హరిహర వీరమల్లు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రత్యేక చిత్రమనే చెప్పాలి. తొలిసారి కల్పిత చారిత్రక యోధుడు పాత్రలో నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. అంతేకాదు పవన్.. ఓ శాసన సభ్యుడిగా ఎన్నికై ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలైన తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు పవన్ కెరీర్ లో ఎక్కువ కాలం షూటింగ్ జరుపుతోవడంతో పాటు ఇద్దరు దర్శకులు తెరకెక్కించిన చిత్రంగా ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ:
‘హరి హర వీరమల్లు’ సినిమా కథ విషయానికొస్తే.. హరి హర వీరమల్లు (పవన్ కళ్యాణ్) పెద్దోళ్లను కొట్టి పేదలకు పెట్టే బందిపోటు. 16- 17వ శతాబ్ధంలో సాగుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కుతుబ్ షాహీల దగ్గర నుంచి మొఘలాయిల దగ్గరకు వెళుతుంది. అక్కడ నుంచి ఈ కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతను హైదరాబాదీ కుతుబ్ షాహీ నవాబు.. హరి హర వీరమల్లు కు అప్పగిస్తుంది. అంతకు ముందు హైదరాబాదీ నవాబు సైన్యానికి తన పవర్ ఏంటో చూపిస్తాడు వీరమల్లు. దీంతో మొఘలాయి చక్రవర్తిలో అత్యంత క్రూరుడైన ఔరంగజేబు (బాబీ డియోల్) దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి హైదరాబాద్ సంస్థానం నుంచి ఢిల్లీకి బయలు దేరుతాడు. అప్పటికే ఔరంగజేబు ఇస్లాంలోకి మారని హిందువులపై జిజియా పన్ను సహా వివిధ రకాల దురాగతాలకు పాల్పడుతాడు. శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబు సామ్రాజ్యంలో హరి హర వీరమల్లు ఎలా ప్రవేశించాడు. ఈ క్రమంలో మొఘలాయిల సైన్యంతో హరి హర వీరమల్లు ఎలాంటి పోరాటం చేసాడు. హిందువులుగా బతకాలంటే జిజియా పన్ను కట్టాలన్న ఔరంగజేబును ఎలా ఎదుర్కొన్నాడు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చాడా లేదా ఈ క్రమంలో పంచమి (నిధి అగర్వాల్ ) పాత్ర ఏమిటి..? అనేదే ‘హరి హర వీరమల్లు’ పార్ట్ -1 సోర్డ్ అండ్ స్పిరిట్ స్టోరీ.
మొత్తంగా కోహినూర్ వజ్రం చుట్టూ ఓ కథను అల్లడం దాన్ని పవన్ కల్యాణ్ ను ఒప్పించడంతో సగం సక్సెస్ సాధించాడు క్రిష్. ఇక మహా భారతం మొదట నన్నయ్య మొదటి రెండున్నర పర్వాలు రాసాడు. ఆ తర్వాత మిగిలిన 15 పర్వాలను తిక్కన పూర్తి చేసాడు. ఇక రెండున్నరలో మిగిలనదాన్ని ఎఱ్ణాప్రగడా పూర్తి చేసినట్టు .. క్రిష్ మొదలుపెట్టిన ఈ కథను దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తి చేసాడు. మధ్యలో ఎర్రన్నలాగా పవన్ కళ్యాణ్ కొంత భాగాన్ని డైరెక్ట్ చేశారు. మొత్తంగా ఈ సినిమా స్టోరీ నేరేటివ్, క్రియేటివిటి అంతా క్రిష్ కు దక్కాల్సిందే. మొత్తంగా కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కులీకుతుబ్ షాల దగ్గర నుంచి మొగల్ పాలకుల వద్దకు ఎలా చేరింది. అలా మొఘల్ పాలకుల నుంచి బ్రిటిష్ వారి దగ్గరకు పోయింది. అలా జరిగిన ఓ నిజ జీవిత గాథకు ఓ కల్పిత పాత్రను జోడించి దాన్ని సరైన దిశగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
హైదరాబాద్ సంస్థానంలో పెద్దగడీలున్న వాళ్లను దోచుకొని పేద సాదాలకు పంచే హరి హర వీరమల్లు సాహసం.. హైదరాబాద్ నవాబు వద్దకు చేరడం. అతను హరి హర వీరమల్లుతో మన కోహినూర్ వజ్రాన్ని మొఘలాయి పాలకుడు ఎలా అపహరించుకు పోయాడనే దాన్ని క్లుప్తంగా చూపించాడు. దాన్ని తీసుకొచ్చే బాధ్యతను వీరమల్లు అప్పగించే క్రమంలో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వస్తాదులతో పవన్ చేసే ఫైట్ ఆకట్టుకుంటుంది. విరామం ముందు సీన్స్ ప్రేక్షకులను ఉత్కంఠ రేకెత్తించేలా తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో ఊర మాస్ చూపించడంలో సక్సెస్ అయ్యారు దర్శక ద్వయం. ఇంటర్వెల్ వరకు సాదాసీదా మూడు ఫైట్లు అన్నట్టుగా సాగిపోతుంది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వీరమల్లు, ఔరంగజేబుతో తలపడటం అంత కన్విన్సింగ్ గా ఉండదు. ఓ చక్రవర్తి ఓ సామాన్యమైన బందిపోటు దొంగతో ఫైట్ చేయడు. అతని సైన్యం లేదా మంత్రులు వారందరు ఓడిన తర్వాత చేస్తాడు. క్లైమాక్స్ లో ఔరంగజేబు పాత్రతో ఆందీ వచ్చాడంటూ ప్రధాని మోడీ చెప్పిన విషయాన్ని ఇందులో ప్రస్తావించడం పవన్ అభిమానుల కోసం పెట్టినట్టు ఉంది. ముఖ్యంగా ఢిల్లీకి చేరుకునే క్రమంలో ఔరంగజేబు సైన్యం మధ్యలో వీరమల్లు ఎలా ఓడించాడనేది ఇంట్రెస్టింగ్ గా సాగిపోతుంది. ఇక గడీల్లో ఓ దొరవద్ద బంది అయిన పంచమి ని కూడా తనతో పాటు ఢిల్లీకి తీసుకెళతాడు వీరమల్లు. ఈ క్లైమాక్స్ కూడా బాహుబలి తరహాలో ఉండటం కామన్ ఆడియన్స్ కు సగం సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ పార్ట్ లో అసలు కథ ఉన్నట్టు చూపించాడు.
అప్పట్లో ఔరంగజేబు హిందువులుగా బతకాలంటే జిజియా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో హిందూ ధర్మం కోసం చెప్పే డైలాగులు బాగున్నాయి. ఇక్కడ సాయి మాధవ్ బుర్రా మాటలు పేలాయి. ముఖ్యంగా ‘జనం మెచ్చే సైనికుడు అవుతాడు’.. ‘పాలించే వారి పాదాలే కాదు..తల కూడా కనిపించాలి’ అనే పవన్ పొలిటికల్ కెరీర్, వ్యక్తిత్తత్వాన్ని ప్రతిబింబించేలా సాయి మాధవ్ బుర్ర డైలాగులు థియేటర్స్ లో ఈలలు వేయిస్తాయి.
మనోజ్ పరమహంస, జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కువ మటుకు గ్రాఫిక్స్ కాకుండా రియల్ లొకేషన్స్, సెట్టింగ్స్ లో షూట్ చేయడం అనేది ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. సినిమాకు కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పెద్దగా ఇంపాక్ట్ ఉన్నట్టు లేవు. పవన్ పాడిన పాట సాదాసీదా ఉంది. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది.
పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హరి హర వీరమల్లు తన ఎఫర్ట్ మొత్తం కనిపిస్తోంది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. అభిమానులకు ఏదైతే కావాలో అదంత ఇచ్చాడు. ముఖ్యంగా ఫైట్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ కష్టం కనిపిస్తోంది. ముఖ్యంగా వస్తాదులతో పోరాట సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. నిధి అగర్వాల్ పంచమి పాత్రలో తనదైన అందంతో పాటు నటనతో అలరించింది. ముఖ్యంగా గడీల్లో ఓ దొర వద్ద నలిగిపోయే నాట్యగత్త పాత్రలో అలరించింది. ఔరంగజేబుగా బాబీ డియోల్ క్రూరత్వం కనిపించింది. సినిమాలో అతనికి పూర్తిగా నటించే ఛాన్స్ రాలేదు. సునీల్ ఉన్నంతలో నవ్వంచే ప్రయత్నం చేసాడు. దివంగత కోట శ్రీనివాస రావు చిన్న పాత్రలో కనిపించాడు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. గో అండ్ వాచ్ ఇట్..!
పవన్ కళ్యాణ్ ‘వన్ మ్యాన్ షో’
రేటింగ్: 3