లవ్ స్టోరీస్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంటుందని డెబ్యూ దర్శకులు, నటీనటులు అలాంటి ప్లాట్ ను ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించి సక్సెస్ అవుతుంటారు.. తాజాగా
రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా తెరకెక్కిన సినిమా ‘లగ్గం టైం’. కె.యశ్వంత్ కుమార్ సమర్పణలో ట్వంటీ సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. హిమబిందు నిర్మాణంలో ప్రజోత్ కె వెన్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి కామిడీ ఎంటర్టైనింగ్ ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ: వివాహం చేసుకోవడానికి రెడీ అయిన అనన్య(నవ్య)ను ఆమె బాయ్ ఫ్రెండ్ సూర్య (రాజేష్ మేరు) కిడ్నాప్ చేయాలనుకుంటాడు. అయితే పెళ్లి పందిట్లో జరిగిన ఓ సంఘటనతో సూర్య… కిడ్నాప్ ప్లాన్ కి కాస్త ఫుల్ స్టాప్ పెట్టి… తన కెరీర్ కోసం ప్రాధాన్యత ఇచ్చి ఇంటర్వ్యూ కి హాజరవుతాడు తన మిత్రుడితో కలిసి. అయితే పెళ్ళికొడుకు చంద్ర(సుదర్శన్) మాత్రం కిడ్నాప్ కు గురవుతాడు. ఇంటర్వ్యూకి వెళ్లిన సూర్య అక్కడ హెచ్ఆర్(ప్రీతీ సుందర్)కి పూణేలో తనకు, అనన్యకు మధ్య జరిగిన లవ్ స్టోరీ చెప్తుండగా మధ్యలో పోలీసులు సూర్యనే పెళ్లి కొడుకు చంద్రని కిడ్నాప్ చేశాడు అని అతన్ని తీసుకెళ్తారు. అసలు పెళ్లి కొడుకు చంద్రని ఎవరు కిడ్నాప్ చేసారు? పుణేలో సూర్య, అనన్యల ప్రేమకథ ఎలా మొదలయింది? పెళ్లింట్లో ఏం జరిగింది? చివరికి సూర్య – అనన్య కలుస్తారా? అసలు సూర్యని వదిలేసి అనన్య వేరే పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా.. చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ప్రేమ.. పెళ్లి.. కిడ్నాప్ కథలు చాలా ఎంటర్టైంగ్ గా ఉంటాయి. అందుకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కూడా తోడైతే ఆడియన్స్ ను ఇట్టే ఎంగేజ్ చేయొచ్చు. అలాంటి మంచి ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ ప్రేమ కథ తో తెరకెక్కిన సినిమానే లగ్గం టైం.
పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు కిడ్నాప్ అవడం, వాళ్లలో ఎవరికో ఒకరికి లవ్ స్టోరీ ఉండటం అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కథనాన్ని కొత్తగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ సూర్య అనన్య పెళ్ళికి వెళ్లడం, అక్కడి నుంచి వచ్చేయడం, తన లవ్ స్టోరీ చెప్పడం, పెళ్లి కొడుకు కిడ్నప్ అయ్యాడని తెలియడం, అది సూర్యనే చేసాడని పోలీసులు రావడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది.
సెకండ్ హాఫ్ లో వరుసగా ట్విస్టులు రివీల్ చేస్తూ బాగానే ముగించారు. సినిమా అంతా ప్రేమ కథతో పాటు కామెడీ కథనంతోనే నడిపించారు. ఫస్ట్ హాఫ్ మొదటి 20 నిముషాలు పెళ్లింట్లో జరిగే తతంగం అంతా సాగదీశారు. ఫ్లాష్ బ్యాక్ హీరో – హీరోయిన్ లవ్ స్టోరీ సింపుల్ గా, క్యూట్ గా అక్కడక్కడా కామెడీతో చిన్న యాక్షన్ టచ్ తో సాగుతుంది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ నార్త్ అమ్మాయితో హిందీ తెలుగు మాట్లాడించి కామెడీ వర్కౌట్ చేద్దామని చూసారు కానీ అది కాస్త కష్టంగానే ఉంటుంది.
సెకండ్ హాఫ్ లో కూడా కామెడీతో పాటు చిన్న చిన్న ట్విస్టులతో బాగానే నడిపించారు కానీ కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వలేదు. లవ్ ఫెయిల్యూర్ ఎమోషనల్ సీన్స్ రొటీన్ గానే అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా సింపుల్ గా తేల్చేసారు అనిపిస్తుంది. హీరో లవ్ స్టోరీతో పాటు, పెళ్లి కొడుకు లవ్ స్టోరీ ట్రాక్ కూడా నడిపించి ఆ రెండింటితో సెకండ్ హాఫ్ కాస్త ఆసక్తికర కథనంతో నడిపించారు. సరదాగా కాసేపు నవ్వుకోడానికి వెళ్ళాలి అనుకుంటే లగ్గం టైం చూడొచ్చు.
హీరోగా నటించిన రాజేష్ మేరు లవర్ బాయ్ గా బాగా చేసాడు. తెలుగమ్మాయి నవ్య చిట్యాల క్యూట్ గా అలరిస్తూనే నటనతో మెప్పించింది. సుదర్శన్ తన కామెడీతో సినిమాని బాగానే నడిపించాడు. ప్రణీత్ రెడ్డి, అరుణ్ కుమార్ అక్కడక్కడా నవ్విస్తారు. ప్రీతీ సుందర్, కేదార్ శంకర్, మధుమణి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుజాత, కిరణ్ మచ్చ, నీలా రమణ, పూజా సింఘ్వి, ప్రదీప్, మిర్చి కిరణ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
ప్లాట్ పాతదే అయినా స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకున్నాడు దర్శకుడు. దాంతో ప్రేక్షకులు ఒక ఫ్రెష్ మూవీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగుంది. సంగీతం కూడా బాగా కుదిరింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.
రేటింగ్: 3/5










