా.. ఏదైనా ప్లీజంట్ గా పదునైన మాటలు, సన్నివేషాలతో చెప్పొచ్చని త్రివిక్రమ్ నిరూపించారు. మూవీ బిగినింగ్ లోనే ఓ భారీ ఫ్యాక్షన్ ఎపిసోడ్ తో మొదలు పెట్టి.. క్లైమాక్స్ ఓ చిన్న యాక్షన్ ఎపిసోడ్ తో ముగించడం బాగుంది. తప్పకుండా ఈ చిత్రం అటు మాస్.. ఇటు క్లాస్ ఆడియన్స్.. కుటుంబ సమేతంగా చూడదగ్గదే.
ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు. పదునైన సంభాషణలను పలకండంలో గానీ.. యాక్షన్ సీన్లు చేయడంలోగానీ.. ఎన్టీఆర్ తన మార్కు మ్యానరిజంతో అదరగొట్టేశాడు. అతనికి జోడీగా నటించిన పూజా హెగ్డే పాత్ర కూడా పర్ ఫెక్టుగా సూట్ అయింది. ఆమె పాత్రకూ ప్రాధాన్యత వుండటంతో ఆమె కేవలం గ్లామర్ కే పరిమితం కాలేదు. కథలో భాగం అయింది. ఆమె వల్లనే వీర రాఘవలో మార్పు రావడానికి కారణం అనే పర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఆమె పాత్ర ఇంపార్టెన్స్ ను బాగా పిక్చరైజ్ చేశారు. అలానే ఎన్టీఆర్ స్నేహితుడి పాత్రలో సునీల్ కామెడీ క్లీన్ గా వుంది. అయితే.. త్రివిక్రమ్ సినిమాలో సునీల్ అనగానే.. సునీల్ పాత్ర నిడివి మరీ ఎక్కువగా వుంటుందేమో అనుకున్నారంతా. కానీ.. కథ, కథనాలకు తగ్గట్టుగానే సునీల్ పాత్రను డిజైన్ చేశారు మాటల మాంత్రికుడు. ఇక బసిరెడ్డి పాత్రలో జగపతిబాబు చేసిన నటన.. అంత:పురంలో ప్రకాష్ రాజ్ పాత్రను గుర్తు చేస్తుంది. అంతబాగా తన పాత్రకు న్యాయం చేశారు. నాగబాబు కాసేపే వున్నా… అతని పాత్ర తాలూకు చుట్టు రాసుకున్న ఎమోషన్స్ బాగున్నాయి. ఇక మిగతా పాత్రలన్నీ ఒకే.
ఇంతకు ముందే చూసిన.. తీసిన పాత సబ్జెక్టునే ఓ రచయిత డీల్ చేస్తే… ఆ పాత కథను కూడా ఎంత ఫ్రెష్ గా.. ఎంత డెప్తగా సిల్వర్ స్క్రీన్ పై చూపించొచ్చో… అదరవింద సమేతనే వుదాహరణ. స్క్రీన్ ప్లే, సంబాషణల మీద మాటల మాంత్రికుడు ప్రాణం పెట్టే రాశారని చెప్పొచ్చు. ఎక్కడా బోరింగ్ అనిపించకుడా.. కాస్త నెమ్మదిగా కథనం ముందుకు సాగినా ప్రతి సంభాషణలోనూ డెప్త్ వుంది. పెంచల్ దాస్ సహకారం తీసుకుని పదునైన.. చాలా లోతైన అర్థంతో రాయలసీమ మాండలికం మాటలు రాయించుకుని త్రివిక్రమ్ మంచి పనే చేశారు. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. సో.. గో అండ్ వాచ్ ఇట్!