భారీ జన సందోహం మధ్య కోలాహలంగా నామినేషన్ దాఖలు చేసిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్
తెలంగాణ సంప్రదాయ పండగలైన బతుకమ్మ, బోనాల సందడి, మహిళల కళాకారుల నృత్యాలు మరియు కోయ జాతుల డ్రమ్స్… కార్యకర్తల కోలాహలంతో భారీ జనసందోహం మధ్య శుక్రవారం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మొదట యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ నుంచి శ్రీనగర్ కాలనీ మీదుగా భారీ ఊరేగింపుగా… షేక్ పేట్ తాసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.సాయిరాంకు రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.
ఆయనతో పాటు సీనియర్ నేత వి.హనుమంత రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కాంగ్రెస్ నాయకురాలు హబీబా సుల్తానా ఉన్నారు. అంతకు ముందు నిర్వహించిన భారీ ర్యాలీలో మాజీ ఎంపీ అజహరుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కార్పొరేటర్లు సి.ఎన్ రెడ్డి, సంగీత యాదవ్ తదితరులు పాల్గొన్నారు, చివర్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వచ్చి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించడం కొసమెరుపు.









