హీరో నితిన్ కు హిట్ లేక చాలా కాలమే అయింది. కొద్దినెలల క్రితం విడుదల అయిన రాబిన్ హుడ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో నితిన్ కూడా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. గతంలో చేసిన తప్పులు చేయనని.. ఇక నుంచి మంచి సినిమాలే చేస్తానని ప్రకటించాడు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు అయితే గత కొన్ని రోజులుగా ఈ తమ్ముడు సినిమాకు ఎంత హైప్ తీసుకురావాలో అంతా ప్రయత్నించారు. తమ్ముడు సినిమాతో నితిన్ ఇక హిట్స్ బాట పడుతాడు నమ్మండి అన్నంత ధీమా చూపించాడు. మరి ఈరోజు విడుదల అయిన తమ్ముడు వాళ్ళ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం పదండి.
కథ విషయానికి వస్తే…. ఒక ఫ్యాక్టరీ లో పేలుడు…ఈ పేలుడు కేసు నుంచి తప్పించుకునేందుకు రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చి తప్పించుకున్న యజమాని.. నిజాయతీపరురాలు అయిన అధికారిని దారికి తెచ్చుకునేందుకు వేసే ఎత్తుగడలతోనే సినిమా అంతా సాగుతుంది.
అక్క ఇచ్చిన మాట మీద నిలబడేందుకు తమ్ముడు చేసిన సాయం ఏంటి… చిన్నప్పుడే అక్కకు దూరమైనా తమ్ముడిని ఆమె తిరిగి అక్కున చేర్చుకుందా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ.
నితిన్ అక్కగా ఈ సినిమాలో లయ నటించింది. ఆమె చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది అనే చెప్పాలి. నితిన్ కు జోడిగా వర్ష బొల్లమ్మ నటించినా వీళ్ళ మధ్య పెద్దగా లవ్ ట్రాక్ ఏమి లేదు. మరో కీలక పాత్రలో కనిపించిన సప్తమి గౌడ రోల్ మాత్రం కాస్త వెరైటీ గా ఉంది అనే చెప్పాలి. ఒక జాతరకు వెళ్లి వచ్చే సమయంలో ఫ్యాక్టరీ ప్రమాదంపై తుది నివేదిక ఇవ్వాల్సిన లయ ఫ్యామిలీ ప్రమాదంలో చిక్కుకున్న సమయంలో వచ్చే ఫైట్ సీన్స్… మాస్ ను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన సౌరభ్ సచ్ దేవకు ఉండే సమస్య… దాన్ని చూపించిన విధానం కొత్తగా ఉంది. ఓవరాల్ గా తమ్ముడు.. మాస్ ను మెప్పిస్తాడు. అజనీష్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. వేణు శ్రీరామ్ రాసుకున్న ప్లాట్ బాగుంది. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా రాసుకుని ఉండాల్సింది. నితిన్ తన పాత్రకి న్యాయం చేశాడు.
ఈ వారం సరదాగా చూసేయండి.
రేటింగ్: 3