అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మధుబాల, మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్.. పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. కన్నప్ప సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఈరోజే విడుదల అయింది. ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: 2వ శతాబ్దంలో స్వర్ణముఖి నది తీరాన కొన్ని గూడేలు ఉంటాయి. ఒక గూడెంలో ఆ గూడెం పెద్ద నాధనాధుడు(శరత్ కుమార్) కొడుకు తిన్నడు(అవ్రామ్). చిన్నప్పుడే తిన్నడు స్నేహితుడిని దేవుడి పేరు చెప్పి బలివ్వడంతో చిన్నప్పటి నుంచే దేవుడు లేడు అంటూ పెరుగుతాడు. పెద్దయ్యాక తిన్నడు(మంచు విష్ణు) ఒక గొప్ప యోధుడిలా తయారవుతాడు. తిన్నడు మరో గూడెం అమ్మాయి నెమలి(ప్రీతీ ముకుందన్) తో ప్రేమలో పడతాడు. స్వర్ణముఖి నది తీరాన ఉన్న వాయు లింగాన్ని ఎవరికీ కనిపించకుండా మహదేవశాస్త్రి(మోహన్ బాబు) సీక్రెట్ గా పూజలు చేస్తూ ఉంటాడు. కాలాముఖుడు(అర్పిత్) ఆ వాయులింగం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. తిన్నడు కాలాముఖుడు తమ్ముడిని చంపేస్తాడు. దీంతో కాలాముఖుడు వాయు లింగం కోసం, తిన్నడిని చంపడం కోసం అడివి, గూడెంలు మీదకు దండెత్తుతున్నాడని తెలుస్తుంది.
దాంతో అప్పటివరకు విడివిడిగా ఉన్న గూడాలన్నీ కలుస్తాయి. ఈ విషయంలో తిన్నడు ఫ్రెండ్ ని బలి ఇవ్వాలనుకుంటారు. తిన్నడు అడ్డుపడటంతో అన్ని గూడాల మధ్య మళ్లీ గొడవలు అవుతాయి. నెమలి విషయంలో కూడా తిన్నడికి మరో వ్యక్తికి గొడవ అవుతుంది. దీంతో తిన్నడిని నాధనాధుడు గూడెం నుంచి వెలివేస్తాడు. నెమలి కూడా తిన్నడు కోసం అందర్నీ వదిలి వచ్చేస్తుంది. కాలాముఖుడు తన సైన్యంతో దండెత్తి తిన్నడు తండ్రిని చంపేస్తాడు. దీంతో తిన్నడు యుద్ధం చేసి కాలాముఖుడ్ని చంపేస్తాడు. తిన్నాడు కాలాముఖుడి తమ్ముడ్ని ఎందుకు చంపుతాడు? అసలు దేవుడిని నమ్మని తిన్నడు శివుడిని ఎలా నమ్ముతాడు? కన్నప్పగా ఎలా మారుతాడు? మహాదేవశాస్త్రి వాయులింగాన్ని ఎందుకు ఎవర్ని చూడనివ్వడు? వాయులింగం దగ్గరికి తిన్నడు, అతని భార్య ఎలా వెళ్తారు?ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ: మంచు విష్ణు కన్నప్ప మీద సినిమా తీస్తా అంటే మొదట్లో ట్రోల్స్ వచ్చాయి. మొదట్లో వచ్చిన టీజర్ కూడా బాగా ట్రోలింగ్ కి గురైంది. కానీ సాంగ్స్, ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మనకు కన్నప్ప శివుడికి కళ్ళు ఇచ్చాడు అనే కథ తెలుసు. దానికి ముందు కన్నప్ప ఎవరు, అతని పోరాట పటిమ ఏంటి అని కొంత చరిత్ర, కొంత కల్పిత కథగా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా తిన్నడు పాత్ర గురించి, కాలాముఖుడు గురించి, నెమలి – తిన్నడు ప్రేమతోనే సాగుతుంది. ఇంటర్వెల్ లో మోహన్ లాల్ పాత్ర ఎంట్రీతో మంచి హైప్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో కాలాముఖుడితో యుద్ధం, నెమలి – తిన్నడు కలిసి జీవించడం, మహాశివరాత్రి, రుద్ర ఎంట్రీ, కాళహస్తి చరిత్ర, శివపార్వతులతో సాగుతుంది.
ఏ అంచనాలు లేకుండా వెళ్తే సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది. సినిమాలో భక్తి ఉన్నా రక్తి కూడా బాగానే చూపించారు. తిన్నడు- నెమలి పాత్రల మధ్య రొమాన్స్ కొంచెం తగ్గించాల్సింది. వాళ్ళిద్దరి మధ్య రెండు పాటలు పెట్టారు, ఒక్క పాటతో సరిపెట్టాల్సింది. ఆ ప్రేమ సన్నివేశాలు ఎక్కువవడం తప్ప సినిమాలో కథాకథనాల పరంగా వంక పెట్టడానికి ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్ గా సాగుతూ మెప్పిస్తుంది. ఇంటర్వెల్ కి కిరాతార్జునీయం కథని చాలా బాగా జొప్పించారు. ఆ పురాణం తెలిసినవాళ్ళు బాగానే కనెక్ట్ అవుతారు.
ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా ఓ రేంజ్ కి వెళ్ళిపోతుంది. ఇక క్లైమాక్స్ అన్ని భక్తి సినిమాలలాగే ఎమోషనల్ గా భక్తితో దేవుడికి కనెక్ట్ అయ్యేవిధంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ కన్నప్ప కథలో మనం లీనమయి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయం. విష్ణు తన పిల్లలు అందర్నీ సినిమాలో నటింపచేసాడు. తన పెద్ద కూతుళ్లు ఇద్దరితో చేయించిన స్పెషల్ పాట మాత్రం కథకు అవసరం లేకపోయినా జొప్పించినట్టు ఉంటుంది. ఆ పాట సినిమా అయ్యాక చివర్లో పెడితే బాగుండేది. ఇక కొడుకు అవ్రామ్ పాత్రకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తే సహజంగా ఉండేది. అంతర్లీనంగా భార్య భర్తల బంధం – ప్రేమ విలువ చెప్తూ ఒక మంచి లవ్ స్టోరీ కూడా చూపించారు. అన్నమయ్య, శ్రీరామదాసు లాగా కన్నప్ప గొప్ప సినిమాగా నిలవడం ఖాయం. మంచు ఫ్యామిలీకి ఒక మంచి సినిమాగా నిలిచిపోతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. మంచు విష్ణు కెరీర్లో ఒక బెస్ట్ పాత్రగా తిన్నడు నిలిచిపోతుంది. ఓ పక్క పోరాట యోధుడిలా బాడీ పెంచి యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొడుతూనే మరోపక్క భక్తిలో లీనమయిన పాత్రలో కన్నీళ్లు పెట్టిస్తాడు. ప్రీతీ ముకుందన్ ఫుల్ లెంగ్త్ పాత్రలో చాలా అందంగా కనిపిస్తూ, యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొడుతూ చక్కగా నటించింది. ప్రభాస్ చాలా కూల్ గా ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో రుద్ర పాత్రలో మెప్పిస్తాడు.
మోహన్ లాల్ కాసేపు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా అదరగొట్టారు. శివపార్వతులుగా అక్షయ్ కుమార్ – కాజల్ అగర్వాల్ మాత్రం పర్వాలేదనిపించారు. శరత్ కుమార్ గూడెం పెద్దగా బాగా నటించారు. మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు పర్ఫెక్ట్ గా సరిపోయారు. మధుబాల, అర్పిత, ఐశ్వర్య, ముకేశ్ ఋషి, శివ బాలాజీ, బ్రహ్మానందం, సప్తగిరి, సురేఖావాణి.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో అలరించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు సంగీతం చాలా ప్లస్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భక్తి రస చిత్రానికి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఇచ్చారు. పాటలు కూడా వినడానికి, చూడటానికి బాగున్నాయి. కానీ సాంగ్స్ మ్యూజిక్ మాత్రం పాత తెలుగు సినిమాల్లో విన్నట్టు కచ్చితంగా అనిపిస్తుంది. ఇక లొకేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విష్ణు కోట్లు ఖర్చుపెట్టి న్యూజిలాండ్ కి తీసుకెళ్లి మరీ షూట్ చేసారంటే అందరూ ఇక్కడ లొకేషన్స్ లేవా అని ట్రోల్ చేసారు కానీ సినిమాకి ఆ లొకేషన్స్ బాగా సెట్ అయ్యాయి. అసలు అప్పట్లో నిజంగానే స్వర్ణముఖి నది, అడవులు అలాగే ఉండేవేమో అనిపిస్తుంది.
కల్పిత కథ కూడా జతచేయడంతో యాక్షన్ సీక్వెన్స్ లు చాలానే ఉన్నాయి. యుద్ధ సన్నివేశాలని బాగా డిజైన్ చేసారు. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో కొంత కట్ చేస్తే బాగుండేది. ఇక రైటింగ్ లో కూడా చాలా కేరింగ్ తీసుకున్నారు. భాష పరంగా, మాటల పరంగా కేర్ తీసుకొని మంచి డైలాగ్స్ రాసారు. డబ్బింగ్ పరంగా కొన్ని చోట్ల మాత్రం ఇంకాస్త కేరింగ్ తీసుకొని పదాలు స్పష్టంగా వినపడేలా చెప్పిస్తే బాగుండేది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తూనే ఉంది.
ఓవరాల్ గా కన్నప్ప… హిట్టప్పా!!! గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3.5