“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు, మూవీలోని ప్రతి సీన్ కొత్తగా అనిపిస్తుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా “రాజు వెడ్స్ రాంబాయి”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. బుధవారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటి అనిత చౌదరి మాట్లాడుతూ – బుల్లితెరపై నా కెరీర్ మొదలైంది ఈటీవీ ద్వారా. అదే సంస్థ నటిగా నాకు అవకాశం కల్పించింది. లిటిల్ హార్ట్స్ చిత్రంతో నాకు మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు “రాజు వెడ్స్ రాంబాయి”లోనూ నటించాను. ఈ సినిమా కూడా విజయం సాధించాలి. అన్నారు.
సింగర్ అనురాగ్ కులకర్ణి మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాలో నేను పాడిన రాంబాయి సాంగ్ పెద్ద హిట్ కావడం సంతోషంగా ఉంది. సురేష్ బొబ్బిలి, నా కాంబినేషన్ లో గతంలో వచ్చిన పాటలు కూడా శ్రోతల ఆదరణ పొందాయి. ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని ఈ సినిమాలో మీరంతా చూడబోతున్నారు. అన్నారు.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – వేణు ఊడుగుల నాకు మంచి మిత్రులు. నేను చేయబోతున్న ఒక మూవీలో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. ఎవరైనా కొత్త దర్శకుడు కథ చెబితే వారికి కావాల్సిన సపోర్ట్ వేణు దగ్గర నుంచి దొరుకుతుంది. అలాగే సాయిలుకు కూడా అందించాడు. ఈ సినిమా క్లైమాక్స్ గురించి వేణు ఎగ్జైటింగ్ గా చెప్పేవాడు. ఈ సినిమాలో అఖిల్, తేజస్వినీతో పాటు చైతన్య కూడా బాగా పర్ ఫార్మ్ చేశాడు. తెలుగు ఆడియెన్స్ బెస్ట్ ఆడియెన్స్. అన్ని జానర్స్ సినిమాలు ఆదరిస్తున్నారు. ఈ కొత్త దర్శకులను చూస్తుంటే నాకు ఇన్స్ పైరింగ్ గా అనిపిస్తోంది. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నా. అన్నారు.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా రిలీజ్ కు ముందు ఇంత క్రేజ్ తెచ్చుకుందంటే కారణం ఒక్కో ఈవెంట్ కు ఒక్కో హీరో వచ్చి ఈ సినిమాకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ చిత్రం విజయం అందుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ – ఈటీవీ విన్ వారు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ వేదిక మీద నిలబడగలిగాను. మా లిటిల్ హార్ట్స్ మూవీకి వర్క్ చేసిన టీమ్ అంతా మళ్లీ ఈ మూవీకి పనిచేశారు. అఖిల్, తేజస్వినీకి ఆల్ ది బెస్ట్. చైతన్య ఇళ్లు కూడా మా ఇంటి దగ్గరే. ఆయనకు కూడా ఈ చిత్రంతో మంచి పేరు రావాలి. అన్నారు.
నిర్మాత రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ – ఈటీవీ నుంచే నా జర్నీ మొదలైంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఆ సంస్థతో అసోసియేట్ కావడం హ్యాపీగా ఉంది. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను షూటింగ్ చేసే క్రమంలో యూనిట్ అందరి నుంచి పూర్తి సహకారం లభించింది. మా హీరో హీరోయిన్లతో సహా అనిత గారు, శివాజీ గారు, చైతన్య..ఇలా ఆర్టిస్టులంతా ఎంతో డెడికేటెడ్ గా నటించారు. ఒక ఊరు నేపథ్యంగా సహజమైన వాతావరణంలో సినిమాను రూపొందించాం. కొన్ని సినిమాలు ఎంటర్ టైన్ చేస్తాయి, కొన్ని మూవీస్ చూసి బాధపడతాం, ఈ చిత్రంలో స్ట్రాంగ్ ఎమోషన్స్ చూస్తారు. ప్రేమికులుగా వాళ్లు చేసే పనుల్లో ఒక అమాయకత్వం కనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు తెర వెనక ప్రతి డిపార్ట్ మెంట్ పడిన శ్రమ మీకు తెలుస్తుంటుంది. సినిమాకు సహజత్వం తీసుకొచ్చేందుకు మా డైరెక్టర్ సాయిలు చాలా శ్రద్ధ తీసుకున్నారు. అన్నారు.
నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ – ఇది ఏదో ఒక ప్రాంతానికి చెందిన కథ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ఏ ఒక్క ప్రాంతానికి పరిమితమైన కథ కాదు. ప్రతి కుటుంబంలో కూతురుని గారాబంగా చూసుకునే తండ్రి ఉంటాడు, ఆ కూతురు తండ్రి అంటే భయపడుతూనే, ప్రేమించే ఒక అబ్బాయి ఉంటాడు, ఈ అమ్మాయినే కోరుకున్న అబ్బాయి ఉంటాడు. ఈ ముగ్గురు పడే సంఘర్షణే ఈ కథ. రాజు, రాంబాయి పాత్రలను ప్రతి ప్రేమ జంట రిలేట్ చేసుకుంటారు. అఖిల్ మరో విజయ్ దేవరకొండ అవుతాడు. తేజస్వినీలో నాకు మరో సాయి పల్లవి కనిపించింది. ఈ సినిమా తర్వాత చైతన్య డేట్స్ దొరకడం కష్టమే. ఈటీవీ విన్ వాళ్లు ఇలాంటి కథను ఒప్పుకుంటారా అని భయపడ్డా. సాయి కృష్ణ మాకు సపోర్ట్ ఇచ్చారు. మా డైరెక్టర్ తనలోని నిజాయితీ, అమాయకత్వం, కసి అంతా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చూశాక ప్రతి అమ్మాయి తండ్రి ఆలోచనలో పడతాడు. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను చూసి నచ్చితే అందరికీ చెప్పండి. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – ఈ సినిమాలో రాంబాయి సాంగ్ ను పెద్ద హిట్ చేశారు. ఈ నెల 21న సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది. మిట్టపల్లి సురేందర్ అన్ని ఇచ్చిన లిరిక్స్ వల్లే ఈ పాట ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంలో తేజస్వినీ, అఖిల్ అద్భుతంగా నటించారు. డైరెక్టర్ సాయిలు నిజాయితీగా సినిమా రూపొందించాడు. లేకుంటే ఇంత రియలిస్టిక్ స్టోరీ బయటకు రాదు. నాకు ఈ కథకు మూలమైన ఘటన గురించి తెలుసు. మాకు దగ్గరి ఏరియాలోనే జరిగింది. మనసును హత్తుకునే ఈ ప్రేమ కథను మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని పచ్చబొట్టులా మిగిలిపోతుంది. అన్నారు.
నటుడు శివాజీ మాట్లాడుతూ – ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే చిత్రమిది. ఇదొక మట్టికథ. ఇలాంటి రియలిస్టిక్ మూవీ చేయాలంటే ధైర్యం కావాలి. ఇలాంటి సినిమా చేసినందుకు ఈటీవీ విన్ వారిని అభినందిస్తున్నా. మలయాళంలో అయితే “రాజు వెడ్స్ రాంబాయి” లాంటి మూవీస్ ఏడాది పాటు ఆదరణ పొందుతాయి. దర్శకుడు అంత సహజంగా, ప్రేక్షకుల మనసును తాకేలా రూపొందించారు. తెలుగులో ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ మొదలైంది. ప్రేక్షకులు సినిమాను చూసే పర్సెప్షన్ మారిపోయింది. ఏది మంచి చిత్రమో వారికే బాగా తెలుసు. నిజాయితీగా కథను నమ్మి తీసిన ఏ సినిమా మోసం చేయదు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు చైతన్య జొన్నలగడ్డ మాట్లాడుతూ – మీరు ఉప్పెన సినిమాలో అమ్మాయి తండ్రి ఎలా ఉంటాడో చూసి ఉంటారు, కోర్టు సినిమాలో మంగపతిని చూసి ఉంటారు, ఈ “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాలో అమ్మాయి తండ్రి వెంకన్న ఎలా ఉంటాడో ఈ నెల 21న చూస్తారు. చూడగానే భయపెట్టే పాత్ర ఇది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ అవుతుంది. వెంకన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ సాయిలు, వేణు అన్న, ఈటీవీ విన్ వారికి థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – ఈ సినిమాను ఫస్ట్ నుంచీ నేను బాగా నమ్మాను. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. ఈ చిత్రానికి ఏపీ తెలంగాణలో 99 రూపాయలు టికెట్ రేట్ పెడుతున్నాం. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నమిది. ఈ నెల 21న మేము సాలిడ్ హిట్ కొట్టబోతున్నాం. ఈటీవీ విన్ తో మా అసోసియేషన్ లో మరో సక్సెస్ ఫుల్ మూవీ “రాజు వెడ్స్ రాంబాయి” కాబోతోంది. అన్నారు.
ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ – పైరసీని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్న పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు. టికెట్ రేట్స్, ఫుడ్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, పైరసీ ఉండాలనే ప్రేక్షకులూ కొందరు ఉన్నారు. మేము సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్స్ 99లకే నిర్ణయించాం. అలాగే మల్టీప్లెక్స్ 105 రూపాయలు మాత్రమే. మా “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను థియేటర్స్ కు వచ్చి చూడండి. నేనొక్కడినే చూస్తే సరిపోతుందా అనుకోవద్దు. పైరసీ కూడా ఒక్కరు చూడటం నుంచే మొదలైంది. ఇలాంటి హార్ట్ టచింగ్ స్టోరీని మీ దగ్గరకు చేర్చేందుకే తక్కువ టికెట్ రేట్స్ పెట్టాం. ఈటీవీ విన్ లో వచ్చిన 90’s, ఎయిర్, అనగనగ, లిటిల్ హార్ట్స్ వంటి కంటెంట్ ను చూసి మాపై నమ్మకంతో థియేటర్స్ కు రండి, మీలో ఏ ఒక్కరినీ నిరాశపర్చం. అన్నారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ – రెండేళ్లుగా ఈ చిత్రంతో ట్రావెల్ చేస్తున్నాం. ఈ జర్నీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అలాగే నెల రోజులుగా ఈ మూవీ ప్రమోషన్ కోసం స్ట్రగుల్ పడుతున్నాం. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఆడియెన్స్ దగ్గరకు రీచ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. పదిహేనేళ్లుగా మరుగున పడిన ఈ ప్రేమకథే ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పిస్తుంది, సినిమా చూశాక మీతో పాటు వచ్చేస్తుంది. సినిమా చివరి 30 నిమిషాలు మిమ్మల్ని కదిలించకపోతే మరే సినిమా కూడా మీకు ఎమోషనల్ ఫీల్ ఇవ్వలేదు. “రాజు వెడ్స్ రాంబాయి” స్ట్రాంగ్ కంటెంట్ విషయంలో మేము గ్యారెంటీ ఇస్తున్నాం. అన్నారు.
హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” ఒక ఇంటెన్స్ ఎమోషనల్ మూవీ. ఈ సినిమా హార్ట్ టచింగ్, హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా మీ గుండెల్ని హత్తుకుని ఆలోచింపజేస్తుంది. ఈ మూవీ ఇచ్చే ఎక్సిపీరియన్స్ కోసం ఈ నెల 21న తప్పకుండా థియేటర్స్ కు రావాలని కోరుతున్నా. థియేటర్స్ కు వచ్చాక మా మూవీతో ప్రేమలో పడతారు. ఈ చిత్రంలో రాంబాయి పాత్రలో నేను బాగా పర్ ఫార్మ్ చేశానంటే అందుకు మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ కారణం. అన్నారు.
డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ – ఇది ఊరి కథ అని కొందరు చులకనగా మాట్లాడుతున్నారు. అవును నేను ఊరోడినే. నా ఊరంటే నాకు ప్రేమ, ఆ ఊరిలో ఉండే మనషులు ఇష్టం. అక్కడి కథలతోనే సినిమాలు రూపొందిస్తా. మా సినిమాలో హెలికాప్టర్ షాట్స్, మెట్రో షాట్స్ లేవు. ఊరిలో ఆటోడ్రైవర్, కాలేజ్ కు వెళ్లే అమ్మాయి..వీళ్లే ఉంటారు. మీకు సినిమా నచ్చకుంటే లైట్ తీసుకోండి కానీ నెగిటివ్ ప్రచారం చేయకండి. ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. సినిమా బాగా లేదనే నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేట చౌరాస్తాలో అర్థనగ్నంగా తిరుగుతా. ఛాలెంజ్ చేస్తున్నా. 15 ఏళ్లు బయటకు రాకుండా సమాధి చేయబడిన ప్రేమ కథ ఇది. ఈ సినిమా కోసం నేనూ మా టీమ్ పగలూ రాత్రీ కష్టపడ్డాం. ఆ బాధతో చెబుతున్నాం నెగిటివ్ ప్రచారం చేయకండి. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీకు మీ ఊరు గుర్తుకొస్తుంది, మీ ఊరిలోని స్నేహితులు, మీ ప్రేమ కథ గుర్తుకు వస్తాయి. అన్నారు.
హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ – కిరణ్ అన్న షార్ట్ ఫిలింస్ చూసి ఇన్స్ పైర్ అయ్యేవాడిని. ఆయన ఈ రోజు మా మూవీ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ సినిమాను ప్రేమించేవారే. సినిమా మీద ప్యాషన్ తో వచ్చినవారే. మేమంతా ఇంత కష్టపడి చేసిన సినిమా మీద కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మా మూవీ క్లైమాక్స్ గురించి మీమ్స్ పెడుతున్నారు. అలాంటి క్లైమాక్స్ మా సినిమాలో ఉండదు. మా డైరెక్టర్ ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారో, ఆయన అలాగే ఉంటారు. ఎవరు ఆపాలని చూసినా మా మూవీ ఆగదు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున పెద్ద సక్సెస్ దక్కుతుందని ఆశిస్తున్నాం. నేను కెరీర్ బిగినింగ్ లో ఉన్నాం. మా సినిమా మీదనే ఆధారపడిఉన్నాం. ఈ సినిమా మీకు నచ్చకుంటే నా నెక్ట్స్ మూవీస్ కూడా చూడకండి. సినిమా మీద నమ్మకంతోన ఈ మాట చెబుతున్నా. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మేము షార్ట్ ఫిలింస్ చేసేప్పుడు కొత్త వాళ్లకు ఏదైనా సపోర్ట్ దొరికితే బాగుండేది అనిపించేది. ఇప్పుడా సపోర్ట్ ఈటీవీ వారి రూపంలో యంగ్ టాలెంట్ కు దక్కుతోంది. వంశీ నందిపాటి గారితో క మూవీ చేశాను. ఆయన చెబితే ఆ మూవీలో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నట్లే. హీరో అఖిల్ బాగా నటించాడు, తేజస్వినీ మన పొరుగు అమ్మాయి అనేంత సహజంగా ఉంది. ఈ జంటను చూస్తుంటే మన ఊరిలో అరుగుమీద కూర్చుని సరదాగా మాట్లాడుకునే జంటలా అనిపిస్తున్నారు. డైరెక్టర్ సాయిలును చూసినప్పుడు అతనిలో నిజాయితీ కనిపించింది. రాజు వెడ్స్ రాంబాయి మూవీ ట్రైలర్ చూస్తుంటే ప్రతి షాట్ కొత్తగా అనిపించింది. అదే విషయాన్ని సాయిలుకు చెప్పాను. ఊరి కథలు ప్రేక్షకులు చూస్తారా అంటే తప్పకుండా చూస్తారు మనలో 80శాతం మంది ఊరి నుంచి వచ్చినవాళ్లమే. సినిమాలను ఎక్కువగా ఆదరించేది ఊరి వాళ్లే. నేను చాలా దారుణాలు విన్నాను గానీ వీళ్లు వచ్చి సినిమా క్లైమాక్స్ గురించి చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇలాంటిది జరిగిందా. మా ఊరు చుట్టుపక్కల ప్రేమ కథల్లో కూడా దారుణాలు జరిగాయి గానీ ఇలాంటివి నిజంగా జరిగిందా, ఇలా చేస్తారా, ఇలాంటి మనుషులు ఉంటారా అనిపించింది. ఈ సినిమాను మిగతా అందరి కంటే ముందు పదిహేనేళ్లు ప్రేమ కథను దాచిపెట్టిన ఆ ఊరి వాళ్లు ఫస్ట్ చూడాలి. ఈ బాధను మనం పక్కని వాళ్లకు కూడా చెప్పుకోలేకపోయాం. ఈ కథను సినిమాగా చేశారు చూద్దామని ఆ ఊరిలోని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. క్లైమాక్స్ తెలుసుకుని నేను షాక్ అయినట్లే సినిమా చూసిన ఆడియెన్స్ కూడా ఫీల్ అవుతారు. మీకు అందుబాటులో ఉండేలా 99 రూపాయలకే టికెట్ రేట్ పెట్టారు. మీరంతా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.










