చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ ‘ఇక్కడ అందంగా ఫొటోలు తీయబడును’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాను బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై స్టార్ హీరో విజయ్ దేవరకొండ మామ, ‘పెళ్లిచూపులు’, ‘డియర్ కామ్రేడ్’ నిర్మాత యష్ రంగినేని నిర్మించారు. ‘ఓ పిట్టకథ’ డైరెక్టర్ చెందు ముద్దు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు నటించు. ఈ చిత్రం మొదటి నుంచి ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండ ట్రైలర్ రిలీజ్ చేయడంతో ఈ చిత్రానికి మరింత ప్రచారం లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు చోట్ల ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు వేశారు. అన్ని చోట్లా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: నందగిరి అనే గ్రామంలో చంటి(చైతన్య రావు) ఓ ఫొటో స్టూడియోను నడుపుతూ… సరదాగా స్నేహితులతో కాలం గడిపేస్తూ ఉంటాడు. పెళ్లీడు దాటిపోయినా… తల్లిదండ్రులు మాత్రం అతనికి పెళ్లి చేయకుండా ఉండటంతో… అతను గౌతమి(లావణ్య) అనే ఓ కాలేజీ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికి నానా అగచాట్లు పడుతూ ఉంటే… అనుకోకుండా ఓ అమ్మాయిని కాపాడబోయి… తన మిత్రుడితో కలిసి ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దానిని ఓ అజ్ఞాత వ్యక్తి ఫొటోలు తీసి చంటిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ కేసు నుంచి బయట పడాలన్నా… మర్డర్ చేస్తున్న ఫొటోలు ఇవ్వాలన్నా… తను చెప్పినట్టు చేయాలని షరతు విధిస్తాడు. ఆ షరతు ఏంటి? అసలు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? వయసు మీద పడిపోయిన చంటిని కాలేజీ గర్ల్ గౌతమి వివాహం చేసుకుందా? చంటికి అన్ని సంవత్సరాలు వచ్చినా ఎందుకు తల్లిదండ్రులు వివాహం చేయకుండా కాలయాపన చేశారు? తదితర వివరాలు తెలియాలంటే… ఈ సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఈ సినిమా కథ… కథనాలు 80’స్ లో జరుగుతాయి. అప్పట్లో పల్లెటూరి వాతావరణం… ప్రజల జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, స్వచ్ఛమైన ప్రేమలు, స్నేహాలు అలాగే కుతంత్రాలు ఎలా ఉండేవో ఇందులో చూపించారు డైరెక్టర్ చెందు ముద్దు. కంప్లీట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ ను తీసుకొని… ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని మలిచారు. అయితే ఇందులో చమక్కులు, మెరుపులు లాంటి వేమీ లేవు కానీ… సరదాగా ఆ కాలం నాటి తాలూకు జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఈ సినిమా బాగానే పనికొస్తుంది. దర్శకుడు చెప్పనట్టు… టెక్నాలజీ, కమ్యూనికేషన్ సిస్టం లేని టైంలో కథను చెప్పాలనుకొని… రెట్రో ఫీలింగ్ ఈ చిత్రంతో తీసుకొచ్చారనే చెప్పొచ్చు. పాత్రల చిత్రీకరణ, వేషధారణ, గ్రామల్లో కనిపించే జీవన విధానం అన్నీ 80ల నేపథ్యంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు.
నటీనటుల పనితీరు ఎలా ఉందంటే… ‘30 వెడ్స్ 21’తో ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు చైతన్య రావు… ఇందులో కూడా ఇంచు మించు అలాంటి పాత్రలోనే కనిపించి మెప్పించాడు. ఓ విలేజ్ లో జీవించే సాధారణ కుర్రాడు ఎలా ఉంటాడో… ఇందులో అలానే కనిపించి మెప్పించాడు చైతన్య. అతనికి జోడీగా నటించిన భీమవరం అమ్మాయి లావణ్య కూడా గౌతమి పాత్రలో పక్కింటి అమ్మాయిలా లంగావోణిలో మేకప్ లేకుండా చాలా నాచురల్ గా కనపించి ఆకట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే యాస, భాషను పలికి మెప్పించింది. హీరో చెల్లెలి పాత్ర పద్దుగా ఉత్తర నటించి ఆకట్టుకుంది. ఆమెకు జోడీగా లలిత్ ఆదిత్య నటించాడు. విదేశాల నుంచి వచ్చిన అమ్మాయిగా ఉత్తర పాత్రలో మిహిరా వెస్ట్రన్ దుస్తుల్లో కుర్రకారును ఆకట్టుకుంటుంది. అలాగే నిర్మాత యష్ రంగినేని… జగదీష్ పాత్రలో కనిపించి మెప్పించాడు. హీరో స్నేహితుడిగా వైవా రాఘవ… సినిమాలో చివరి వరకూ కనిపించి నవ్వించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు ఎలావుందంటే… దర్శకుడు చెందు చెప్పినట్టు… తను నిజ జీవితంలో చూసిన పాత్రలు, తన ఊళ్ళో జరిగిన సంఘటలను చూసి ఇన్ స్పైర్ అయి రాసుకున్న కథ కావడంతో ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇందులోని పాత్రలు అన్నీ ఎంతో సహజంగా… మన చుట్టూ జరిగినట్టే ఉండేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఇందులోని లొకేషన్స్ ని చాలా అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ పనితనం కనిపిస్తుంది. ఆనాటి గ్రామీణ వాతావరణం ఎంత స్వచ్ఛంగా ఉండేదో కళ్లకు కట్టినట్టు చూపించాడు. సంగీతం బాగుంది. రంగమ్మ అనే రెట్రోబీట్ బాగుంది. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాత యష్ రంగినేని ఖర్చకు వెనుకాడకుండా… సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. ఈ వారం సరదాగా ఫ్యామిలీతో ఈ స్టూడియోను ఓసారి చూసేయండి.
రేటింగ్: 3