డైరెక్టర్ పవన్ కుమార్ ఇప్పుడు హీరోగా మారి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమాలో పవన్ కుమార్ హీరోగా నటించడమే కాక తనే ఈ సినిమాని నిర్మిస్తూ డైరెక్షన్ చేసాడు. సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ హీరోయిన్స్ గా ఝాన్సీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటించగా శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు. యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా నేడు ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజయింది.
కథ: నాని(పవన్ కుమార్)… క్లాసులో యావరేజ్ స్టూడెంట్. చదువును చాలా లైట్ తీసుకుని సరదాగా గడిపేస్తుంటాడు. దాంతో ఎప్పుడూ ఇంట్లో తిట్లు తింటూనే ఉంటాడు. తండ్రి (రాజీవ్ కనకాల) ఓ చిన్న షాపు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. అతని భార్య (ఝాన్సీ) హౌస్ వైఫ్. వీరికి కూతురు (వివియా సంపత్) కూడా ఉంటుంది. ఇద్దరి పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. అయితే నానిని మంచి చదువులు చదివించాలనే కోరికతో తండ్రి ఎప్పుడూ తిడుతూ ఉంటే… ఇంట్లో వున్న తల్లి, అక్క మాత్రం అతన్ని గారాబం చేస్తూ వుంటారు. అయితే అక్క అంటే మాత్రం నానికి ఇష్టం వుండదు. అయితే బి.టెక్ ఎంట్రన్స్ లో నానికి ర్యాంక్ రాకపోయినా… నాని అమ్మ ఏదో ఒకటి చేసి మెకానికల్ లో సీట్ సంపాదిస్తుంది. అక్కడ తన సీనియర్ సారా(స్నేహా మాల్వియా)తో ప్రేమాయణం సాగిస్తాడు. అయితే నానిని కాదని… సారా వేరే కుర్రాడితో ఎంగేజ్ మెంట్ చేసుకుంటుంది. అయితే నానిని తన క్లాస్ మేట్ అయిన అను(సాహిబా భాసిన్) ఇష్టపడుతుంది. ఓ అదే సమయంలో నాని అక్కపై దాడి జరిగి కోమాలోకి వెళ్తుంది. అక్క తన కోసం చేసిన త్యాగం నానికి తెలుస్తుంది. దీంతో నాని చనిపోవాలనుకుంటాడు. మరి నాని చనిపోయాడా?నాని కోసం అక్క చేసిన త్యాగం ఏంటి? నాని ప్రేమించిన ఇద్దరి అమ్మాయిల్లో ఎవరితో సెటిల్ అయ్యాడు? నాని అక్క ఎందుకు కోమాలోకి వెళుతుంది? యావరేజ్ స్టూడెంట్ నాని… జీవితంలో ఏం సాధించాడు? ఎలా విజయతీరాలకు చేరాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ:
ఓ మాములు అల్లరి చిల్లరగా తిరిగే స్టూడెంట్ లైఫ్ లో ఎలా సక్సెస్ అవుతాడు అనే కథాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ యావరేజ్ స్టూడెంట్ నాని కూడా అదే కోవలోకి చెందింది. అల్లరి చిల్లరిగా తిరిగే నాని ఇంజనీరింగ్ లో ఎలా జాయిన్ అయ్యాడు? ఇద్దరి అమ్మాయిలతో ప్రేమాయణం ఎలా సాగింది అని చూపిస్తూనే అక్క, అమ్మ ఎమోషన్ ని బాగానే పండించారు. అలాగే చదువు వేరు, ట్యాలెంట్ వేరు. చదువు లేకపోయినా క్యారెక్టర్, ట్యాలెంట్ ఉంటే చాలు లైఫ్ లో సక్సెస్ అవ్వొచ్చు అనే పాయింట్ ని ఎంటర్టైనింగ్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా నాని అల్లరి, సారాతో ప్రేమాయణం, కాలేజీ ర్యాగింగ్ గొడవలు చూపించి ఇంటర్వెల్ ముందు సారా ఇంకొకరిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం, అక్క కోమాలోకి వెళ్లడం చూపించి నెక్స్ట్ హీరో ఏం చేస్తాడు అని ఆసక్తి కలిగించారు. ఇక సెకండ్ హాఫ్ లో అనుతో ప్రేమాయణం… నాని లైఫ్ లో సక్సెస్ అవ్వడం చూపిస్తారు. ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్స్ తో వచ్చే ఒక మాస్ సాంగ్ మాత్రం థియేటర్స్ మాస్ ను మెప్పిస్తుంది.
డైరెక్టర్ పవన్ కుమార్ హీరోగా మారి… తనకు నటనపై ఉన్న ఆసక్తి ఏపాటితో ఇందులో అన్ని కోణాల్లోనూ నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అందులో విజయం సాధించారు కూడా. ఎమోషన్స్, రొమాన్స్, సెన్సాఫ్ హ్యూమర్ ఇలా అన్నింటిలోనూ తన మార్కును చూపించి మెప్పించే ప్రయత్నం చేశారు. ఇద్దరు హీరోయిన్స్ సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ అందానికే పరిమితమయ్యారు. స్నేహ కొన్ని సీన్స్ లో ఎమోషనల్ గా కూడా మెప్పిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ తల్లి పాత్రలో ఝాన్సీ, తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల బాగా నటించారు. హీరో అక్క పాత్రలో వివియా సంపత్ పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత…. హీరో పవన్ కుమార్ యే కాబట్టి… కథ… కథనాల్లో కొంచెం కొత్తదనం ఉండేలా చూసుకున్నారు. అన్ని సమపాళ్లలో వుండేలా చూసుకుని సినిమాని రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. మాస్, మెలోడీ సాంగ్స్ లో పవన్ ఆకట్టుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. మేకింగ్ పరంగ సినిమా రిచ్ లుక్ కనిపిస్తుంది. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. సో… ఈ వీకెండ్ లో సరదాగా ఈ యావరేజ్ స్టూడెంట్ ని చూసేయండి.
రేటింగ్: 3