ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్న తొలి సినిమా ‘సర్కారు నౌకరి’. ఈ చిత్రాన్ని దర్శకకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మించారు. భావన అనే అమ్మాయి హీరోయిన్ గా నటించారు. పి.సి.శ్రీరామ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసి ఇటీవల పంచతంత్ర కథలు తీసిన శేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తన తొలి చిత్రంతో సింగర్ సునీత కుమారుడు ఆకాశ్… ఏమాత్రం ఆకట్టుకున్నాడో చూద్దాం పదండి.
కథ: గోపాల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఓ చిరుద్యోగి. దాంతో అతనికి సత్య(భావన) అనే అమ్మాయితో వివాహం జరుగుతంది. ఇద్దరూ గ్రామీణ ప్రాంతమైన కొల్లాపూర్ లో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఇంతలో భార్య సత్య… గర్భవతి అవుతుంది. అయితే… క్రమంగా తన భర్త ఆరోగ్యశాఖలో ఏమిచేస్తున్నాడో ఇరుగుపొరుగు ద్వారా తెలుస్తుంది. దాంతో ఆమె ఆ ఉద్యోగాన్ని అవమానకరంగా ఫీలై… ఉద్యోగాన్ని వదిలేయమని భర్తకు చెబుతుంది. అయితే భర్త మాత్రం అది ప్రభుత్వం ఉద్యోగం కావడం… దానివల్ల కొంత మంది ఆరోగ్యాలను కాపాడటానికైనా ఉపయోగపడుతోందనే ఉద్దేశంతో అందుకు ససేమిరా అంటాడు. దాంతో భార్య… భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోతుంది. మరి అలా వెళ్లిన భార్య తిరిగొచ్చిందా? అసలు గోపాల్ చేసే ఆ ‘సర్కారు నౌకరి’ ఏమిటి? ఎందుకు ఆ నౌకరికి అంత ప్రాధాన్యం ఇచ్చాడు? చివరకు అతడు చేసిన నౌకరి ద్వారా ఏమి మెసేజ్ ఇచ్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లషణ: 90’s లో చాలా రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా కృషి చేసింది. ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలాంటి అత్యధిక జనాభా వున్న దేశాలకు సంపన్న దేశాల నుంచి ప్రత్యేక నిధులను కూడా కేటాయించి… ప్రజల ఆరోగ్యాన్ని కాపడానికి కృషి చేసింది. తెలిసో తెలియక క్షణికావేశానికి లోనైన కొంత మంది ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి భారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలను గ్రామీణ ప్రాంతాల్లో చాలానే చూశాం. అలాంటి ప్రాణాంతకమైన వ్యాధుల భారిన పడకుండా కొన్ని నివారణ చర్యలు తీసుకుంటే… జీవితం సుఖంగా ఉంటుందనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో గుండె బరువెక్కే చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. తొంబైవ దశకంలో గ్రామీణ ప్రాంతాల్లోనే కొంత మంది పేదలు, యువత ఎలా ఈ వ్యాధికి బలయ్యారనేదాన్ని చాలా హృద్యంగా చూపించారు. ఎక్కడా వల్గారిటీ లేకుండా… లైటర్ వేలోనే చెప్పాల్సిన అంశాలను చాలా బాగా చెప్పారు. అంతుకు తగ్గట్టుగానే కథ… కథనాలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇదొక రియల్ ఇన్స్ డెంట్ బేస్ స్టోరీ కాబట్టి… సినిమాలో పాత్రలన్నీ బాగా ఆకట్టుకుంటాయి.
సర్కారు నౌకరి చేసే యువకునిగా ఆకాశ్ బాగా ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ చాలా బాగా పలికించారు. అతనికి జంటగా నటించిన భావన కూడా గ్రామీణ యువతి పాత్రలో మెప్పించింది. గ్రామ సర్పంచి పాత్రలో తనికెళ్ల భరణి ఆకట్టుకున్నాడు. హీరో స్నేహితుని పాత్రలోనూ, అతనికి జంటగా నటించిన అమ్మాయి పర్వాలేదనిపించారు. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు శేఖర్… మరోసారి ఓ మెసేజ్ ఓరియంటెడ్ మూవీని తెరకెక్కించారు. ఓ బరువైన సబ్జెక్ట్ ను ఎంచుకుని… చాలా హృద్యంగా మూవీని తెరక్కించారు. గతంలో పంచతంత్ర కథలు పేరుతో ఓ వైవిధ్యమైన ఐదు కథలను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా సర్కారు నౌకరి పేరుతో మరో మెసేజ్ సినిమాను తీశారు. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3