రామ్ నగర్ బన్నీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్… ఇప్పుడు ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో అతని సరసన మేఘన ముఖర్జీ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రాన్ని సంపత్ వి. రుద్ర దర్శకత్వంలో గేదె చందు, గాయత్రి చిన్ని సంయుక్తంగా నిర్మించారు. రొమాంటిక్ గ్రామీణ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రెండో సినిమాతో చంద్రహాస్ ఏమాత్రం ఆకట్టుకున్నాడో చూద్దాం పదండి.
కథ: అదిలాబాద్ జిల్లాలో ఉండే ఓ మారుమూల గ్రామం రుద్రవరం. ఆ గ్రామంలో ధర్మాన, కర్మాన అనే రెండు వర్గాల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం వుంటుంది. అయితే కర్మాన వర్గానికి చెందిన ఆ ఊరి సర్పంచ్ (మురళీధర్ రావు) కూతురు బుజ్జిమ(మేఘన ముఖర్జీ), అదే గ్రామానికి చెందిన ధర్మాన వర్గానికి చెందిన చందు (చంద్రహాస్) ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. వీరిద్దరూ ప్రేమించుకుని… పెద్దలు ఒప్పుకోక పోవడంతో… పెళ్లి చేసుకోవడానికి కేరళకు పారిపోతారు. అయితే అక్కడ ఓ సంఘటనను చూసిన ఈ ప్రేమ జంట… ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని గ్రామానికి తిరిగి వస్తారు. ఇలా వచ్చిన ప్రేమ జంటను ఆగ్రామస్తులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఉప్పు – నిప్పుగా ఉండే ఆ రెండు వర్గాల ప్రజలను ఈ ప్రేమజంట ఎలా ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వర్గ విభేదాలు… పట్టింపులు,,. కక్ష్యలు కార్పణ్యాల నేపథ్యాలతో చాలా సినిమాలు చూసినా… ఈ సినిమా మాత్రం ఇప్పుడు చూస్తున్న కాంటెంపరరీ ఇష్యూస్ ను బేస్ చేసుకుని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీలో కాలేజీలో రెండు వర్గాల స్టూడెంట్స్ మధ్య జరిగే ఘర్షణలు… ఈ నేపథ్యంలోనే హీరో హీరోయిన్ మధ్య సాగే లవ్ ట్రాక్ కాస్తా రొమాంటిక్ గా సాగుతుంది. ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకోవడానికి కేరళకు పారిపోవడంతో సెండాఫ్ కు లీడ్ ఇస్తారు.
ఇక సెకండాఫ్ లో విలేజ్ డ్రామాను ఎక్కువగా చూపించారు. పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే రెండు వర్గాలను ఈ ప్రేమ జంట ఎలా ఏకం చేసింది… అందుకోసం వాళ్లు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశారు అనేది చూపించి.. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇస్తుంది. చివర్లో వాయిస్ ఓవర్ లో ఓ మెసేజ్ కూడా ఇచ్చింది చిత్ర బృందం.
చంద్రహాస్ మొదటి సినిమా కంటే ఇందులో నటన, డ్యాన్స్ పరంగా మెరుగు పడ్డారు. ఆహార్యం మీద ఇంకా దృష్టి సారించాలి. గ్రూమింగ్ మరింత అవ్వాలి. మేఘన ముఖర్జీ విలేజ్ అమ్మాయి పాత్రలో బాగా ఒదిగిపోయి నటించింది. గడసరి అమ్మాయి పాత్రలో జీవించిందనే చెప్పొచ్చు
అలాగే రొమాంటిక్ సీన్స్ లో కూడా బాగా కనిపించింది. సర్పంచ్ గా మురళీ ధర్ రావు ఎప్పటిలాగే మెప్పించాడు. హీరోయిన్ అన్న పాత్రలో నటించిన అర్జున్ మహి కూడా తన పాత్రకు న్యాయం చేశారు. మిగతా పాత్రలన్నీ ఒకే అనిపిస్తాయి.
ఈ ఆధునిక సాంకేతిక కాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రెండు వర్గాల నేపథ్యాన్ని బాగా చూపించారు. క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఆటలను బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఈ వీకెండ్ లో సరదాగా చూసేయండి.
రేటింగ్: 3










