చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్ (Summer Holidays) వచ్చాయంటే చాలు.. అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లడం, కొత్త స్నేహాలు, ఆటపాటలు, అల్లరి, పల్లెటూరి వాతావరణం.. ఇలా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మనసులో మెదులుతాయి. అలాంటి అందమైన బాల్య జ్ఞాపకాలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ‘సమ్మర్ హాలిడేస్’. ఇద్దరు పిల్లలు, అమ్మమ్మగారి ఇల్లు, పల్లెటూరి జీవితం, కుటుంబ అనుబంధాలు, చిన్న చిన్న ఆశలు.. ఇలా పలు భావోద్వేగ అంశాలతో దర్శకుడు శ్రీకర్ నయన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
సిటీలో పెరిగిన రావూరి వెంకటేష్ అలియాస్ RV (అరుణ్ దేవ్) చదువులో మంచి ప్రతిభ చూపించినా, తండ్రి (హర్షవర్ధన్) పెట్టే కఠినమైన నిబంధనలతో ఇబ్బందిపడుతుంటాడు. చదువు, మార్కులు, ర్యాంకులు తప్ప మరే విషయానికీ ప్రాధాన్యత ఇవ్వని తండ్రి వైఖరితో విసిగిపోయిన RVకి సమ్మర్ హాలిడేస్‌లో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లే అవకాశం వస్తుంది.
అదే ఊరిలో కాశి వెంకటేశ్వర్లు అలియాస్ KV (రోహన్) తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. తండ్రిని కోల్పోయిన KV ఎన్నో కష్టాల మధ్య కూడా చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటూ జీవితాన్ని సరదాగా గడుపుతుంటాడు. తన తల్లికి సొంతంగా ఓ చీర కొనివ్వాలనే చిన్న కోరికతో మామిడి చెట్లను లీజుకు తీసుకొని కష్టపడతాడు.
అమ్మమ్మ ఇంటికి వచ్చిన RVకి KV పరిచయం కావడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చేసే అల్లరి, పల్లెటూరి అనుభవాలు, ఆటపాటలు, జీవితంలో ఎదురయ్యే అనుభవాలే కథలో ప్రధాన ఆకర్షణ. ఈ ప్రయాణంలో ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? KV తన తల్లి కోరికను నెరవేర్చాడా? RV తన తండ్రి ఆలోచనా విధానాన్ని మార్చగలిగాడా? అనేది తెరపై చూడాల్సిందే.
కథనం – విశ్లేషణ
అమ్మమ్మగారి ఇల్లు, పల్లెటూరి వాతావరణం, వేసవి సెలవులు.. ఈ అంశాలు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో తమ బాల్యాన్ని గుర్తుచేస్తాయి. దర్శకుడు శ్రీకర్ నయన్ ఈ నాస్టాల్జిక్ అంశాలను కథలో చక్కగా మేళవించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా RV, KV పాత్రల మధ్య స్నేహం, వారి చిన్న చిన్న సరదాలు, పల్లెటూరి అనుభవాలు ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తాయి.
కథలో కేవలం పిల్లల అల్లరినే కాకుండా, వారి వెనుక ఉన్న కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రుల ఆశలు, పిల్లలపై చదువు ఒత్తిడి, చిన్న చిన్న కోరికల విలువ వంటి అంశాలను కూడా స్పృశించారు. KV తన తల్లికి చీర కొనివ్వాలనే లక్ష్యంతో చేసే ప్రయత్నం కథకు మంచి భావోద్వేగాన్ని జోడిస్తుంది. ఈ పాత్ర ద్వారా పిల్లల మనసులో ఉండే ప్రేమ, బాధ్యత, కుటుంబంపై ఉన్న అనుబంధాన్ని దర్శకుడు చూపించారు.
ఫస్ట్ హాఫ్ సరదా సన్నివేశాలు, పిల్లల మధ్య స్నేహం, హాస్యంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. ఇంటర్వెల్ సన్నివేశం కథపై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్‌లో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా తల్లి కోసం KV పడే కష్టం, అమ్మమ్మతో RVకి ఏర్పడే అనుబంధం వంటి సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.
కొన్ని చోట్ల కథనం నెమ్మదించినా, సినిమాలోని భావోద్వేగ అంశాలు కథను ముందుకు నడిపిస్తాయి. 2001 నాటి నేపథ్యాన్ని ఎంచుకోవడం వల్ల అప్పటి పల్లెటూరి జీవనశైలి, పిల్లల ఆటలు, కుటుంబ సంబంధాలను గుర్తుచేసే అవకాశం కలిగింది. ముఖ్యంగా చిన్నప్పుడు చదువు కోసం కష్టపడినవారికి, అమ్మమ్మగారి ఇంట్లో వేసవి సెలవులు గడిపినవారికి ఈ సినిమా మరింత దగ్గరగా అనిపిస్తుంది.
నటీనటుల నటన
అరుణ్ దేవ్ తన పాత్రలో మరోసారి మంచి నటనను ప్రదర్శించారు. RV పాత్రలోని అమాయకత్వం, తండ్రి పట్ల భయం, పల్లెటూరిలోకి వచ్చాక కలిగే స్వేచ్ఛ, భావోద్వేగాలను చక్కగా పలికించారు.
రోహన్ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. KV పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కామెడీతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన ప్రతిభను చూపించారు. అరుణ్ దేవ్‌తో ఆయన కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయి.
హర్షవర్ధన్ కఠినమైన తండ్రి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. వాసుకి తల్లి పాత్రలో సహజంగా నటించారు. అమ్మమ్మ పాత్రలో జయసుధ తన అనుభవంతో పాత్రకు ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చారు. రాజీవ్ కనకాల తన పాత్ర పరిధిలో ఆకట్టుకున్నారు. హర్షిని కోడూరి, మహేష్ ఆచంట, ఖుషి, రమణ భార్గవ్, జబర్దస్త్ అశోక్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు శ్రీకర్ నయన్ ఒక చిన్న పాయింట్‌ను తీసుకొని కుటుంబ అనుబంధాలు, బాల్య జ్ఞాపకాలు, పిల్లల భావోద్వేగాలతో కూడిన కథగా మలిచారు. కథలోని ప్రధాన భావాన్ని ప్రేక్షకులకు చేరవేయడంలో మంచి ప్రయత్నం చేశారు.
సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. గోదావరి ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లు, పల్లెటూరి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. 2001 నాటి నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన పని బాగుంది.
శింజిత్ ఎర్రమిల్లి అందించిన పాటలు కథకు అనుగుణంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాలకు మంచి తోడ్పాటునిచ్చింది. కొన్ని సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో మరింత వేగం పాటించి ఉంటే సినిమా ఇంకా బిగువుగా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో కథను సహజంగా చూపించేందుకు నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై కనిపిస్తుంది.
ఫైనల్‌గా..
‘సమ్మర్ హాలిడేస్’ కేవలం పిల్లల అల్లరి, ఆటపాటలతో నిండిన సినిమా మాత్రమే కాదు. బాల్యం, స్నేహం, తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ అనుబంధాలు, చిన్న చిన్న కోరికల విలువను గుర్తుచేసే ప్రయత్నం. అరుణ్ దేవ్, రోహన్‌ల సహజ నటన, పల్లెటూరి నేపథ్యం, జయసుధ పాత్ర, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలంగా నిలుస్తాయి. అక్కడక్కడా కథనం నెమ్మదించినా, కుటుంబంతో కలిసి చూడదగ్గ మంచి భావోద్వేగ చిత్రంగా నిలుస్తుంది. చిన్నారులకు వినోదాన్ని, పెద్దలకు చిన్ననాటి జ్ఞాపకాలను అందించే సినిమా ఇది.
చివరగా.. సమ్మర్ హాలిడేస్ – బాల్య జ్ఞాపకాలకు భావోద్వేగాల తోడు!
రేటింగ్: 3/5









