విజయ్ సేతపతి సినిమాలకి తెలుగులో మంచి క్రేజ్ ఉంది.. అందుకే గత ఏడాది విడుదల పేరుతో వచ్చిన. దర్శకుడు వెట్రిమారన్ తీసిన సినిమాని విపరీతంగా ఆదరించారు. ఇందులో సేతుపతి పాత్ర కొంతనే వున్నా జనాలు బాగానే ఆదరించారు… ఇప్పుడు దానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన సినిమా.. విడుదల-2. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వెట్రిమారన్ రూపొందించిన ఈ చిత్రం.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పార్ట్ -1 లో నటుడు సూరి హీరో కాగా… ఇందులో(పార్ట్ -2)సేతుపతి ప్రధాన భూమిక పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: పీడిత వర్గాల పక్షాన ప్రభుత్వానికి వ్యతిరకంగా పోరాడిన నక్సలైట్ నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి) ను చివరికి ఓ పోలీసులు పట్టుకుంటారు. అయితే కొంత మంది పోలీసులు, పై అధికారులు అతని అరెస్ట్ ను సీక్రెట్ గా వుంచుతారు. అతన్ని కొంతమంది ఎన్ కౌంటర్ చేయాలని, మరి కొంత మంది కోర్టులో శిక్ష వేయించాలని ప్లాన్స్ వేస్తుంటారు. ఈ క్రమంలో అతడు పోలీసుల అదుపులో వున్నాడని మీడియా ద్వారా బయటకు పొక్కుతుంది. దాంతో పోలీసులు పెరుమాళ్ తమ ఆధీనంలోనే వున్నాడని చెబుతారు. అయితే ఇంతలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య పెరుమాళ్ పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. అలా తప్పించుకున్న పెరుమాళ్ పోలీసులకు పట్టుబడ్డాడా? అతన్ని పట్టుకోవడం కోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏమి చేసింది? ఒక స్కూల్ మాష్టారు పేరు మోసిన నక్సలైట్ నాయకుడిగా ఎలా ఎదిగాడు? అందుకు పురిగొల్పిన పరిస్థితులు ఏంటి? చివరికి అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా వుందంటే….?
నక్సలైట్లు చురుగ్గా ఉన్న 90వ దశకంలో ఇలాంటి నక్సలైట్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు బాగా ఆడాయి.. ఒసేయ్ రాములమ్మ, ఎర్ర సైన్యం, చీమలదండు, సింధూరం, పీపుల్స్ ఎన్ కౌంటర్.. ఇలా చెబుతూ పోతే చాలా సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. అయితే ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం సన్నగిల్లింది. ఈ జనరేషన్ కి ఇది కొత్త జానర్. అందుకే ఎంతో ఎమోషనల్ గా తీసిన వేణు ఉడుగుల విరాట పర్వం నిరాశ పరిచింది. అయితే విడుదల పార్ట్ 1,2 లో విజయ్ సేతుపతి వుండటం, అందులోనూ వెట్రి మారన్ దర్సకత్వం అంటేనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వుంది. దాంతో పార్ట్-1 విజయం సాధించింది. ఇప్పుడు పార్ట్ 2 రూపంలో ప్రీక్వెల్ వచ్చింది. ఇందులో ఎక్కువగా ఉపాధ్యాయుడిగా వున్న పెరుమాళ్ నక్సలైట్ ఉద్యమ నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది ఎమోషనల్ గా చూపించారు. ఒక నక్సలైట్ నాయకుడి కథను ఎంతో రియలిస్టిగ్గా.. లోతుగా చూపించిన చిత్రమిది. నక్సలైట్లు-ప్రభుత్వం మధ్య ఘర్షణను చాలా బలంగా తెరపై ప్రెజెంట్ చేశాడు వెట్రిమారన్. ‘విడుదల-2’ గొప్ప సినిమా అనడంలో సందేహం లేదు.
వెట్రిమారన్ సినిమాలంటేనే అద్భుతమైన పెర్ఫామెన్సులు చూడొచ్చు. ఇక విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటుడు తన సినిమాలో నటిస్తే ఇక చెప్పేదేముంది? ఎక్కడా రవ్వంత కూడా అతి చేయకుండా పాత్రకు తగ్గట్లుగా అద్భుతంగా నటించాడు సేతుపతి. నటిస్తున్నట్లు అనిపించకుండా పాత్రకు తగ్గట్లు బిహేవ్ చేయడంలోనే తన ప్రత్యేకత తెలుస్తుంది. మంజు వారియర్ కూడా గొప్పగా నటించింది. సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ తనదే. సూరి మరోసారి మెప్పించాడు. ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. రాఘవేందర్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ పాత్రలో చేసిన నటుడు పార్ట్-1లో మాదిరే అదరగొట్టేశాడు. ఆముదన్ పాత్రలో చేసిన నటుడు కూడా బాగా నటించాడు. కిషోర్.. గౌతమ్ మీనన్.. చీఫ్ సెక్రటరీ పాత్ర పోషించిన అతను, మిగతా నటీనటులంతా వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
‘విడుదల-2’లో సాంకేతిక నిపుణులందరూ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. ఇళయరాజా.. పాటలతో పాటు నేపథ్య సంగీతంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన తన బాణీ చూపించిన చిత్రమిది. వేల్ రాజ్ ఛాయాగ్రహణం సూపర్బ్. ఈ వింటేజ్ కథకు ఎంచుకున్న కలర్ థీమ్ ఒకేసారి మనల్ని గతంలోకి తీసుకెళ్లిపోతుంది. ఒక డిఫరెంట్ మూడ్ క్రియేట్ చేసి ఈ కథను నరేట్ చేసింది వెట్రిమారన్-వేల్ రాజ్ జోడీ. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. వెట్రిమారన్ మరోసారి రచయితగా.. దర్శకుడిగా తనేంటో చూపించాడు. తెలుగులో నిర్మాత రామారావు చింతపల్లి ఎంతో క్వాలిటీగా అనువాద కార్యక్రమాలు చేసి విడుదల చేసారు. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3