తెలంగాణలోని ఓ మారుమూల పల్లెటూళ్ళో ఓ 15 ఏళ్ళ క్రితం నిజంగా అజరిగిన కథ అంటూ రాజు వెడ్స్ రాంబాయి సినిమాని బాగానే ప్రమోట్ చేసారు. ఈ సినిమాలో ఒక సాంగ్ పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాకు మంచి హైప్ నెలకొంది. మరి ఈ రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ: 2010లో ఓ పల్లెటూరులో తండ్రి హైదరాబాద్ వెళ్లి పని చేసుకో అన్నా వినకుండా రాజు(అఖిల్) ఊళ్ళోనే బ్యాండ్ కొడుతూ జీవిస్తుంటాడు. అదే ఊళ్ళో ఉన్న రాంబాయి(తేజస్వి)ని ఎప్పట్నుంచో ప్రేమిస్తాడు కానీ చెప్పడానికి భయం. ఈ విషయం రాంబాయికి తెలిసినా సైలెంట్ గా ఉంటుంది. ఓ రోజు డేర్ చేసి రాజు రాంబాయికి ప్రపోజ్ చేస్తాడు. రాంబాయి రాజు ప్రేమని చూసి ఓకే చెప్తుంది. రాంబాయి తండ్రి వెంకన్న(చైతూ జొన్నలగడ్డ) అవిటివాడు. హాస్పిటల్ లో గవర్నమెంట్ జాబు చేస్తూ తన కూతురికి కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.
రాజు రాంబాయి ప్రేమలో ఓ సారి గొడవ రావడంతో రాజు ఏకంగా రాంబాయి ఇంటికి వెళ్లి ఆమెను కొడతాడు. ఈ విషయం ఊళ్లో అందరికి తెలియడంతో వెంకన్న రాజు ఇంటి మీదకు గొడవకు వస్తాడు. ఈ ఘటన తర్వాత రాజు తండ్రి చనిపోతాడు. మరి రాజు – రాంబాయి లవ్ స్టోరీ ఏమైంది? వెంకన్న ఏం చేసాడు అనేది మిగతా కథ.
విశ్లేషణ:క్లైమాక్స్ ఊహించలేరు, ఈ కథ బయటకు రాలేదు, ఈ కథని సమాధి చేసారు అని ఈ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ ఇవ్వడంతో పాటు ఈ సినిమాలో సాంగ్ పెద్ద హిట్ అవ్వడంతో రాజు వెడ్స్ రాంబాయిపై అంచనాలు బాగానే వచ్చాయి. ఫస్ట్ హాఫ్ అంతా క్యూట్ లవ్ స్టోరీ, ఫ్రెండ్స్ తో కామెడీ సీన్స్ తో సాగుతుంది. 2010 లో కథ కాబట్టి అప్పటి జనరేషన్ ఈ కథకు కనెక్ట్ అవుతారు. అప్పట్లో లవర్స్, ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్లు అని బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది.
ఇంటర్వెల్ ముందు హీరో తండ్రి చనిపోవడంతో, హీరోయిన్ ఇంట్లో ఈ ప్రేమ విషయం తెలియడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీశారు. హీరో – హీరోయిన్స్ మధ్య ప్రేమ సన్నివేశాలు, హీరోయిన్ తండ్రి విలనిజం చూపించడం సీన్స్ తో సాగుతుంది. క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు అని ముందు నుంచి ఊదరగొట్టారు కానీ సినిమా చూసాక ఇంతేనా, ఇలా కూడా చేస్తారా అని అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి వార్తలు గతంలో చూసాం కాబట్టి.
ఇక క్లైమాక్స్ వీర లెవల్లో ఎమోషన్ ఉంటుంది అనుకుంటాము వాళ్ళు బాగానే ట్రై చేసినా ఆ ఎమోషన్ ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వదు. ఇదే ట్విస్ట్ సినిమాకు అని అనుకోవడమే. ఇది కూడా ఒక పరువు హత్య లాంటి రొటీన్ సినిమానే అనిపిస్తుంది. కాకపోతే చివర్లో వచ్చే ట్విస్ట్ కోసం సినిమా అంతా నవ్విస్తూ సాగదీస్తూ లవ్ స్టోరీతో నడిపించారు. సినిమాలో అడల్ట్ సీన్స్ అని చెప్పలేం కానీ ఆ ఫీల్ వచ్చేలా బోల్డ్ గా కొన్ని సీన్స్ కామెడీ కోసం పెట్టారు అవి అవసరమా అనిపిస్తుంది.
హీరో ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాడు. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సెకండ్ హాఫె లో పెట్రోల్ బంక్ సీన్స్ కథకు సంబంధం లేకపోయినా ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. హీరో మాటి మాటికీ WWE లో డైలాగ్ చెప్తూ ఉంటాడు. సీరియస్ గా కథ సాగుతున్న దగ్గర కూడా ఆ డైలాగ్ చెప్పి ఆ సీన్ ఇంపాక్ట్ ని చెడగొట్టాడు అనిపిస్తుంది. 2010 లో క్యూట్ ప్రేమ కథలు గుర్తుచేసుకోడానికి, కాస్త నవ్వుకోడానికి, ఒక రకమైన కొత్త పరువు హత్య సినిమాని చూడటానికి వెళ్లొచ్చు.
కొత్త అబ్బాయి అఖిల్ బాగానే నటించాడు కానీ కొన్ని చోట్ల ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. తేజస్వి మాత్రం సింపుల్ గా గ్రామీణ యువతి పాత్రలో అదరగొట్టేసింది. ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. వెంకన్న పాత్రలో అవిటివాడిగా చైతూ జొన్నలగడ్డ బాగా కష్టపడి విలనిజం పండించాడు. ఇండస్ట్రీకి మరో విలన్ దొరికాడు అనుకోవచ్చు. శివాజీ, అనిత చౌదరి.. మిగిలిన నటీనటులు వారి పాత్రలో బాగానే మెప్పించారు. రాజు ఫ్రెండ్ డాంబర్ పాత్ర చేసిన నటుడు బాగా నవ్వించాడు.
సినిమా అంతా పల్లెటూళ్ళో తీయడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ అందంగా చూపించారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. చాలా సీన్స్ ని సురేష్ బొబ్బిలి తన మ్యూజిక్ తోనే పైకి లేపాడు. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎవరికీ తెలియని కథ చెప్తున్నాను అని దర్శకుడు ప్రచారం చేసినా రెగ్యులర్ లవ్ స్టోరీకి చివర్లో ఆ యదార్థ కథని జతచేసి తెరకెక్కించాడు. నిర్మాణపరంగా మంచి అవుట్ పుట్ రావడానికి కావాల్సినంత ఖర్చుపెట్టారు అని తెలుస్తుంది. రాజు వెడ్స్ రాంబాయి యదార్థ కథతో తీసిన కొత్త ప్రేమకథ విత్ సరికొత్త క్లైమాక్స్. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3









