విలువలకు వారసురాలు.. మా “సీతారామయ్య గారి మనవరాలు” ఈరోజు నుంచే ప్రారంభం..
బుల్లితెరపై భావోద్వేగభరిత దృశ్యకావ్యం… అందమైన అనుబంధాలకు అపురూప ఆవిష్కరణ.. ఆస్తులకు కాదు, ఆశయాలకు వారసత్వం ఉండాలంటూ సగర్వంగా చాటే విలక్షణ ధారావాహిక ‘సీతారామయ్య గారి మనవరాలు’. బలమైన కథ, ఉత్కంఠభరిత కథనం, కన్నులపండువైన సన్నివేశాలు, తూటాల్లా పేలే మాటలు, అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలు మేళవించిన ఈ మెగా డైలీ సీరియల్ వీక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రముఖ నిర్మాత శ్రీధర్ గూడూరు నిర్మాణంలో రూపొందింది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8:30 గంటలకు మీ ఈటీవీలో ఈ సీరియల్ ప్రసారం కానుంది.
కథా నేపథ్యం:
చెక్కుచెదరని ఆదర్శాలతో నిర్మించిన కోట… ఆ కోటను కూల్చేయాలని సొంతవారి కుట్ర! ఈ రెండింటి నడుమ నలిగే ఆ మహా సామ్రాజ్యానికి దిక్కెవరు? రచ్చ గెలిచి ఇంట గెలవలేకపోయిన పెద్దాయనను మనవరాలు ఎలా కాపాడుకుంది? దిగ్భ్రాంతికి గురైతే వెళ్లాల్సిన దారినే మరిచిపోయే బలహీనతను ఆమె ఎలా జయించింది? ఇలాంటి ఆసక్తిరేపే అంశాలతో తొలి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను టీవీ స్క్రీన్ కు కట్టిపడేసేలా కథనం సాగుతుంది.
కుటుంబ బంధాలు బలహీనపడుతున్న ఈ రోజుల్లో… ప్రతీ ఇంటికీ ఓ “సీతారామయ్య” లాంటి పెద్ద దిక్కు ఉండాలనీ, ప్రతీ కుటుంబానికీ ఆ పరువు నిలబెట్టే ఓ “మనవరాలు” ఉండాలనీ అనిపించేలా మహేంద్ర వర్మ ఎల్.డి దీనికి స్క్రీన్‌ప్లే అందించారు.
దర్శకుడు ఆర్కే మలినేని (మలినేని రాధాకృష్ణ) మాట్లాడుతూ:
“‘పుత్తడిబొమ్మ’, ‘స్వాతిచినుకులు’, ‘మనసంతా నువ్వే’ వంటి విజయవంతమైన సీరియల్స్ తర్వాత బుల్లితెరపై సరికొత్త సాంకేతిక విప్లవం తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాం. గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా తీర్చిదిద్దాం. సొంత ఇల్లే శత్రువుగా మారిన వేళ, శిథిలమైన ఇంటికే శ్రీరామరక్షగా నిలబడే ఓ ఆడపిల్ల ధైర్యం చూసే ప్రతీ గుండెను హత్తుకుంటుంది. సుమారు 1000 ఎపిసోడ్ల పాటు సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది” అని తెలిపారు.
నటీనటులు:
‘స్వాతిచినుకులు’ ఫేమ్ రచిత ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. పరమేశ్వరి, శివపార్వతి, ప్రశాంత్, అక్షయ, ఆట మౌనిక, పరమేశ్వరి, హీరోలు హేమంత్, రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
* దర్శకత్వం: ఆర్కే మలినేని (మలినేని రాధాకృష్ణ)
* నిర్మాత: శ్రీధర్ గూడూరు
* స్క్రీన్‌ప్లే: మహేంద్ర వర్మ ఎల్.డి
* సంగీతం: షకీల్ (ర్యాప్ రాక్)
* సినిమాటోగ్రఫీ: ప్రకాష్ కోట్ల
* ఎడిటింగ్: రవి
* ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కుర్రా వెంకట చలపతి రావు
* లైన్ ప్రొడ్యూసర్: సందీప్ యడ్లపల్లి
ప్రసార వివరాలు:
ఈ రోజు నుండి.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8:30 గంటలకు మీ ఈటీవీలో….










