మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఆరోగ్య సమస్యలను జయించి టాలీవుడ్ క్వీన్ సమంత లీడ్ రోల్‌లో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన చిత్రం మా ఇంటి బంగారం. ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి – సమంత కాంబినేషన్‌లో వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ‘ట్రాలాల పిక్చర్స్’ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు అత్యున్నత నిర్మాణ విలువలటో నిర్మించారు. భారీ అంచనాల మధ్య నేడు (జూన్ 19, శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం!
కథ:
స్వర్ణ (సమంత) తన భర్త డాక్టర్ హనీ (దిగంత్)తో కలిసి చాలా కాలం తర్వాత అతని సొంత ఊరు ‘బల్లవరం’ వస్తుంది. హనీ చెల్లి పెళ్లి కోసం వచ్చిన స్వర్ణకు అత్తగారింట్లో ఆరంభంలో కొన్ని వింత పరిస్థితులు ఎదురవుతాయి. పద్ధతులు, కట్టుబాట్లు తెలియక అందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడుతుంది. కానీ స్మార్ట్‌గా అందరి మనసులు గెలుచుకుంటూ, బెస్ట్ కోడలిగా మార్కులు కొట్టేసే ప్రయత్నంలో ఉంటుంది.
కట్ చేస్తే… స్వర్ణ గతం ఆమెను వెంటాడుతుంది. జైల్లో ఉన్న కరుణ (గుల్షన్ దేవయ్య) అనే గ్యాంగ్‌స్టర్ మనుషులు స్వర్ణను ‘ఝాన్సీ’ అనుకుని చంపడానికి వస్తారు. అయితే స్వర్ణ తనను రక్షించుకునే క్రమంలో విలన్ మనిషిని ఖతం చేస్తుంది. రంగంలోకి దిగిన కరుణ… స్వర్ణ పెళ్లి చేసుకుందని తెలిసి షాక్ అవుతాడు. తనతో వచ్చేయాలని, లేదంటే ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తానని బెదిరిస్తాడు. అసలు స్వర్ణకు, కరుణకు ఉన్న సంబంధం ఏంటి? ఝాన్సీ ఎవరు? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వర్ణ చేసిన సాహసోపేతమైన పోరాటం ఏంటి? అనేదే మిగిలిన ఆసక్తికరమైన కథ.
మూవీ విశ్లేషణ:
క్రైమ్ బ్యాక్‌డ్రాప్ ఉన్న ఒక అమ్మాయి, తన గతాన్ని దాచిపెట్టి ఒక సాదాసీదా హౌస్‌వైఫ్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించడం… మళ్లీ గతం దాడి చేసినప్పుడు కుటుంబాన్ని కాపాడుకునేందుకు తిరగబడటం అనే పాయింట్ చాలా ఆకట్టుకుంటుంది.
ఫస్టాఫ్:సినిమా ప్రారంభంలో సమంత అత్తగారింట్లో అడుగుపెట్టడం, ఫ్యామిలీ కట్టుబాట్లు తెలియక ఆమె పడే తిప్పలు హిలేరియస్‌గా సాగుతాయి. శ్రీముఖి కంటే బెస్ట్ అనిపించుకోవడానికి సమంత తన ఫ్రెండ్ (మంజూష) సాయంతో వంటలు చేయడం, ముగ్గులు వేయడం వంటి సీన్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. కామెడీతో పాటు విలన్లు వెంటాడే యాక్షన్ ఎపిసోడ్స్‌ను దర్శకురాలు నందిని రెడ్డి చాలా పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ ఇంటర్వెల్ వరకు కథను ఆసక్తికరంగా నడిపించారు.
సెకండాఫ్: ద్వితీయార్థంలో గుల్షన్ దేవయ్య ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. స్వర్ణ-కరుణల మధ్య సాగే మైండ్ గేమ్స్, ఎత్తుకు పైఎత్తులు, హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు సీట్ ఎడ్జ్ అనుభూతినిస్తాయి. ఫ్యామిలీ డ్రామా మరియు ఎమోషన్స్ కూడా సెకండాఫ్‌లో చాలా బాగా వర్కవుట్ అయ్యాయి.
నటీనటుల ప్రతిభ:
సమంత: ఈ సినిమాకు వన్-వుమెన్ ఆర్మీలా నిలిచింది. ఇన్నోసెంట్ హౌస్‌వైఫ్‌గా ఎంతగా నవ్వించిందో… యాక్షన్ సీన్స్‌లో ‘వీరమహిళ’గా అంతగా మెప్పించింది. సమంత కెరీర్‌లో ఇదొక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఆమెకు ఇది గ్రాండ్ కమ్‌బ్యాక్ మూవీ.
గుల్షన్ దేవయ్య: నెగెటివ్ షేడ్స్ ఉన్న కరుణ పాత్రలో గుల్షన్ దేవయ్య స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది.
ఇతర నటీనటులు: హీరోగా దిగంత్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. సెకండ్ కోడలిగా శ్రీముఖి, సమంత ఫ్రెండ్‌గా మంజూష తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. చైతన్య కృష్ణ పోలీస్ పాత్రలో, సీనియర్ నటి శ్రీలక్ష్మి బామ్మ పాత్రలో, గౌతమి అత్తగా, ఆనంద్ పొలిటీషియన్‌గా తమ పాత్రల పరిధి మేర జీవించారు. పెళ్లికూతురిగా చేసిన నటి కూడా మంచి మార్కులు కొట్టేసింది.
సాంకేతిక వర్గం:
సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా పెళ్లి పాట విజువల్‌గా, వినడానికి చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది, విజువల్స్ కనువిందు చేస్తాయి. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంది. దర్శకురాలు నందిని రెడ్డి రాసుకున్న డైలాగ్స్, ఎమోషన్స్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ చక్కగా కుదిరాయి.
ముగింపు:
సమంత మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, అదిరిపోయే యాక్షన్, నవ్వించే కామెడీ, హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన పక్కా కమర్షియల్ బ్లాక్‌బస్టర్ ‘మా ఇంటి బంగారం’. సమంత ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్లలో చూడదగ్గ చిత్రం.
రేటింగ్: 3.25/5










