సినిమాకి ప్రమోషన్ చాలా ముఖ్యం. నేను – కీర్తన సినిమాకి పెద్ద బడ్జెట్టు సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇటీవల ప్రమోషన్స్ చేశారు. ప్రచార చిత్రాల మొదలుకొని… టీజర్, ట్రైలర్లతో సినిమాపై మంచి బజ్ ను పెంచారు. స్వయంగా కథ – మాటలు – స్క్రీన్ ప్లే సమకూర్చుకుని.. చిమటా రమేష్ బాబు డైరెక్టర్ కమ్ హీరోగా చేసిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాన్ స్టాప్ ఎంటర్’టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ: జానీ(చిమటా రమేష్) ఎవరైనా ఆపదలో ఉంటే ఇట్టే వాలిపోతాడు. అన్యాయాన్ని ఎదిరించి అభాగ్యులకు అండగా నిలుస్తూ… తన మిత్రులతో కలిసి తనకు తోచిన సహాయం చేస్తూ ఉంటారు. అలాంటి జానీకి కీర్తనతో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతూ వుంటారు. ఉన్నపళంగా కీర్తన తన సొంత గ్రామానికి వెళ్ల అక్కడ ఉన్న పెద్ద స్వామి(విజయరంగరాజు)ను చట్టబద్దంగా శిక్షించడానికి కొన్ని ఆధారాలు సేకరించడానికి వెళుతుంది. అయితే తను ఇష్టపడిన అమ్మాయి అలా వెళ్లడం తెలుసుకున్న జానీ… ఆమె ఆపదలో వుంటే కాపాడుతాడు. ఆమె ఎందుకు పెద్ద స్వామిని చట్టబద్దంగా శిక్షించాలని అనుకుంటుందో తెలుసుకుంటాడు. అదే సమయంలో తనకి కూడా పెద్ద స్వామి వల్ల కలిగిన నష్టాన్ని తెలుసుకుంటాడు. ఇలా ఇద్దరూ… రివేంజ్ ను పెద్ద స్వామిపై ఎలా తీర్చుకున్నారు? ఆ ఫ్లాష్ బ్యాక్ కథా కమామీషు ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
కథ.. కథనం విశ్లేషణ: తన కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఆపదలో ఉండి, తన సాయం అర్ధించేవారి కోసం ప్రాణాలు పణంగా పెట్టి అరాచకాలకు ఎదురొడ్డే ఓ మాస్ యువకుని కథ ఇది. జానీ జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి ప్రవేశించాక… అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది. ఆ తరువాత విలేజ్ బ్యాక్ డ్రాప్ వచ్చే మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా వున్నాయి. ఇంటర్వెల్ తరువాత వచ్చే ట్విస్ట్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. “మల్టీ జోనర్ ఫిల్మ్”గా ప్రచారం చేసిన ఈ చిత్రంలో నిజంగానే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ బ్యాలన్స్ చేసిన తీరు అభినందనీయం. అయితే… ఒక చిన్న సినిమాలో ఇన్ని జోనర్స్ మిక్స్ చేయడం అవసరమా అని అక్కడక్కడా అనిపించినా… కథ మలుపులు తిరిగేకొద్దీ రక్తి కట్టిస్తుంది.
నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది హీరో రమేష్ బాబు గురించి. వంకలు పెట్టడానికి వీలులేని నటనతో ఆద్యంతం ఆకట్టుకున్న రమేష్ బాబు… పోరాటాలు, నృత్యాల్లో కూడా రాణించాడు. ముఖ్యంగా ఇది అతనికి డెబ్యూ ఫిల్మ్ అంటే నమ్మలేనంత నేచురల్ గా నటించి మంచి మార్కులు స్కోర్ చేశాడు. కాకపోతే, రైటర్, డైరెక్టర్ కూడా తనే అయిన రమేష్ బాబు… పెద్ద హీరోలకయితే బ్రహ్మాండంగా పేలే డైలాగ్స్ రాసుకున్నాడు. అలాగే యాక్షన్ బ్లాక్స్ కూడా. విజయ రంగరాజు, జీవాల విలనీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? బ్రహ్మాండంగా రక్తి కట్టించారు. జబర్దస్త్ అప్పారావు కామెడీ బాగానే పండింది. కొత్తవాళ్ళయినా హీరోయిన్లు రిషిత, మేఘన తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. రేణు ప్రియ ఐటమ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా అసహజత్వానికి, తావు లేకుండా చక్కగా నటించారు.
దర్శకుడిగా మంచి మార్కులు స్కోర్ చేసిన రమేష్ బాబు… రైటర్ గా ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ మరీ హెవీ అయ్యాయేమో అనిపిస్తుంది. అలాగే… ముందే చెప్పుకున్నట్టు ఒక సినిమాలో అన్ని జోనర్లు చొప్పించడం అవసరమా అనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్ గానే ఉన్నా… ల్యాగ్ అనిపించకుండా సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే మరింత బాగుండేది. బడ్జెట్ పరిమితులు దృష్టిలో పెట్టుకుంటే కెమెరా వర్క్ చాలా బాగున్నట్లే. ఎం.ఎల్.రాజా బాణీలు, ముఖ్యంగా నేపధ్య సంగీతం చాలా బాగుంది. ప్రధాన తారాగణం పెర్ఫార్మెన్స్, కులు మనాలిలో చిత్రీకరించిన పాట, పోరాటాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం మాస్… క్లాస్ ఆడియన్స్ ను అలరిస్తుంది. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్ : 3/5










