మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి తాజాగా నటించిన చిత్రం #అనగనగా ఒక రాజు “. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ప్రచార ప్రోమోలతో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: గౌరవపురం జమీందారు గోపరాజు మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి)… పేరుకే గొప్ప జమీందారు మనవడు. ఆస్తులేమీ పెద్దగా ఉండవు. అయితే గొప్ప జమీందారుని గా కలలు కంటూ ఉంటాడు. ఎలాగైనా ఓ గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని కోటీశ్వరునిగా స్థిరపడిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో పెద్దిపాలెం భూపతి రాజు (రావు రమేష్) ఒక్కగానొక్క కూతురు చారులత (మీనాక్షి చౌదరి)ని చూసి రాజు ఇష్టపడతాడు. పైగా వాళ్లకి కోట్లకి కోట్లు ఆస్తులు ఉన్నాయని తెలిసి ఎలాగైనా ఆమెని పెళ్లాడాలని ‘ఆపరేషన్ చారు’ అంటూ పెద్ద రకరకాలుగా ప్లాన్స్ వేసి గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటాడు.. అయితే ఫస్ట్ నైట్ రోజు రాజు చేతికి వాళ్ల మావయ్య భూపతి రాజు రాసిన లెటర్ చూసి రాజు షాక్ కి గురవుతాడు. తన మావయ్య ఆ లెటర్‌లో ఏమి రాశాడు? పెళ్లితో కోటీశ్వరుడు అయిపోదామనుకున్న రాజు కల నెరవేరిందా? పెద్దపాలెం పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ.. కథనం విశ్లేషణ: ఈ సినిమాకి నవీన్ పోలిశెట్టి… కథ… స్క్రీన్ ప్లే…సంభాషణలు కూడా రాశారు అనగానే… ఇక సినిమాపై ప్రేక్షకులకు ఓ అంచనా వచ్చేస్తుంది. నవ్వించాడా అనేకంటే… ఎంత నవ్వించాడు అని అడిగేవాళ్లే ఎక్కువ. ఇప్పుడున్న కుర్ర హీరోల్లో ఈ రేంజ్ కామెడీ టైమింగ్ ఉన్న వాళ్లు చాలా తక్కువ. నవీన్ మంచి రైటర్ కూడా కావడం సినిమాకి అదనపు బలం యాడ్ అయింది.
గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా ఎంటర్టైనర్ మూవీ ఇది. కోటీశ్వరుడు కావాలనే ఓ అత్యాశ ఉన్న కుర్రాడి గా… నవీన్ పోలిశెట్టి ఇచ్చే బిల్డప్‌లు, కవరింగ్‌లతో మొదలైన ఈ నవ్వులు.. హీరోయిన్‌ని పడేయడానికి వేసే ప్లాన్ “ఆపరేషన్ చారు”తో ఇంకా రెట్టింపు అవుతుంది. పెద్దిపాలెం బీచ్‌ని గోవాగా మార్చిన సీన్.. హీరోయిన్‌తో కలిసి చేసే పారా గ్లైడింగ్ సీన్ థియేటర్లో నవ్వులు పూయించాయి. ఆ సీన్లలో నవీన్ కామెడీ అదిరిపోయింది. ఇక పెళ్లి అయిన తర్వాత హీరోకి ఒక నిజం తెలియడంతో నవీన్‌కి షాక్.. ఆడియన్స్‌కి బ్రేక్ అంటూ ఇంటర్వెల్‌కి మంచి బ్యాంగ్ ఇచ్చారు. సెకండాఫ్ మొత్తం ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం.. ప్రజా సమస్యలు అంటూ నవీన్ చేసిన కామెడీ హంగామా కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎమోషనల్ టర్న్ కూడా సినిమాకి ప్లస్ అయింది.
నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో చేశాడు. తన మార్క్ మ్యానరిజం తో ఆద్యంతం అలరించాడు. మీనాక్షితో కెమిస్టీ బాగా కుదిరింది. కాసేపు వున్నా రావు రమేష్ ఆకట్టుకుంటాడు. ఇక మిగిలిన పాత్రల్లో మహేష్ ఆచంట, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, ముక్కు అవినాష్, యాంకర్ ఝాన్సీ తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. విలన్ పాత్రలో కనిపించిన కన్నడ నటుడు తారక్ పొన్నప్ప బానే యాక్ట్ చేశాడు. ఎమ్మెల్యేగా నటుడు మధు కాసేపు కీలకమైన పాత్ర పోషించాడు.
హీరో నవీన్ పోలిశెట్టి రాసిన కథ… కథనాలను దర్శకుడు మారి… ఏమాత్రం తడబాటు లేకుండా వెండితెరపై ఆవిష్కరించాడు. దర్శకునిగా స్థిరపడటానికి ఈ సినిమా మంచి లాంచ్ ప్యాడ్ అవుతుందనడంలో సందేహం లేదు. గ్రామీణ నేపథ్యాన్ని ఒడిసిపట్టడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అదనపు బలం. పాటలన్నీ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. లాజిక్ లు వెతక్కుండా సరదాగా ఈ పొలిటికల్ సెటైరికల్ ఎంటర్టైనర్ ను చూసేయండి.
రేటింగ్: 3










