టి ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గాయత్రీ సౌమ్య గుడిసెవా సహా నిర్మాతగా ప్రశాంత్ టాటా నిర్మించిన చిత్రం ‘సిమంతం’. వజ్రయోగి, శ్రేయ భారతి నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీని సుధాకర్ పాణి తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్ 14, 2025న విడుదలైంది. వరుస క్రూరమైన హత్యల చుట్టూ ఈ కథ సాగుతుంది. కేసుని సాల్వ్ చేసేందుకు పోలీసులు తెగ కష్టపడుతుంటారు. మరి ఈ కథలోని ట్విస్టులు ఏంటి? సినిమా ఎలా ఉంది? అన్నది ఓ సారి చూద్దాం.
కథ
క్రైమ్ థ్రిల్లర్ కథలకు ఉండే ఫార్మాట్ అందరికీ తెలిసిందే. సిటీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతుంటాయి. ఇక ఇలాంటి కిల్లర్ ఆట కట్టించేందుకు హీరో వస్తాడు. ఇందులోనూ ఇలాంటి పాయింటే కనిపిస్తుంది. నగరంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. వాటిని సాల్వ్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడతారు. అయితే ఈ క్రమంలో డిటెక్టివ్ వజ్ర (వజ్ర యోగి) రంగంలోకి దిగుతాడు. ఈ వజ్ర ఆ సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకుంటాడు? అసలు ఆ హత్యల వెనుకున్న కారణం ఏంటి? చివరకు కథ ఎలా ముగుస్తుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు
వజ్రయోగి డిటెక్టివ్ పాత్రతో అదరగొట్టేశాడు. సినిమాలోని ఇంటెన్సిటీని తన నటనతో చూపించాడు. ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లో అతడి నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. శ్రేయ భారతి కథనానికి తగినట్టుగా చక్కగా నటించింది. అనిల్ లింగంపల్లి సిఐ పోలీసు అధికారి పాత్రను సమర్థవంతంగా పోషించాడు. ఇతర పాత్రల్లో నటీనటులు అందరూ కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
విశ్లేషణ
ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఓ వైపు సీరియల్ కిల్లింగ్స్, ఇంకో వైపు లవ్ స్టోరీ అంటూ ఇంటర్వెల్ వరకు అలా తీసుకుని వెళ్తుంటాడు. మధ్యలో డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌కు మంచి ట్విస్ట్‌ను ఇస్తారు. అయితే క్రైమ్ థ్రిల్లర్ కథలకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా సెట్ చేసుకోవాలి. అప్పుడే సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మూవీలోనూ స్క్రీన్‌ప్లే ప్రధానంగా రెండవ భాగంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. సెకండాఫ్ ఆరంభం నుంచీ ఉద్రిక్తతను పెంచుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా అనిపిస్తుంది.
ఎస్ సుహాస్ నేపథ్య సంగీతం సీన్లను మరింత ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. సుధాకర్ పాణి దర్శకత్వ ప్రతిభ, కథనాన్ని మల్చిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. గర్భిణీ స్త్రీలు పై జరుగుతున్నా అరాచకాలని మన హీరో ఎలా ఎదురించారో చెప్పే కథ ఈ సిమంతం. మొత్తంమీద సిమంతం క్రైమ్ థ్రిల్లర్ మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ జానర్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌కి, కుటుంబ ప్రేక్షకులకు ఇలా అందరికీ నచ్చుతుంది.
రేటింగ్: 3/5










