వ్యవస్థల్లోని కొందరి అండదండలతో తెలివిగా బ్యాంకులను మోసం చేయడం.. త ద్వారా లబ్దిపొంది… ఆ తరువాత విదేశాలకు చెక్కేయడం లాంటి ఉదంతాలు మనదేశంలో చాలానే రోజూ చూస్తుంటాం. ఇదేమీ ఇప్పుడు మొదలైంది కూడా కాదు. ఎప్పటి నుంచో మనదేశంలో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న తంతే. అలా 90’స్ లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని రాసుకున్న కథే… ‘లక్కీ భాస్కర్’. దూల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఈ రోజే దీపావళి కానుకగా మనముందుకు వచ్చింది ఎలావుందో చూద్దాం పదండి.
కథ: ముంబైలో మగధ అనే బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తుంటారు భాస్కర్(దూల్కర్ సల్మాన్). అతనికి సుమతి( మీనాక్షి చౌదరి) అనే భార్య… ఓ కుమారుడు ఉంటారు. చాలీ చాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. అదనపు ఆదాయం కోసం ఎన్ని పాట్లు పడినా… అప్పులు, లోన్లు చేయక తప్పదు. దాంతో మరింత అప్పుల్లో కూరుకుపోయి… ఎలాగైన ప్రమోషన్ సాధించి… దాని వల్ల పెరిగే జీతంతో తన భార్య, కుమారుడిని మరింత బాగా చూసుకోవాలని తపిస్తూ ఉంటారు. అయితే తన నిజాయతీని పక్కనబెట్టి… వేరేవాళ్లకు ప్రమోషన్ ఇవ్వడంతో భాస్కర్ డీలా పడిపోతాడు. బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఓ రెండు లక్షల క్యాష్ ను ఇల్లీగల్ బిజినెస్ కు ఉపయోగించి అందులో కమిషన్ తీసుకుని కొంత వరకు అప్పుల బాధల నుంచి రిలీఫ్ పొందుతాడు. అలా కమిషన్ వ్యాపారం మొదలు పెట్టి… చివరకు బ్యాంకులోని లొసుగులను ఉపయోగించుకుని షేర్ మార్కెట్లో కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి… వంద కోట్ల వైట్ మనీని మనీ ల్యాండరింగ్, హవాలా ద్వారా సంపాధిస్తాడు. నిత్యం ఒడుదొడుకుల మయంతో మధ్యతరగతి జీవితాన్ని లీడ్ చేసే భాస్కర్ ఒక్కసారిగా తన జీవన విధాన స్వరూపాన్ని మార్చుకుని కుబేరునిగా అవతారమెత్తుతాడు. మరి ఈ ‘లక్కీ భాస్కర్’ చట్టానికి దొరికాడా? లేక లొసుగులను ఉపయోగించుకుని దొరకకుండా బయటపడ్డాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: బ్యాంకులను దివాళతీయించి… షేర్ మార్కెట్లో అనేకమందిని ముంచిన హర్షద్ మెహతా గురించి ఈ దేశంలో తెలియని వాళ్లు వుండరు. 90‘స్ లో ఇదో పెద్ద సంచలనం. సామాన్యులకు తెలియకపోవచ్చు గానీ… విద్యావంతులకు, బడా పారిశ్రామిక వేత్తలకు ఈ స్కాం గురించి బాగా తెలుసు. అప్పట్లో భో ఫోర్స్ కుంబకోణాన్ని మరిపించిన ఈ స్కాంపై ఇటీవల ‘స్కాం92’ పేరుతో వెబ్ సిరీస్ కూడా వచ్చి… ప్రేక్షకాదరణ పొందింది. ఈ సిరీస్ లోనే లక్కీ భాస్కర్ కు సంబంధించిన ఓ పాయింట్ ను కూడా టచ్ చేశారు. దాన్ని మెయిన్ లీడ్ గా తీసుకుని యువ దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథ… దాని చుట్టూ ఎమోషన్స్ కూడి రాసుకున్న రేసీ స్క్రీన్ ప్లే… లక్కీ భాస్కర్ ను ఈ దసరాకి విన్నర్ ని చేసింది. సామాన్య ప్రేక్షకులకు సైతం షేర్ మార్కెట్లో అప్పట్లోనూ… ఇప్పట్లోనూ ఏమి జరుగుతుందో అరటి పండు ఒలిచిపెట్టినంత ఈజీగా దర్శకుడు ఇందులో చూపించారు. అలాగే మనం నిత్యం వినే హవాలా మనీ ఎలా చెలామణి అవుతుందో బ్రోకర్ల ద్వారా చక్కగా చూపించారు. నిత్యం మనం మనీల్యాండరింగ్ గురించి వింటూ వుంటాం. మనదేశంలోని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడంలో విదేశాల్లో వున్న షెల్ కంపెనీలు ఎలా ఉపయోగడపతాయో దాన్నీ చూపించారు. అలాగే మనదేశంలోనే బ్లాక్ మనీని వైట్ మనీగా లాటరీ ద్వారా ఎలా మార్చుకోవచ్చునో కూడా చూపించి ఆడియన్స్ ఎక్కడా కన్ ఫ్యూజ్ కాకుండా తను అనుకున్న సబ్జెక్టును చక్కగా తెరమీద ఆవిష్కరించారు. బహుశా ఇటీవల కాలంలో ఇలాంటి సబ్జెక్టును ఎవరూ ఇంత బాగా హ్యాండిల్ చేసుండరు. అలాగే ఇక్కడ మోసాలు చేసి విదేశాలకు ఎలా పారిపోయి స్థిరపడాలి.. మనదేశంలో ఉండే పోర్టుల్లో కస్టమ్స్ అధికారుల చేతివాటం తదితర విషయాలన్నీ చాలా కూలంకషంగా ఇందులో చూపించారు. ఇందులో హీరో ఎలివేషన్స్, డ్యాన్సులు లేకపోయినా… అంతుకు మించి విజిల్స్ వేసేలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
భాస్కర్ పాత్రలో దూల్కర్ సల్మాన్, సుమతి పాత్రలో మీనాక్షి చౌదరి ఒదిగిపోయి నటించారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాధలను కళ్లకు కట్టేలా చూపించారు. ముఖ్యంగా ఎమోషన్స్ ఇందులో బాగా పండించారు. రాంకీ తక్కువ సేపే కనిపించినా తన పాత్రకు వెయిట్ తీసుకొచ్చాడు. రాజ్ కుమార్ కసిరెడ్డి సాంబాగా హీరో ఫ్రెండు పాత్రలో కనిపించారు. సీరియస్ గా సాగే సినిమాలో అతను అక్కడక్కడా కొంచెం కామెడీ టచ్ ఇచ్చాడు. ఆదిత్య 369లో ప్రొఫెసర్ పాత్రలో నటించిన టిను ఆనంద్ మనకు బాగా గుర్తు అతను.. సచిన్ ఖేద్కర్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మాగంటి శ్రీనాథ్… హైపర్ ఆది పాత్రలూ బాగా వున్నాయి. బ్యాంకు ఎంప్లాయిగా యాంకర్ గాయత్రి భార్గవి పాత్ర కూడా చివరిదాకా ఉంటుంది. అలాగే కమెడియన్ శివన్నారాయణ, వడ్డీ వ్యాపారిగా చౌదరి పాత్రలూ బాగా కుదిరాయి. సీనియర్ నటి సుధ పాత్ర హీరోయిన్ తల్లిగా ఓకే. సీబీఐ అధికారి పాత్రలో సాయికుమార్ పర్వాలేదు. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు వెంకీ అట్లూరి తను రాసుకున్న కథ… కథనాలను ఎక్కడా డీవియేట్ కాకుండా తెరమీద ఆవిష్కరించారు. దాంతో సినిమాకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. సినిమాకి బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ అదనపు బలం. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు బీజీఎం బాగా ఉపయోగపడింది. సినిమాటోగ్రఫీ బాగుంది. దానికి అనుగుణంగా ఆర్ట్ వర్క్ కూడా యాప్ట్ గా వుంది. రెండున్నర గంటలు రన్ టైం అయినా… ఎడిటింగ్ ఎక్కడా ల్యాగ్ అనిపించదు. నిర్మాత నాగవంశీ ఖర్చకు వెనుకాడకుండా… బాంబే సెటప్ లో సినిమాని ఎంతో రిచ్ గా నిర్మించారు. మరోసారి తన టేస్ట్ ఏంటో ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకున్నారు. ఈ వారం సరదాగా ఫ్యామిలీతో చూసేయండి.
రేటింగ్: 3.5