ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘పతంగ్’ సినిమా ఒకటి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో తెరకెక్కింది. యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషన్ సినిమాస్, మాన్ సూన్ టేల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో ఇన్ స్టాగ్రమ్ ఫేం ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించగా.. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, గాయకుడు ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు. మరి పతంగ్ ల పోటీ మీద తెరకెక్కిన ఈ చిత్రం ఎలావుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ: విస్కీ(వంశీపూజిత్), అరుణ్(ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. విస్కీ బస్తీ కుర్రాడు. పానీ పూరి బండి నడుపుతూ వుంటాడు. అరుణ్ ఉన్నతస్థాయి కుటుంబంలో పుట్టి అమెరికాలో సెటిల్ అవ్వాలనే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కుర్రాడు. విస్కీ… ఐశ్వర్య(ప్రీతి పగడాల)తో పరిచయం పెంచుకుంటాడు. అది ప్రేమగా మారుతుంది. అదే సమయంలో అరుణ్ కూడా ఐశ్వర్యకు పరిచయం అవుతాడు. ఒక సందర్భంలో ఐశ్వర్యకు అండగా వుండి పోలీస్ స్టేషన్ కు సైతం వెళతాడు. అలా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఐశ్వర్య కూడా అరుణ్ అంటే ఇష్టపడి.. విస్కీకి బ్రేకప్ చెబుతుంది. దాంతో విస్కీ, అరుణ్ ల మధ్య వైరం పెరుగుతుంది. ఒకరినొకరు ద్వేషించుకుంటారు. అయితే ఐశ్వర్యను దక్కించుకోవాలంటే… పతంగుల పోటీలో గెలిచి చూపించాలని నిర్ణియించుకుంటారు. ఈ పోటీలను కాలనీలో వుండే పెద్దమనిషి(వడ్లమాని శ్రీనివాస్) సమక్షంలో… స్పాన్సర్స్ సహాయంతో ఘనంగా నిర్వహిస్తారు. మరి ఈ పోటీలు విస్కీ టీం గెలిచిందా? అరుణ్ టీమ్ గెలిచిందా? చివరకు ఐశ్వర్య ఎవరిని వివాహం చేసుకుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: స్పోర్ట్స్ డ్రామా నేపథ్యం వున్న సినిమాలు క్లైమాక్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను ఎగ్జైటింగ్ గా తెరమీద ఆవిష్కరించగలిగితే చాలు… ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవచ్చు. పతంగ్ పోటీల నేపథ్యంలో ఇప్పటి వరకూ సినిమాలు రాలేదు. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాను కూడా వెండితెరమీద రక్తికట్టించవచ్చని చిత్ర దర్శకుడు నిరూపించాడు. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా బాగా ఆడుతుందని కితాబు కూడా ఇచ్చాడంటే… ఈ సినిమాలో కంటెంట్ అంత స్ట్రాంగ్ గా వుందనేది సినిమా చూసిన ఆడియన్స్ కు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ కామెడీతో ఎంటర్టైన్ చేసిన దర్శకుడు… ద్వితీయార్థంలో పతంగ్ ల స్పోర్ట్స్ డ్రామాతో నడిపించి ఆడియన్స్ ను అలరించాడు. ఇప్పటి వరకు క్రికెట్, ఫుట్ బాల్, హాకీ, కబడ్డీలాంటి పోటీలనే సెల్యులాయిడ్ పై చూసుంటాం. ఈ చిత్రంలో మాత్రం పతంగ్ ల పోటీలను తొలిసారి చూపించి… ప్రేక్షకులకు కొత్త గేమ్ ను పరిచయం చేసింది చిత్ర యూనిట్. కేవలం సంక్రాంతి సమయంలో మాత్రమే గల్లీల్లోనూ, మైదానాల్లోనూ పతంగ్ లను సరదాగా ఎగురవేయడం చూసుంటాం. ఇందులో పోటీలను ఎలా నిర్వహించుకోవచ్చనేది దర్శకుడు బాగా రీసెర్చ్ చేసి తెరమీద చూపించినట్టు మనకు అర్థమవుతుంది.
ఇందులో నటించిన లీడ్ రోల్స్ అన్నీ బాగా మెప్పిస్తాయి. బస్తీ కుర్రాడిగా వంశీ పూజిత్ బాగా ఆకట్టుకుంటాడు. అతని డైలాగ్ డెలివరీ బాగుంది. ప్రణవ్ కౌశిక్ పాత్ర కూడా ఆల్ట్రామెడ్రన్ కుర్రాడిగా బాగా నటించారు. జీఆర్ఈ రాసి… అమెరికాలో స్థిరపడాలే తల్లిదండ్రుల చాటు బిడ్డగా మెప్పించారు. ప్రీతి పగడాల పాత్ర ఈ చిత్రంలో హైలైట్. సినిమా మొత్తం ఆమె వర్షన్ లోనే నడిపించాడు దర్శకుడు. తన పాత్రకు న్యాయం చేసింది. చివర్లో మ్యాచ్ రిఫరీ పాత్రలో విష్ణు ఓజే కూడా తన కామెడీ కామెంట్రీతో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నటించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, గాయకుడు ఎస్పీ చరణ్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి ఓ సరికొత్త స్పోర్ట్స్ డ్రామాను చూపించి సక్సెస్ అయ్యారు. ప్రధాన పాత్రలన్నీ కొత్తవారితో చేయించినప్పుడు ఏదైనా కొత్తదనం చూపిస్తేగానీ ఆడియన్స్ థియేటర్ కు రారని దర్శకుడు బాగా గ్రహించినట్టున్నారు. అందుకే ఇలాంటి సరికొత్త పతంగ్ ల పోటీ నేపథ్యాన్ని ఎంచుకుని సినిమాను ఆద్యంతం రక్తికట్టించారు. ఈ చిత్రానికి నేపథ్యం సంగీతం కూడా బాగా కుదరింది. యూత్ ఫుల్ సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఎంతో క్వాలిటీగా సినిమాను నిర్మించారు. సరదాగా ఈసినిమాను ఓసారి చూసేయండి.
రేటింగ్: 3










